గోదారంత యాత్ర

ABN , First Publish Date - 2021-12-09T06:02:13+05:30 IST

గోదావరి పరిరక్షణ కోసం గోదావరి జన్మస్థలం నుంచి సంగమ ప్రాంతం వరకు ఆరుగురు రిటైర్డు ప్రభుత్వాధికారులు సైకిల్‌యాత్ర చేపట్టారు.

గోదారంత యాత్ర

 గోదావరి పరిరక్షణ కోసం నాసిక్‌- త్రయంబకం నుంచి రాజమహేంద్రవరం చేరుకున్న సైకిల్‌ యాత్ర
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 8 : గోదావరి పరిరక్షణ కోసం గోదావరి జన్మస్థలం నుంచి సంగమ ప్రాంతం వరకు ఆరుగురు రిటైర్డు ప్రభుత్వాధికారులు సైకిల్‌యాత్ర చేపట్టారు. అది కూడా రావడం, వెళ్లడం. పైగా వారంతా ఆరు పదులు దాటిన మిత్ర బృందం కావడంతో ఇదొక సాహస యాత్రగానే చెప్పాలి. గోదావరి జన్మించిన త్రయంబకం నుంచి వారు యాత్ర మొదలుపెట్టి ఏకంగా 1400 కిలోమీటర్ల మేర సైకిల్‌ తొక్కుకుంటూ బుధవారం రాజమహేంద్రవరం చేరుకున్నారు. ఇక్కడ నుంచి సంగమ ప్రాంతం అంతర్వేదికి వెళతారు. మళ్లీ పశ్చిమగోదావరి నరసాపురం నుంచి యాత్ర ప్రారంభించి త్రయంబకం చేరతారు. మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన ఉల్లాస్‌ దామోదర్‌ కులకర్ణి (ఆర్మీ రిటైర్డ్‌), రమేష్‌ దాత్రే (మెడికల్‌ కాలేజీ రిటైర్డ్‌ అధికారి), శ్రీరామ్‌ పవర్‌ (బ్యాంక్‌ రిటైర్డ్‌ మేనేజర్‌), చంద్రకాంత్‌ నాయక్‌ (ఇండియన్‌ ఎయిర్‌పోర్సు రిటైర్డ్‌ అధికారి), రామ్‌నాఽథ సంధాని (రైల్వే సిగ్నెల్‌ రిటైర్డ్‌ అధికారి), కల్నల్‌ శివన్నారాయణ మిశ్రా (ఆర్మీ రిటైర్డ్‌)లు త్రయంబకం నుంచి సైకిల్‌ యాత్ర చేపట్టి ఇక్కడకు చేరుకోగా గోదావరి పరిరక్షణ సమితి చైర్మన్‌ టీకే విశ్వేశ్వరరెడ్డి ఘన స్వాగతం పలికారు. 60 ఏళ్లు దాటిన వీరంతా సైకిల్‌ యాత్ర చేయడం గొప్ప విషయమని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సైకిల్‌ యాత్ర చేపట్టిన వారు మాట్లాడుతూ గోదావరి ప్రాముఖ్యతను వివరిస్తూ, నదిని అందరూ కాపాడుకోవాలని ప్రచారం చేస్తూ యాత్ర చేస్తున్నామని చెప్పారు. గతంలో తామంతా ఉద్యోగాలు చేసేటప్పుడు సైకిల్‌ తొక్కుకుంటూ విధులకు వెళ్లేవారమని, నాసిక్‌ పక్కనే ఉన్న ఒక గ్రామంలో సైకిల్‌ తొక్కుకుంటూ ప్రభుత్వ కార్యాలయాలకు ఎవరు వస్తారో వారికి ఇంటి పన్నులో మినహాయింపు ఇస్తారని, ఇక్కడ కూడా ఆ విధానం అమలు చేస్తే బాగుంటుందన్నారు.  ఈ కార్యక్రమంలో రాజమహేంద్రి కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో లక్ష్మీప్రవీణ, వలంటీర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T06:02:13+05:30 IST