దేవుడి పంట

ABN , First Publish Date - 2021-12-31T05:43:48+05:30 IST

సిక్కు ధర్మ వ్యవస్థాపకుడు గురునానక్‌ బాల్యం నుంచీ ఆధ్యాత్మిక చింతనలో ఉండేవారు. బడి వదిలిన తరువాత పశువులను తీసుకొని పొలాల్లోకి వెళ్ళేవారు. అక్కడ భజన గీతాలు పాడుతూ ఉండేవారు.

దేవుడి పంట

సిక్కు ధర్మ వ్యవస్థాపకుడు గురునానక్‌ బాల్యం నుంచీ ఆధ్యాత్మిక చింతనలో ఉండేవారు. బడి వదిలిన తరువాత పశువులను తీసుకొని పొలాల్లోకి వెళ్ళేవారు. అక్కడ భజన గీతాలు పాడుతూ ఉండేవారు. 


ఒకసారి ఆయన దైవ ప్రార్థన చేస్తూ ఉండగా, వృద్ధుడైన ఒక రైతు వచ్చాడు. అతను నానక్‌తో... ‘‘నేను వేరే ఊరుకు వెళ్ళాల్సిన పని ఉంది. నాలుగు రోజుల్లో తిరిగి వస్తాను. అంతవరకూ నా పొలానికి నువ్వు కాపాలా కాస్తావా? నా పొలంలో పదకొండు బస్తాల గోధుమ పంట వస్తుంది. నీకు ఒక బస్తాడు గోధుమలు ఇస్తాను’’ అని అడిగాడు. నానక్‌ సరేనన్నారు. ఆ రైతు సంతోషంగా వెళ్ళిపోయాడు.


నానక్‌ ఆ పొలానికి సమీపంలోని ఒక చెట్టు మీద కూర్చొని... కాపలా కాస్తున్నారు. పొలం గోధుమ పంటతో నిండుగా ఉంది. నానక్‌ చూస్తూ ఉండగానే పిచ్చుకల గుంపు ఒకటి ఆ పొలంలో ప్రవేశించింది. పిచ్చుకలు పంటను తినడం మొదలుపెట్టాయి. ఇది చూసిన నానక్‌ ‘‘ఓ దైవమా! ఆ రైతు పంటను కాపాడు. నీ పంటను పిచ్చుకలకు ఇవ్వు’’ అని ప్రార్థించారు.

పిచ్చుకలు రోజూ వచ్చి పంటను తింటున్నాయి. నాలుగు రోజుల తరువాత ఆ పొలం రైతు తిరిగి వచ్చాడు. తన పొలం నిండా పిచ్చుకల గుంపు కనిపించింది. పంట తగ్గినట్టు కనబడింది. దీంతో అతను నానక్‌ మీద విరుచుకుపడ్డాడు.

నానక్‌ అతన్ని శాంతింపజేస్తూ ‘‘దయచేసి కోపం తెచ్చుకోవద్దు. ఈ పంటను కోసుకో. ఎన్ని బస్తాలు వచ్చిందో లెక్కపెట్టుకో. నీ పంట చెక్కుచెదరకుండా ఉంది. పిచ్చుకలు తిన్నదంతా దేవుడి పంటే’’ అన్నారు.

ఆ రైతు నానక్‌ చెప్పినట్టే చేశాడు. కోసిన దిగుబడి పదకొండు బస్తాలు ఉండడం చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఇదంతా దేవుడి దయ, నానక్‌కు దేవుడి పట్ల ఉన్న భక్తేనని గ్రహించాడు. నానక్‌ను క్షమాపణ కోరాడు.


‘‘మన మనస్సు రైతు లాంటిది. మన శరీరం అందమైన పొలం లాంటిది. దేవుడి పేరుతో విత్తనాలను పొలంలో మనం నాటాలి. ఆ విత్తనాలు మొలకెత్తుతాయి, పెరుగుతాయి, ప్రేమ అండతో ఫలాలు కాస్తాయి. నాదైన ఆ పొలం నుంచి, నేను ఎన్నో పంటలు సాగుచేస్తాను. నా మొత్తం కుటుంబానికి ఆహారాన్ని అందిస్తాను’’ అని నానక్‌ అనేవారు. 

Updated Date - 2021-12-31T05:43:48+05:30 IST