దేవీం త్రిలోక జననీం

ABN , First Publish Date - 2022-10-05T10:09:39+05:30 IST

జగన్మాతను ముగ్గురమ్మల (దుర్గ, లక్ష్మి, సరస్వతి) మూలపుటమ్మగా అభివర్ణించారు పోతనామాత్యులు. ఆ మువ్వురికీ దేవీ నవరాత్రులలో ఆరాధనా విధులు నిర్వర్తించడం సనాతన భారతీయ సంప్రదాయం.

దేవీం త్రిలోక జననీం

జగన్మాతను ముగ్గురమ్మల (దుర్గ, లక్ష్మి, సరస్వతి) మూలపుటమ్మగా అభివర్ణించారు పోతనామాత్యులు. ఆ మువ్వురికీ దేవీ నవరాత్రులలో ఆరాధనా విధులు నిర్వర్తించడం సనాతన భారతీయ సంప్రదాయం. కష్టాలలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ అమ్మను తలచుకుంటారు. ఆ మాతృ స్వరూపమే పరదేవత అయిన జగన్మాత. ఆమె పరాశక్తి. ఆమెనె అనేక నామాలతో పిలుస్తారు, కొలుస్తారు.


యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః 


‘‘సమస్త ప్రాణికోటిలో... శక్తిరూపంలో ఉన్న దేవీమూర్తికి నమస్కారం’’ అంటోంది మార్కండేయపురాణం. ‘‘నామ, రూపాత్మకమైన జగత్తు నిండా వ్యాపించి ఉన్నది ఆమే’’ అంటోంది యజుర్వేదం. ‘ఏకై వాహం జగత్యస్మిన్‌ ద్వితీయా నా మమాపరా...’ - ‘‘ఈ జగత్తులో నేనొక్కదానినే ఉన్నాను. నేను తప్ప రెండోవారు ఎవరున్నారు?’’ అంటుంది ‘దేవీ మాహాత్మ్యం’లో దేవీమాత. ఆమె దనుజులను దునుమాడి, జగత్తును కాపాడింది. తనను ఎవరు ఏ విధంగా ప్రార్థించినా ఆమె కరుణిస్తుంది. భక్తుల కోరికలు తీర్చడమే కాదు, జ్ఞానాన్ని, మోక్షాన్ని అర్థించేవారికి వాటిని ప్రసాదిస్తుంది. 


ఆపది కిం కరణీయమ్‌? స్మరణీయం చరణయుగళ మమ్బాయా

తస్మరణం కిం కురుతే? బ్రహ్మ దీనపి కింకరీ కురుతే


‘‘ఆపదలో ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆ దేవి పాద పద్మాలను పట్టుకొని శరణు వేడాలి. ‘శరణు’ అన్నంత మాత్రాన ఏం జరుగుతుంది? బ్రహ్మాది దేవతలు కూడా సేవకులు అవుతారు’’ అని అర్థం.


ఆ పరాశక్తి మహిమను వర్ణించడంలో ఉపనిషత్తులు ముందున్నాయి. ఆమెను ‘చైతన్య స్వరూపిణి’గా అవి అభివర్ణించాయి. ‘సర్వాంతర్యామి’ అని శాస్త్రాలు కొనియాడాయి. ఆ చైతన్యం వివిధ రూపాలలో దర్శనం ఇస్తూ ఉంటుంది.


త్వం స్త్రీ త్వం ప్రమానసి త్వం కుమార ఉతవా కుమారీ

త్వం జీర్ణోదణ్డేన వంచసి త్వం జాతో భవసి విశ్వతో ముఖః


‘‘స్త్రీగా, పురుషునిగా, యువకునిగా, యువతిగా, చేతిలో కర్ర పట్టుకున్న వృద్ధునిగా.. ఇలా అన్ని రూపాలూ నీవే అయి ఉన్నావు’’ అంటోంది ఒక ఉపనిషత్‌ మంత్రం.


జగన్మాత స్త్రీ రూపంలో పరమేశ్వరిగా, పురుష రూపంలో పరమేశ్వరుడిగా పిలుపులందుకుంటోంది. ఆమె అంతటా, అన్నిటా ఉన్న చైతన్య శక్తి. ఉపాసనలు అన్నింటిలో దేవీ ఉపాసన శీఘ్ర ఫలితాలను ఇస్తుందంటారు విజ్ఞులు. దేవీ తత్త్వం ఒక్కటే అయినప్పటికీ... తమతమ అభీష్టాలకు అనుగుణంగా లక్ష్మి, సరస్వతి, దుర్గ రూపాలలో భక్తులు ఆమెను ఆరాధిస్తారు.


లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం

విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రామ్‌

విద్వేషివర్గ విజయేతు తమాల నీలాం

దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే


‘‘సంపదలు అందించే సమయంలో ఎర్రటి పగడంలా ప్రకాశిస్తున్న లక్ష్మిగా, జ్ఞానాన్ని ప్రసాదించే సమయంలో శరత్కాల చంద్రుడిలా వెలుగొందుతున్న సరస్వతిగా, శత్రువులను నిర్జించే సమయంలో ముదురు నీలపు వర్ణాన్నీ ధరించి దుర్గాదేవిగా దర్శనమిచ్చే త్రిలోక జనని అయిన నిన్ను శరణు వేడుతున్నాను’’ అని పూర్వులు ఆమెను ప్రార్థించారు.


జగన్మాతను శ్రీ శంకర భగవత్పాదులు అనేక విధాలుగా వర్ణించారు. ‘సౌందర్య లహరి’లోని ప్రతి పాదంలో, పదంలో ఉపనిషత్తుల సారమే గోచరమవుతుంది. భక్తుల కోసం ఆ జగన్మాత అనేక రూపాలు ధరించింది. వివిధ దేవీ రూపాలు శక్తి పీఠాల్లో ఆరాధనలు అందుకుంటున్నాయి. అమ్మవారిని ఏ కోరికతోనైనా పూజించవచ్చు. అయితే పరమోత్తమమైన కోరిక... మోక్షం. మానవులు దాన్ని సాధించడం కోసం ప్రయత్నించాలి. అది సాధించగలిగితే... ఇక కోరుకోవాల్సింది ఏమీ ఉండదు. 


దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః

స్వస్థైః స్మృతా మతి మతీవ శుభాం దదాసి

దారిద్య్ర దుఃఖ భయహారిణి కా త్వదన్యా

సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా


‘‘తల్లీ! దుర్గా! నిన్ను స్మరించినంతనే సకల భీతులూ తొలగి, సద్బుద్ధి కలుగుతుంది. దారిద్య్ర, దుఃఖాలను రూపుమాపడంలో నీకు సాటి ఎవరమ్మా? సర్వ లోక రక్షకురాలివైన నీకు ఇవే నమస్సులు’’ అంటూ నవరాత్రుల్లో దుర్గాదేవిని ప్రార్థించాలి. వ్యాస విరచితమైన ‘దేవీ భాగవతం’లో, మార్కండేయుడి ‘మార్కండేయ పురాణం’లో ‘దేవీ మాహాత్మ్యం’ గురించి విపులంగా వర్ణించారు. వాటిని పఠించి, సదాచరణతో జీవనం సాగిస్తే... కష్టాల నుంచి విముక్తులం కాగలం, సుఖ శాంతులను పొందగలం.


ఎ. సీతారామారావు

Updated Date - 2022-10-05T10:09:39+05:30 IST