ఎవరీ గాడ్‌ మ్యాన్‌? ఏమా కథ?

ABN , First Publish Date - 2020-06-07T05:30:00+05:30 IST

తమిళనాట ఇప్పుడో వెబ్‌ సిరీస్‌ రిలీజుకు ముందే వివాదాస్పదమైంది. హిందూ ధర్మాన్నీ, బ్రాహ్మణుల్నీ కించపరిచారని ఆరోపణలు ఎదుర్కొంది.

ఎవరీ గాడ్‌ మ్యాన్‌? ఏమా కథ?

తమిళనాట ఇప్పుడో వెబ్‌ సిరీస్‌ రిలీజుకు ముందే వివాదాస్పదమైంది. హిందూ ధర్మాన్నీ, బ్రాహ్మణుల్నీ కించపరిచారని ఆరోపణలు ఎదుర్కొంది. కథ విని, నిర్మాతను కమిషన్‌ చేసిన జీ5 సంస్థే ఇప్పుడు రిలీజు ఆపేసింది. దర్శక, నిర్మాతలు ఇది భావప్రకటన స్వేచ్ఛపై దాడి అంటున్నారు. ఇంతకీ ఎవరీ ‘గాడ్‌ మ్యాన్‌’? ఏమా కథ?


కరోనా వైరస్‌ విజృంభణతో రోజురోజుకూ పెరుగుతున్న బాధితుల కేసులతో సతమతమవుతున్న తమిళనాట ఇప్పుడు మరో అంశం చర్చనీయాంశమైంది. అది ప్రాణాలు తీసే వైరస్‌ కాదు కానీ, అంతకన్నా ఒకింత బలమైనది. ‘గాడ్‌ మ్యాన్‌’ అనే టైటిల్‌, చేతిలో దండం ధరించిన ఓ హిందూ స్వామీజీ - త్రిశూలం చేతబట్టిన వివాదాస్పద స్వామి నిత్యానంద లాంటి ఓ పాత్రధారి - ఓ అందమైన అమ్మాయి బొమ్మలతో కూడిన పోస్టర్‌, చిర్రెత్తించే డైలాగులు - దైవం సాక్షిగా శృంగారదృశ్యాలతో ఓ వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌ వివాదాస్పదమైంది. సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఘర్షణ పెంచి, హిందూ ధర్మం పట్ల మనసులో దురభిప్రాయ బీజాలు నాటే విష ప్రచారం ఈ ‘గాడ్‌ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌, దాని ట్రైలర్‌ అని ఓ వర్గం భావిస్తోంది. దాంతో, చివరకు ఆ సిరీస్‌ దర్శక, నిర్మాతలపై పోలీసు కేసు పెట్టారు. ఆ ట్రైలర్‌ను యూట్యూబ్‌ నుంచి తొలగిం చారు. సిరీస్‌ రిలీజ్‌ తాత్కాలికంగా ఆగిపోయింది.


రిలీజుకు ముందే... ట్రైలర్‌తోనే...

జీ టీవీకి చెందిన ఓ.టి.టి. వేదిక ‘జీ5’ అందిస్తున్న తమిళ ఒరిజినల్‌ వెబ్‌సిరీస్‌ ఈ ‘గాడ్‌మ్యాన్‌’. మే చివరలో ట్రైలర్‌ రిలీజైంది. జూన్‌ 12న ఈ వెబ్‌ సిరీస్‌ను ఇంగ్లీషు సబ్‌టైటిల్స్‌తో రిలీజ్‌ చేయాలని భావించారు. కానీ, ఆ లోగానే వివాదాల చిచ్చు రేగింది. ట్రైలర్‌లో బోలెడంత శృంగారం, అతిగా నోరు పారేసుకోవడాలు ఉన్నాయి. హైందవ స్వామీజీగా  ట్రైలర్‌లో కనిపించిన పాపులర్‌ సినీ నటుడు జయప్రకాశ్‌ బ్రాహ్మణులను లోకువ చేసి డైలాగులు పలకడం పలువురి మనోభావాలను దెబ్బతీసింది. స్వామీజీలు, బ్రాహ్మణులనూ ఈ వెబ్‌ సిరీస్‌లో కించపరుస్తున్నారంటూ హిందూ సంస్థలు వీధికెక్కాయి. విమర్శలు చెలరేగడంతో వెబ్‌ సిరీస్‌ రూపకర్తలు యూ ట్యూబ్‌లోని తొలి  ట్రైలర్‌ను ప్రైవేటు కేటగిరీలోకి మార్క్‌ చేసేసి, కొన్ని డైలాగుల్లోని మాటలను మాత్రం తొలగించి, సరికొత్త  ట్రైలర్‌గా రీ-రిలీజ్‌ చేశారు. అయినప్పటికీ వివాదం చల్లారలేదు. హైందవ ధర్మాన్ని కించపరచేందుకు చేసిన ప్రయత్నమే సదరు వెబ్‌ సిరీస్‌ అంటూ బి.జె.పి. పార్లమెంట్‌ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామితో సహా పలువురు సోషల్‌ మీడియాలో విమర్శల యుద్ధానికి దిగడంతో తమిళనాట పరిస్థితి వేడెక్కింది. 


ఈ ‘గాడ్‌ మ్యాన్‌’ కథేమిటంటే...

క్రైమ్‌ థ్రిల్లర్‌ కోవకు చెందిన ఈ సిరీస్‌ ఇతివృత్తం సమ కాలీన ప్రపంచంలో సుపరిచితమే. డబ్బు, అధికారం, సెక్స్‌, దేవుడు లాంటి అంశాల మధ్య సాగే పోరాటం ఈ ‘గాడ్‌ మ్యాన్‌’. ఈ చిత్రంలో గాడ్‌మ్యాన్‌ (తమిళ, తెలుగు సిని మాల్లో సుపరిచితుడైన నటుడు జయప్రకాశ్‌) జులాయిగా తిరిగే ఓ వీధి రౌడీ లాంటి వ్యక్తి అయ్యనార్‌ (‘డేనియల్‌’ బాలాజీ)ని తన ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి వారసుణ్ణి చేయాలనుకుంటాడు. అయితే, రాష్ట్ర ముఖ్యమంత్రికి సన్ని హిత సహాయకురాలైన చంద్రలేఖ (ఒకప్పటి హీరోయిన్‌ సోనియా అగర్వాల్‌) ఆ జులాయికి ఓ విచిత్రమైన ఆఫర్‌ ఇస్తుంది. అక్కడ నుంచి డబ్బు, అధికారం, శారీరక మోహాల చుట్టూ తిరిగే ఒక అపవిత్ర అధికార పోరాటం మొదలవుతుంది. స్థూలంగా ఇదీ ఆ వెబ్‌ సిరీస్‌ కథ. 


ఆ వ్యక్తులు, ఆ సంఘటనలే... ఆధారమా?

ఈ తమిళ వెబ్‌ సిరీస్‌ను సహజంగానే ఆ ప్రాంత స్థానిక సంఘటనలు, వ్యక్తులు, వారి రూపురేఖలనూ ఆధారంగా చేసుకొని అల్లుకున్నట్టు కనిపిస్తోంది. హిందూ స్వామీజీ పాత్ర ప్రసిద్ధ నారాయణగురు శాఖ వారిని గుర్తు తెస్తోంది. తాగుబోతు - అమ్మాయిలతో వ్యభిచరించే తిరుగు బోతు పాత్ర అయ్యనార్‌. తీరా సాధువుగా మారిన తరు వాత ఆ పాత్ర వేషధారణ ఒకప్పుడు లైంగిక ఆరోపణలు ఎదుర్కొని, ప్రస్తుతం పరారీలో ఉన్న రాసలీలల స్వామి నిత్యానందను తలపించింది. ముఖ్యమంత్రికి సన్నిహితు రాలైన చంద్రలేఖ అనే పాత్ర పేరు, ఆ వ్యవహారం తమిళనాట ఒకప్పుడు వార్తల్లోకెక్కిన ఐ.ఏ.ఎస్‌. అధికారిణి చంద్రలేఖ ఉదంతాన్ని స్ఫురణకు తెస్తోంది. 


ఆ వివాదాస్పద డైలాగులు, సీన్లు ఏమిటి?

ట్రైలర్‌లో చూపిన దృశ్యాలు విమర్శలకు తగ్గట్టే ఉండడం గమనార్హం. ఒకచోట స్వామీజీ పాత్ర ‘‘హిందువులు మాత్రమే వేదాలు చదవాలని ఏ శాస్త్రం చెబుతోంది?’’ అని ప్రశ్నిస్తుంది. మరోచోట ‘‘నా చుట్టూ ఉన్న బ్రాహ్మణు లందరూ దుష్టులే’’ అని స్వామీజీ తన వారసుడిగా ఎంచు కున్న తాగుబోతు అయ్యనార్‌ పాత్ర అంటుంది. అదే పాత్ర వేర్వేరు సన్నివేశాల్లో వేర్వేరు అమ్మాయిలతో అసభ్యంగా, అత్యంత సన్నిహితంగా మెలగుతున్న దృశ్యాలు ఆ వెంటనే కనిపిస్తాయి. ఇలాంటి అనేక వివాదాస్పద సన్నివేశాల్లో కనిపించే అయ్యనార్‌ తీరా చివరకొచ్చేసరికి, ‘‘బ్రాహ్మణుడనే వాడు ఎలా జీవించాలో ఈ ప్రపంచానికి చూపిస్తా!’’ అనడం విచిత్రం. ‘‘బ్రాహ్మణుడిలా బతుకుతా!’’ అన్న ఆ పాత్ర మరో దృశ్యంలో పచ్చి తాగుబోతుగా కనిపిస్తుంది. ‘‘నువ్వు బ్రాహ్మణుడివి అవుతావా?’’ అంటూ ఓ పాత్ర ఎగతాళి చేస్తుంది. అలాగే,  ట్రైలర్‌లోని ఒక సీన్‌లో ఒక అమ్మాయి, సాధువు చేతికి త్రిశూలమున్న భుజకీర్తిని తొడిగినట్టు చూపించారు. అయ్యనార్‌ను తన వారసుణ్ణి చేస్తానన్న పెద్ద స్వామీజీ తీరా చంద్రలేఖ కారణంగా అరెస్టయ్యే దృశ్యం కూడా ట్రైలర్‌లో కనిపిస్తుంది. 


నొప్పించే ఉద్దేశం లేదంటున్నారు ‘జీ’!

ఈ దృశ్యాలు ధార్మికుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ వివాదం చెలరేగింది. రచయిత, దర్శకుడు బాబూ యోగేశ్వరన్‌ మీద, నిర్మాత ఇళంగో రఘుపతి మీద వచ్చిన ఫిర్యాదులతో పోలీసు కేసు దాఖలైంది. చివరకు ‘జీ5’ దిగి వచ్చింది. ‘‘వచ్చిన ప్రతి స్పందన కారణంగా, ఆ వెబ్‌ సిరీస్‌ విడుదలను ప్రస్తుతానికి నిలిపి వేస్తున్నాం’’ అని ప్రకటించింది. ‘‘ఏ వర్గాన్ని, మతాన్ని, వ్యక్తిగతవిశ్వాసాలు, సెంటిమెంట్లను నొప్పించాలనే ఉద్దేశం మాకు ఏ కోశానా లేదు’’ అంటూ ‘జీ5’ వివరణఇచ్చింది. నిజానికి, సుబ్రహ్మణ్య స్వామి సన్నిహితురాలైన మాజీ ఐ.ఏ.ఎస్‌, ‘విరాట్‌ హిందుస్థాన్‌’ అనే సంస్థ సారథి అయిన చంద్రలేఖ ఈ వివాదాన్ని ఆయన దృష్టికి తీసుకు వచ్చారట. దాంతో, సుబ్రహ్మణ్య స్వామి ఈ వ్యవహారాన్ని జీ టీవీ యజమాని సుభాష్‌చంద్ర వద్దకు తీసుకువెళ్ళారట. సుభాష్‌ చంద్ర వ్యక్తిగత జోక్యంతో ‘గాడ్‌ మ్యాన్‌’ రిలీజ్‌ ఆగిందని కోడంబాకమ్‌ కబురు. ‘‘మేము బాధ్యతాయుతమైన కంటెంట్‌ సృష్టికర్తలం. ఓ.టి.టి.లో ప్రసారం చేసే కంటెంట్‌పై స్వీయ నియంత్రణ విషయంలో కఠినమైన మార్గదర్శకాలను పాటిస్తున్నాం. ఆ మాటకొస్తే ఆన్‌లైన్‌ క్యూరేటెడ్‌ కంటెంట్‌ ప్రొవైడర్ల స్వీయ నియంత్రణ నిబంధనావళిపై మొదట సంతకం చేసినవారిలో మేమూ ఒకళ్ళం’’ అని ‘జీ5’ ప్రతినిధులు తెలిపారు. 


ఇది ‘జీ’ వాళ్ళు అనుమతించిన కథే!

మొత్తం 380నిమిషాల, 10 భాగాల సిరీస్‌  ‘గాడ్‌మ్యాన్‌’. దర్శక, నిర్మాతలు మాత్రం తాము క్రైస్తవులం కాకపోయినా క్రైస్తవులమని ఆరోపిస్తూ, కొద్ది రోజులుగా తమకు వస్తున్న వేలాది బెదిరింపు ఫోన్‌కాల్స్‌ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. ‘‘ఒక ఛోటా నేరస్థుడు ఎలా గాడ్‌మ్యాన్‌ అయ్యా డనేది ఈ సిరీస్‌ కథ. అతనో దొంగ స్వామీజీ. అందుకని వివిధ రకాల మఠాల్లో జరిగే రాజకీయాలు, అక్కడి వ్యవహా రాలు ఇందులో చూపించాం.  ట్రైలర్‌లోని డైలాగ్‌ అదే’’ అని ‘గాడ్‌ మ్యాన్‌’ నిర్మాత ఇళంగో చెప్పారు. ‘‘పైపెచ్చు, ఈ సిరీస్‌ నేను సొంతంగా తీసి, ‘జీ’ వాళ్ళకు అమ్మినది కాదు. వాళ్ళతో అనేక సంప్రతింపుల తరువాత, వాళ్ళు కమిషన్‌ చేసిన సిరీస్‌. అలాంటిది ఆ సిరీస్‌ రిలీజ్‌ ఆపేయాలని అనుకోవడం సరికాదు. కేవలం ఒక నిమిషం ట్రైలర్‌ చూసి, వివాదం రేపడం పద్ధతి కాదు’’ అని ఆయన వివరించారు.


సెన్సార్‌ లేనందు వల్లేనా? 

అయితే, ఇంట్లోకి చొచ్చుకొని వచ్చే ఇలాంటి కథలు, వాటి చిత్రీకరణ ఎలా ఉండాలనేది చర్చనీయాంశం. ‘‘సినిమాకు సెన్సార్‌ ఉంది. టీవీ సీరియళ్ళకూ, ఓ.టి.టి.లో వచ్చే వెబ్‌ సిరీస్‌లూ, సినిమాలకూ సెన్సారింగ్‌ లేదు. అందుకే, అక్కడ వచ్చే కంటెంట్‌ హింస, అశ్లీలం విషయాల్లో హద్దులు దాటే స్తోంది. దీనిపై చాలా ఫిర్యాదులున్నాయి’’ అని రచయిత్రి బలభద్రపాత్రుని రమణి అన్నారు. సెక్స్‌, హింస ఎక్కువున్న అనేక సిరీస్‌లతో పాటు, ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో ‘లైలా’, ‘హస్‌ ముఖ్‌’, అమెజాన్‌లో ‘పాతాళ్‌లోక్‌’, ఎమ్‌.ఎక్స్‌లో ‘క్వీన్‌’ లాంటి పలు వెబ్‌ సిరీస్‌లపై వివాదాలు చెలరేగాయి. కానీ, అవేవీ రిలీజ్‌ ఆగలేదు. ప్రసారమవుతుంటే, ఆపనూ లేదు. మహా అయితే అభ్యంతరకరం అనిపించిన డైలాగులను కొన్ని సిరీస్‌లలో తొలగించారు. ‘గాడ్‌ మ్యాన్‌’ లాగా మొత్తం వెబ్‌ సిరీస్‌ రిలీజే ఆగిపోవడం ఇదే మొదటిసారి. ప్రస్తుతానికి ఆగినప్పటికీ, అభ్యంతరకర డైలాగులు, దృశ్యాల లాంటివి తొలగించి ‘గాడ్‌ మ్యాన్‌’ను వీలువెంబడి రిలీజ్‌ చేస్తారా? వెబ్‌ సిరీస్‌ తీశారంటూ కేసు పెట్టడం, దాని విడుదల ఆగిపోయేలా చేయడం భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించడమే అంటున్న దర్శక, నిర్మాతల తదుపరి కార్యాచరణ ప్రణాళిక ఏమిటన్నది వేచి చూడాల్సిందే!

 రెంటాల జయదేవ

Updated Date - 2020-06-07T05:30:00+05:30 IST