ఉప్పొంగుతున్న గోదావరి

ABN , First Publish Date - 2020-08-14T12:31:02+05:30 IST

గోదావరి ఉరకలు పరుగులు పెడుతుంది.. గడచిన మూడు రోజులుగా..

ఉప్పొంగుతున్న గోదావరి

ముంపు మండలాల్లో భయం భయం 

16 గ్రామాలకు రాకపోకలు బంద్‌

దాచారం, కొత్తూరు కాజ్‌వేలపై భారీగా వరద నీరు 

పోలవరం ప్రాజెక్టు మట్టి గోడ తొలగించాలని అభ్యర్థనలు

సముద్రంలోకి 5.78 లక్షల క్యూసెక్కులు విడుదల


ఏలూరు-ఆంధ్రజ్యోతి : గోదావరి ఉరకలు పరుగులు పెడుతుంది.. గడచిన మూడు రోజులుగా వరద నీరు క్రమేపీ పెరుగుతుంది. ఒక వైపు మారిన వాతావరణం, వరుసగా అల్పపీడన ద్రోణులు, వాయుగుండం కూడా జతకలియడంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉండడంతో గోదావరిలో వరద ఒక్కసారిగా ముంచు కొచ్చింది. వరద తీవ్రతను అంచనా వేయడంతో పాటు గోదావరిలో వరదను సీడబ్ల్యూసీ ఎప్పటి కప్పుడు అంచనా కడుతుంది. ఇప్పటికే కుక్కునూరు, వేలేరుపాడులో గోదావరి వరదనీరు వాగుల వైపు ఎగతన్నడంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా స్ధంభించాయి. విజ్జేశ్వరం బ్యారేజీ  వద్ద 175 గేట్లను ఎత్తి ఈ ఏడాది తొలిసారి అత్యధికంగా 5.78 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు.


గోదావరిలో పెరుగుతున్న ఉధృతి

గోదావరిలో వరద ఉధృతి అంతకంతకూ తీవ్రరూపం దాల్చుతుంది. గడచిన 24 గంటల్లోనే ఎగువ నుంచి తీవ్రత పెరగడంతో నీటిమట్టంలోనూ మార్పు వచ్చింది. సీడబ్ల్యూసీ గురువారం రాత్రి నిర్ధారించిన అధికారిక అంచనాల ప్రకారం మేరకు కాఫర్‌ డ్యామ్‌ వద్దే 26.610 మీటర్లు నమోదైంది. పోలవరం వద్ద 22.34 మీటర్ల మేర ప్రస్తుతానికి నిలకడగా ఉండగా మరింత పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ తాజాగా తెలిపింది. భద్రాచలం వద్ద నీటిమట్టం ఇంతకు ముందే 31 అడుగులు ఉండగా గురువారం సాయంత్రానికి 35.5 అడుగులకు చేరింది.


ఎగువన భద్రాచలం నుంచి వస్తున్న వరద, దీనికి తోడు శబరి నుంచి వచ్చి పడుతున్న వరద నీరు కూడా తోడై పోలవరం ప్రాజెక్ట్‌ వైపునకు పయనిస్తుంది. ఇప్పటికే వేలేరుపాడు మండలం కొయిదా వద్ద గోదావరి నీటిమట్టం దాదాపు 18 మీటర్లకు చేరింది. కొయిదా వద్ద గోదావరి  పెరిగితే ముంపు మండలాల్లో గ్రామాలను ముంచెత్తుతోంది. వేలేరుపాడు మండలంలో ఎద్దువాగు వద్ద భారీగా వరద నీరు చేరడంతో వేలేరుపాడు-కొయిదా వైపు 16 గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. ఇటీవలే కొయిదా గ్రామంలో  కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు బయట పడ్డాయి. సహాయక చర్యలు అమలవుతుండగానే వరద కారణంగా కొత్త చిక్కు వచ్చి పడింది.  కొత్త కేసు వచ్చినా అధికారులు ఆ గ్రామం వైపు వెళ్లేందుకు మార్గం లేకుండాపోయింది. కొయిదాతో పాటు మిగిలిన గ్రామాలదీ అదే పరిస్థితి. మరోవైపు కుక్కునూరు-దాచారం కాజ్‌వే కూడా పూర్తిగా నీటమునిగింది. ఇదే పరిస్థితి గతేడాది అక్టోబరు, నవంబరు మాసాల మధ్య తలెత్తగా ఈ ఏడాది మాత్రం ముందుగానే ముంచెత్తింది. అలాగే కొత్తూరు కాజ్‌వే వద్ద వరద నీరు 7 అడుగులకు చేరింది. భారీ వర్షాలు కొనసాగితే ఎగువ కొండ ప్రాంతాల నుంచి వచ్చిపడే నీరంతా కడెమ్మ స్లూయిజ్‌ మీదుగా గోదావరిలో కలవాల్సిందే.


పోలవరం పనులకు ఆటంకం 

స్పిల్‌వే నిర్వహణ పనులను ఎట్టి పరిస్ధితుల్లోనే అనుకున్న లక్ష్యం మేరకు నిర్మించి తీరాలని ఇంతక ముందే భావించారు. దీనిలో భాగంగా గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇంజనీర్లు, నిపుణుల సలహా మేరకు ఎక్కడైతే గతంలో కొట్టుకుపోయిందో ఆ ప్రాంతంలో 20 అడుగుల ఎత్తున మట్టి గోడను పటిష్టంగా నిర్మించగలిగారు. అంటే గోదా వరిలో నీటిమట్టం ఒక స్థాయికి వస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లోను వరద నీరు స్పిల్‌వే వైపు వచ్చే చాన్సే లేదు. ఇప్పుడు దీనినే ముంపు మండలాల వాసులు గట్టిగా తప్పుపడుతున్నారు.ఒక వైపు కాఫర్‌ డ్యామ్‌ వలనే తమ రెండు మండలాలకు పూర్తిగా గతేడాది నష్టం వాటిల్లిందని ఆగ్రహంతో ఉన్నారు.ఇదే విషయాన్ని గురువారం ప్రాజెక్ట్‌ ఉన్నతా ధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఊహించని విధంగా రెండు రోజుల క్రితమే కట్టకు గండిపడింది. వరద నీరు కాస్త పూర్తిగా స్పిల్‌ చానల్‌ను ముంచెత్తింది. అంతేకాకుండా స్లూయిజ్‌ల ద్వారా కూడా స్పిల్‌ చానల్‌కు ఆవల భాగాన వచ్చిచేరుతుంది. అయితే దీని వల్ల పెద్దగా నష్టం లేదని పనులకు మాత్రం ఆటంకం కలుగుతుందని చెబుతున్నారు. 


Updated Date - 2020-08-14T12:31:02+05:30 IST