పట్టిసీమ పరవళ్లు తొక్కేనా?

ABN , First Publish Date - 2020-05-27T08:35:50+05:30 IST

పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణానదిలోకి సకాలంలో వస్తాయా.. జూన్‌ నెలలో కృష్ణా డెల్టాలోని నారుమళ్లకు సాగునీరుగా ..

పట్టిసీమ పరవళ్లు తొక్కేనా?

మైలవరం, మే 24: పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణానదిలోకి సకాలంలో వస్తాయా.. జూన్‌ నెలలో కృష్ణా డెల్టాలోని నారుమళ్లకు సాగునీరుగా గోదావరి జలాలు అందుతాయా.. పోలవరం కుడికాలువలో పట్టిసీమ పరవళ్లు గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా తొక్కుతాయా.. ఇప్పుడు కృష్ణా డెల్టాతోపాటు పలు ప్రాంతాల రైతుల బుర్రల్ని తొలిచేస్తున్న ప్రశ్న లివి. 2019లో వైసీపీ అధి కారంలోకి రావడంతో టీడీపీ హయాంలో నిర్మించిన పట్టి సీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు గ్రహణం పట్టుకుంది. వైసీపీ అధికారం చేపట్టిన ఏడాదిలోనే 24 పంపుల్లో నాలుగు పంపులు నిర్వహణ లోపం కారణంగా పనిచేయకుండా పోయాయి. అయినా వాటిని పట్టించుకున్నది లేదు. గోదావరి జలాలను క్రమ బద్ధీకరించేందుకు పోలవరం కుడికాలువపై నిర్మించిన 17 రెగ్యులేటర్ల నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి.


సకాలంలో సాగునీటి సరఫరాపై అటు పాలకులు కాని ఇటు అధికార వైసీపీ నేతలు కాని చిత్తశుద్ధి కనబర్చకపోవడంతో జూన్‌ నెలలో అందాల్సిన నీరు జూలై నెల అయినా అందడం లేదు. జూన్‌ నెలలో నారుమళ్లకు సాగునీరిస్తే అక్టోబర్‌లో పంట చేతికి వచ్చి నవంబరు వరదల నుంచి పంటను రైతులు రక్షించుకునే వీలుంటుందని టీడీపీ హయాంలో జూన్‌ నెలలోనే సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. వైసీపీ పాలనలో 2019లో జూన్‌లో కాకుండా జూలై నెలలో 24 బదులు 20 పంపులు ఆడించి 43 టీఎంసీల నీరు మాత్రమే కృష్ణానదికి మళ్లించడం విమర్శలకు దారి తీసింది. ఈఏడాది కూడా పట్టిసీమ పంపుల్లో ఎన్ని పనిచేస్తాయో, ఏన్ని పని చేయవో అసలు సకాలంలో సాగునీరు అందుతుందో లేదోనని అనుమానాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. 


రూ.1600 కోట్లతో 44 వేల కోట్ల పంట దిగుబడి: 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోవడంతో సాగునీటి సర్దుబాట్లలో తలెత్తనున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నవ్యాంధ్ర తొలి ముఖ్య మంత్రి చంద్రబాబు కృష్ణాడెల్టాకు సాగునీరు అందిం చేందుకు, శ్రీశైలం నుంచి కిందకు వచ్చే నీటిని రాయలసీమ జిల్లాలకు అందించేందుకు తలపెట్టిన ప్రాజెక్టే పట్టిసీమ. ప్రారంభించిన తొమ్మిది మాసాల్లోనే పూర్తిచేసి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సాధించారు. గోదావరి - కృష్ణా నదుల అనుసంధానం ద్వారా నదుల అనుసంధానానికి నాం ది పలికారు. గోదావరికి వచ్చే వరద జలాల్లో ప్రతి ఏడాది 3వేల టీఎంసీలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. వృథాగా పోయే గోదావరి జలాలను కృష్ణానదిలో కలిపి రైతుల సాగునీటి వెతలకు చెక్‌ పెట్టారు.


నాలుగేళ్ల టీడీపీ హయాంలో వరుసగా ప్రారం భించిన ఏడాది 2015లో 4.20, 2016లో 55.60, 2017లో 105.36, 2018లో 94.8 టీఎం సీల గోదావరి జలాలను కృష్ణా నదికి పట్టిసీమ ద్వారా పోల వరం కుడి కాలువ ద్వారా మళ్లించారు. కేవలం రూ.1600 కోట్లు ఖర్చు చేసి రూ.44 వేల కోట్ల పంట దిగుబడిని సాధిం చారు. కృష్ణా డెల్టాతో పాటు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో మెట్ట ప్రాంతాలైన విజయవాడ రూరల్‌, జి.కొం డూరు, ఇబ్రహీంపట్నం మం డలాల్లోని లక్షలాది ఎకరాల సాగుభూమిని సస్యశ్యామలం చేశారు.    

Updated Date - 2020-05-27T08:35:50+05:30 IST