తవ్వేస్తున్నారు!

ABN , First Publish Date - 2021-05-06T06:43:11+05:30 IST

గోదావరి నదీ పాయల్లోని రైతుల భూముల్లోంచి ప్రభుత్వ అనుమతితో తవ్వుతున్న ఇసుక పక్కదారి పడుతోంది. ప్రభుత్వ ఇళ్ల స్థలాల మెరక పేరిట ప్రైవేటు స్థలాలను మెరక చేసేందుకు వందల లారీల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా బాధ్యత గల అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించడం వెనుక షరా ‘మామూళ్లే’ కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తవ్వేస్తున్నారు!
మాచవరం పంచాయతీలో తువ్వ ఇసుకతో మెరక చేసిన లేఅవుట్‌

  ఇళ్ల స్థలాల మెరక ముసుగులో ప్రైవేటు లే-అవుట్ల మెరక
  గోదావరి నదీ పాయల్లో తరిగిపోతున్న ఇసుక మేటలు
  పక్కదారిపడుతున్న తువ్వ ఇసుక 8 పట్టించుకోని అధికారులు
  షరా ‘మామూళ్లు’గా యథేచ్ఛగా ఇసుక దోపిడీ

(అమలాపురం-ఆంధ్రజ్యోతి) గోదావరి నదీ పాయల్లోని రైతుల భూముల్లోంచి ప్రభుత్వ అనుమతితో తవ్వుతున్న ఇసుక పక్కదారి పడుతోంది. ప్రభుత్వ ఇళ్ల స్థలాల మెరక పేరిట ప్రైవేటు స్థలాలను మెరక చేసేందుకు వందల లారీల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా బాధ్యత గల అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించడం వెనుక షరా ‘మామూళ్లే’ కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.   హెడ్‌ వర్క్స్‌, మైన్స్‌, రెవెన్యూతో పాటు పోలీసు శాఖల అధికారులు సైతం ప్రేక్షక పాత్ర వహించడం వెనుక రాజకీయ ఒత్తిళ్లతో పాటు భారీ  నజరానాలు అందుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ కేంద్రమైన పి.గన్నవరం పంచాయతీ పరిధిలోని యర్రంశెట్టివారిపాలెం, బెల్లంపూడిలతో పాటు ఆ మండలంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రభుత్వ  ఇళ్ల స్థలాల మెరక పేరిట తువ్వ ఇసుకను అక్రమంగా తరలించడంలో రాజకీయ ముసుగులో ఉన్న ఒక కీలక ముఠా పని చేస్తోంది. కొన్ని రోజుల క్రితం పి.గన్నవరం నుంచి తువ్వ మట్టిని ప్రభుత్వ ఇళ్ల స్థలాల మెరక పేరిట తవ్వకాలు సాగించి పది చక్రాల లారీల ద్వారా పి.గన్నవరం, అంబాజీపేట పరిసర గ్రామాల్లో ఏర్పాటైన ప్రైవేటు లే-అవుట్ల సైట్లకు భారీగా తరలించారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై కలెక్టర్‌తో పాటు చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌కు ఆ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులతో పాటు ట్రాన్స్‌పోర్టు ఏజన్సీ నిర్వాహకులు రెవెన్యూ అధికారులతో కలసి తువ్వ ఇసుకను లే-అవుట్ల కోసం మళ్లింపు చేసినప్పటికీ పట్టించుకునే అధికారులే లేరు. మాచవరం పంచాయతీలో మెయిన్‌ రోడ్డును ఆనుకుని ఒక లే అవుట్‌, అదే పంచాయతీ పరిధిలో నందంపూడి వెళ్లే రోడ్డులోను, మరో కాలనీకి వెళ్లే రోడ్డులోను ఎకరాలకు ఎకరాలు కప్పెట్టారు. తువ్వ ఇసుకతోనే ఈ భూములను మెరక చేశారని, అక్కడికి వెళ్లి పరిశీలిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని గ్రామస్తులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కొన్ని ప్రభుత్వ స్థలాలను మెరక చేసే ముసుగులో ప్రభుత్వ సెలవు దినాల్లోను, రాత్రివేళల్లోను వందలాది లారీల తువ్వ ఇసుకతో ప్రైవేటు లే-అవుట్లను కప్పెడుతున్నప్పటికీ నిరోధించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ఈ దందా వెనుక అధికార పార్టీకి చెందిన కీలక నాయకులతో పాటు ట్రాన్స్‌పోర్టు ఏజన్సీ నిర్వాహకులు ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా ఈ అక్రమాలపై ప్రశ్నించినా, ఫిర్యాదు చేసినా వారిపై పోలీసుల సహకారంతో అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారనేది పి.గన్నవరం గ్రామస్తుల ఆవేదన. ఇతా జరుగుతున్నా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దృష్టి పెట్టడం లేదంటూ మాచవరం గ్రామస్తులు విజిలెన్స్‌ చీఫ్‌ కమిషనర్‌కు పంపించిన ఫిర్యాదులో వివరించారు.

Updated Date - 2021-05-06T06:43:11+05:30 IST