గొడిచర్ల డాక్టర్‌పై వైసీపీ నేతలు జులుం!

ABN , First Publish Date - 2022-05-18T06:43:46+05:30 IST

మండలంలోని గొడిచెర్ల పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ కిశోర్‌కుమార్‌పై అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సమక్షంలోనే జులుం ప్రదర్శించారు.

గొడిచర్ల డాక్టర్‌పై వైసీపీ నేతలు జులుం!

ఎమ్మెల్యే బాబూరావు సమక్షంలో ఆరోపణలు, సవాళ్లు

కొవిడ్‌ సమయంలో సరైన వైద్య సేవలు అందించలేదని సర్పంచ్‌, ఆమె భర్త ఫిర్యాదు

ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారని మరో నేత ఆరోపణ

తీవ్రంగా స్పందించిన డాక్టర్‌ కిశోర్‌కుమార్‌

ఆరోపణలు నిరూపిస్తే ఉద్యోగం వదిలివెళ్లిపోతానని సవాల్‌

ఇష్టానుసారం మాట్లాడితే పోలీస్‌ కేసు పెట్టిస్తానని హెచ్చరిక

ఉభయులను శాంతింపజేసిన ఎమ్మెల్యే


నక్కపల్లి, మే 17: 

మండలంలోని గొడిచెర్ల పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ కిశోర్‌కుమార్‌పై అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సమక్షంలోనే జులుం ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్‌కు, వైసీపీ నాయకులకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. తనపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని, విధి నిర్వహణలో పొరపాట్లు చేసినట్టు నిరూపిస్తే ఉద్యోగం వదిలేసి వెళ్లిపోతానని డాక్టర్‌ కిశోర్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకుని, ఉభయులను శాంతింపజేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మంగళవారం ఉదయం గొడిచెర్ల గ్రామంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీని తనిఖీ చేయడానికి వెళ్లారు. ఈ సమయంలో ఆయన వెంట  కొంతమంది వైసీపీ నాయకులు వున్నారు. కొవిడ్‌ సమయంలో పీహెచ్‌సీలో సరైన సేవలందించలేదని, పంచాయతీ ప్రథమ పౌరురాలినైన తనకు తగిన గౌరవం ఇవ్వలేదని సర్పంచ్‌ అల్లు పార్వతి, ఆమె భర్త రమణ ఆరోపించారు. కొవిడ్‌ సమయంలో ప్రైవేట్‌గా టెస్ట్‌లు చేసుకున్నారని అన్నారు. దీనిపై స్పందించిన డాక్టర్‌ కిశోర్‌కుమార్‌... విధి నిర్వహణలో తప్పు చేసినట్టు నిరూపిస్తే ఈ క్షణమే ఉద్యోగం మానేసి ఇంటికి పోతానని స్పష్టం చేశారు. అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని  హెచ్చరించారు. ఇదే సమయంలో వైసీపీ నాయకుడొకరు మాట్లాడుతూ, డాక్టర్‌ కిశోర్‌కుమార్‌ విధులు సరిగా నిర్వర్తించడంలేదని, ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేస్తూ నక్కపల్లిలో పెద్ద భవనం కట్టుకుంటున్నారని ఆరోపించారు. దీంతో కిశోర్‌కుమార్‌ తీవ్రంగా స్పందిస్తూ... ‘‘నేను ఇల్లు కట్టుకుంటానో, ఇంకేం చేసుకుంటానో నీకెందుకు? నా గురించి మాట్లాడడానికి నువ్వెవరు?’’ అని ప్రశ్నించారు. విధులను సరిగా నిర్వర్తించకపోతే మాట్లాడాలని, ఆస్పత్రికి వచ్చి ఇష్టానుసారం మాట్లాడితే పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టిస్తానని హెచ్చరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఉభయులను శాంతింపజేశారు. వైద్యసిబ్బంది బాగా పనిచేయాలని, సమస్యలు ఏమైనా వుంటే డీఎంహెచ్‌వోతో మాట్లాడి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. 

Updated Date - 2022-05-18T06:43:46+05:30 IST