Abn logo
May 24 2020 @ 00:22AM

మైక్రోవేవ్‌ తరంగాల్లో దేవుళ్ళు!

Kaakateeya

అంతర్జాలం ద్వారా  పూజలు, వివాహ నిశ్చితార్థాలు, అంత్యక్రియలు నిర్వహిస్తున్న కాలమిది. కరోనా విలయం ఈ అధునాతన అనుష్ఠాలను అనివార్యం చేసింది. మత పెద్దలూ ఆమోదిస్తున్న ఈ నవీన ఆచార తత్పరతను ఎందుకు కొనసాగించకూడదు ? కరోనా నిర్బంధ కాలం  మానవాళి ముందుకు తెచ్చిన అతి ముఖ్యమైన ప్రశ్న ఇది.


మత నివేశనాలలోనూ, మతవిషయిక ఆచారాలలోనూ ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని భారత రాజ్యాంగం నిర్దేశించింది. అయితే ఏ మత కార్యకలాపాలనూ బహిరంగంగా జనసమూహాలతో చేయవద్దని కరోనా కాలంలో ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసాయి. ఎన్ని ఆంక్షలు, అడ్డంకులు ఉన్నా మనిషి ఆగలేదు. ఆధ్యాత్మిక చింతనకు మతపరమైన ఆచారాలను పాటించడానికి వేరే దారులు వెదుకుతూనే ఉన్నాడు. అందులో ఒకటి ఇంటిలోనే ఉండి పూజలు, ప్రార్థనలు చేసుకోవడం. ఇంటర్నెట్ ద్వారా తన ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించుకోవడం మరొక మార్గం. ఈ ప్రక్రమంలో (process)లో ఏమి జరుగుతుందో చూద్దాం.


అమెరికాలో ఉన్న ఒక అబ్బాయికి వివాహ నిశ్చితార్థం కార్యక్రమాన్ని ఇక్కడున్న పూజారి, ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించాడు. ల్యాప్‌టాప్‌లో, ఫేస్ బుక్‌లో అబ్బాయి లైవ్ లాగ్‌ఆన్ అయి ఉండగా, ఇక్కడ అమ్మాయి, వధూవరుల బంధువులు ఇంట్లో కూర్చుని, వారు కూడా ఆన్‌నైన్‌లో అక్కడున్న అబ్బాయికి కనిపిస్తూ నిశ్చితార్థాన్ని చేసుకున్నారు. ఒక వ్యక్తి లాక్‌ డౌన్‌కు రెండు రోజుల ముందు కొత్త బండి కొన్నాడు. కానీ పూజ చేయించలేదు. అతను బండి ఫోటోను గుడిలోని పూజారికి పంపించాడు దానికి పూజారి వాహన పూజచేశాడు. ఈ సేవకు గాను గుడి ఎకౌంట్‌కి సదరు వ్యక్తి డబ్బు చెల్లించాడు. చాలా గుడులలో పూజలు ఆన్‌లైన్‌ సేవల ద్వారా నిర్వహిస్తున్నారు. ఇంటర్ నెట్, మొబైల్‌ ఫోన్ ద్వారా లాగ్ ఆన్‌ అయి, దేవుళ్ళకు పూజలు చేయిస్తున్నారు. శుభకార్యాలు కూడా ఇలాగే జరుగుతున్నాయి. పెండ్లిండ్లు కేవలం నలుగురు బంధువులతో ఇంట్లో చేయించడం జరిగింది. కానీ ఇతర బంధుగణమంతా ఆన్‌లైన్‌లో పెండ్లిని లైవ్‌గా చూశారు. ఫోన్ ద్వారా లైవ్ వీడియో అందరికీ అందుబాటులోకి వచ్చింది కదా. ఇటువంటి శుభ కార్యాలేకాదు, అంత్యక్రియలు లాంటి అశుభ మత కార్యక్రమాన్ని కూడా సంకేతాత్మకంగా చేయవచ్చని ఒక ఘటన సాక్ష్యమిస్తూ ఉంది.


ఒక యువకుడు ఢిల్లీలో కరోనా వైరస్ సోకి చనిపోయాడు. వేరే రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు అతని బొమ్మని చితిమీద పెట్టి కాల్చారు. ఇది మతపరమైన ఆచార కార్యక్రమం. పవిత్ర కార్యంగా కూడా దీన్ని భావిస్తారు. శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరపకపోతే చనిపోయిన వ్యక్తి ఆత్మ ఉత్తమ గతులకు పోకుండా పిశాచం అవుతుందని ‍ఒక నమ్మకం. అంత్యక్రియలు ఆచారం ప్రకారం జరిపితే మృతదేహం పవిత్రీకరింపడబడుతుందని నమ్మకం. కాని ఇక్కడ శవం లేదు దాని బదులు అతని బొమ్మని పెట్టి అంత్యక్రియలు జరిపారు. దానివల్ల అక్కడున్న శవానికి అవి జరిగినట్లుగా భావిస్తారు. అంటే ఇక్కడ పవిత్ర కార్యం కూడా ప్రయాణం చేసిందని అర్థం. పైన చెప్పిన అన్ని ఘటనలలోనూ పవిత్రత, ఆధ్యాత్మికత ఆచారాలు అనేవి ప్రయాణం చేశాయి. ఇంటర్ నెట్ అనేది ఒక కొత్త మార్గంగా మనుషులకు అందివచ్చింది.


అయితే ఆన్‌లైన్ పూజలు ఆన్‌లైన్ భక్తి మనకు ఇప్పుడే రాలేదు. చాలా సంవత్సరాల క్రితమే వచ్చింది. 1987-–88 ప్రాంతాలలోనే టీవీలో రామాయణం, మహాభారతం ఇతిహాసాలు ప్రసారమయ్యాయి. దీనితో మన టీవీ సెట్లు కూడా పవిత్ర వస్తువులు, మార్గాలు అయ్యాయి. రామాయణం సీరియల్ కార్యక్రమం మొదలవ్వగానే అశేష ప్రజలు టీవీ సెట్ల ముందు కొబ్బరి కాయలు కొట్టి తమ భక్తిని చాటుకున్న వార్తలు ఆ రోజుల్లో విరివిగా వచ్చాయి. ఇక మహాభారతం సీరియల్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దానికి కూడా కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేశారు.


టీవీలు లేని కాలంలో కూడా మనకు ఆన్‌లైన్ పవిత్రత కనపడింది. మా పల్లెల్లో శనివారం పొద్దుటి పూట వేంకటేశ్వర సుప్రభాతం ఆ రోజుల్లో రేడియోలో ప్రసారం చేసేవారు. అది వచ్చినంత సేపు రేడియోని కింద పెట్టేవారు కాదు. సుప్రభాతం వచ్చే సమయంలో రేడియోని ఎక్కడబడితే అక్కడ పెడితే పెద్దవారు అది పాపం అని కోపపడే వారు. భద్రాచలం రామనవమి కార్యక్రమాలు నాలుగు ఐదు దశాబ్దాల క్రితమే రేడియోలో పండితుల వ్యాఖ్యానంతో ప్రసారమయ్యేవి. నాటి మహా పండితులు జమ్మలమడక మాధవరామశర్మ, దివాకర్ల వేంకటావధాని తదితరులు వ్యాఖ్యానం చెప్పేవారు. సజీవంగా చూచిన అనుభూతి ప్రజలకు కలిగేది. అది వచ్చినంత సేపు రేడియో పవిత్రవస్తువుగా భావించబడింది.


తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల టీవీలు పవిత్ర వస్తువులు అయ్యేవి. ఇండ్లలోనే కొబ్బరి కాయలు స్వామివారికి అర్పించేవారు. స్వామివారికి ఒక చానెల్ ప్రత్యేకంగా ఏర్పాటయిన తర్వాత ఉదయం పూట సుప్రభాత సేవలను లైవ్ ప్రసారం చేస్తుంటే పవిత్ర కార్యంగా చూసేవారు భక్తులు. నేడు కరోనా కాలంలో తిరుమల వేంకటేశ్వర స్వామి భక్తులు కేవలం ఆన్‌లైన్ ప్రసారాలపైనే ఆధారపడ్డారు. 


గుడి హుండీలో ధనం కాని బంగారం కాని వేయడాన్ని అనాదిగా పవిత్ర కార్యంగా భావించబడుతూ ఉంది. కాని నేడు భక్తులు ఆన్‌లైన్ బ్యాంకు ట్రాన్స్‌ఫర్ ద్వారా గుడి అకౌంటుకు తమ కానుకలు పంపిస్తున్నారు. తిరుమల గుడి E-Hundi పథకాన్ని చాలా కాలం క్రితమే ప్రవేశ పెట్టింది. అంటే అమెరికాలో ఉన్న భక్తుడు కాని హైదరాబాదులో ఉన్న భక్తుడు కానీ తన పవిత్రమైన కానుక ధనాన్ని ఆన్‌లైన్‌లో పంపి స్వామివారి దయను ఆన్‌లైన్‌ సేవద్వారానే పొందడం సాధ్యమయింది. ఈ ఆన్‌లైన్‌ ప్రసారాలన్నీ కూడా microwave తరంగాల పైనే ఆధారపడి జరుగుతాయి. అంటే మన దేవుళ్ళు మతాచారాలు అన్‌లైన్‌లోని మైక్రోవేవ్‌ లపైన ప్రయాణం చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.


కాని ఈ మైక్రోవేవ్‌లను ఎవరు సృష్టించారు అనేది నేటికీ చెప్పలేని ప్రశ్న. ఈ గ్రహాలను సౌరమండలాలను సృష్టించినది ఎవరు వీటి చలనాలను క్రమం తప్పకుండా నడిపేది ఎవరు అన్నవి నేటికీ పూర్తిగా సమాధానం దొరకని ప్రశ్నలు. సైన్సు చెప్పేదాని ప్రకారం అణువు లేదా జీవశక్తి లేదా భౌతిక శక్తిలోనుండే అన్నీ పుడతాయి. కానీ ప్రకృతిని అర్థం చేసుకునే క్రమంలో మనం ఇంకా మొదటి రెండుమూడు మెట్ల దగ్గరే ఉన్నాము. ఆధునిక విజ్ఞానశాస్త్రాల వయస్సు నాలుగు లేక ఐదు శతాబ్దాలు అనుకుంటే మనం ఐదో మెట్టు మీదే ఉన్నామని, ప్రకృతి శక్తిని అర్థం చేసుకోవడానికి ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాలని తెలుస్తుంది.


ఐమ్యాక్, ఐఫోన్‌ల సృష్టికర్త, నేటి సాంకేతిక పరిజ్ఞానానికి ప్రతీక అయిన స్టీవ్‌జాబ్స్ ఒక ఆలోచనాత్మక వ్యాఖ్య చేశాడు. ‘మొబైల్‌ని మనం తయారు చేశాము. దానికి అవసరమైన చాలా పరికరాలు మనమే చేశాము. మైక్రోవేవ్ టవర్లను మనమే చేశాము. సిగ్నల్స్ ఒక చోటినుండి ఒక చోటికి పోవడానికి ఫోన్లు పనిచేయడానికి ఈ మైక్రోవేవ్ టవర్లే ఆధారం కాని ఈ మైక్రోవేవ్స్‌ని మనం తయారు చేయలేదు, చేయలేము. ఆ వేవ్స్ లేకపోతే ఇవన్నీ వృథా. మరి ఈ మైక్రోవేవ్స్‌ని ఎవరు తయారు చేశారు?’ అని స్టీవ్ జాబ్స్‌ ప్రశ్నించాడు. ఇది సమాధానం లేని ప్రశ్నే. చికాగో పోవడానికి ఓడలో సముద్ర ప్రయా ణం చేస్తున్న వివేకానందుడు ఒక వెన్నెల రాత్రి చంద్రకిరణాలు సముద్రం అలలమీద పడి కనిపించిన అద్భుతమైన కాంతివర్ణాల సౌందర్యాన్ని చూసి. ఈ వెన్నెలను ఈ సంద్రాన్ని చేసిన ఆ వ్యక్తి మరెంత సౌందర్యవంతుడో అని అనుకున్నాడట.


ప్రకృతి శక్తులు సృష్టించిన ఈ మైక్రోవేవ్ తరంగాల పైన నేడు జరుగుతున్న మతాచారాకాండని కరోనా కాలంలోనే కాకుండా మనుషులు ఎల్లప్పటికీ అదే విధంగా అనుష్ఠిస్తూ మరింత సౌకర్యవంతంగా సులభంగా తమ ఆధ్యాత్మిక అవసరాలను తీర్చుకోవడం సాధ్యం కాదా? పవిత్ర రంజాన్ వేడుకలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను అన్నింటిని ఇంటికే పరిమితం చేసుకోవచ్చునని ఇస్లాం మతస్థులు భావిస్తున్నారు. కరోనా విపత్తు గణపతి నవరాత్రుల కాలంలో కాని లేదా దేవీ నవరాత్రుల కాలంలో కానీ సంభవించివుంటే పూజలు, వేడుకలు అన్నీ ఇండ్లలోనే చేసుకునే వారం కాదూ? ఆధ్యాత్మిక చింతన ఏమీ తగ్గకుండా పూజాపునస్కారాలను ఏమతం వారైనా ఇండ్లలోనే చేసుకోవచ్చు కదా అనే ప్రశ్న నేడు అందరి మనస్సులలో ఉదయిస్తోంది. వినాయక నిమజ్జనాన్ని పూర్వకాలంలో మాదిరిగా ఎవరికి వారు ఇండ్లలో చేసుకోకూడదా? దీనివల్ల కోట్ల రూపాయల ధనాన్ని ఆదా చేసుకోవడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని నివారించుకోవడం సాధ్యమవుతుంది.


అలా ఆలోచించడం కుదరదా? అన్ని మతాలు తమ ఆచారాలను పునర్ నిర్వచించుకుంటే మానవ జీవితం మరింత సుఖవంతంగా ఉండదా? అనే మౌలిక ప్రశ్నలను ఈ కరోనా నిర్బంధ కాలం మన ముందుకు తెచ్చింది. మైక్రోవేవ్‌ల పైన నిలిచిన దేవుళ్ళు కూడా మనుషులను ఈ ప్రశ్నలు వేసుకోవలసిందిగా సూచిస్తున్నారు. కరోనా ఒక విషాణువు కాదు మానవజీవితాలను ఆధ్యాత్మికతను పునర్ నిర్వచించడానికి వచ్చిన ఒక కొత్త శక్తి. కరోనా తర్వాత మానవాళి ఆధ్యాత్మిక జీవితంలో ఒక కొత్త అధ్యాయం తప్పక ప్రారంభమవుతుంది.

ప్రొ. పులికొండ సుబ్బాచారి

Advertisement
Advertisement