గోదావరికి తగ్గుతున్న వరద

ABN , First Publish Date - 2022-08-16T08:06:05+05:30 IST

గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయితే ఎగువన భారీ వర్షాలు పడటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరిగింది.

గోదావరికి తగ్గుతున్న వరద

కృష్ణాకు నిలకడగా ప్రవాహం.. శ్రీశైలంలో 10 గేట్ల ద్వారా నీటి విడుదల

తుంగభద్ర, జూరాలలో తగ్గని వరద

కృష్ణా బేసిన్‌లో జలవిద్యుత్‌ ఉత్పత్తి

సెలవులతో సాగర్‌కు పెరిగిన పర్యాటకుల సందడి


హైదరాబాద్‌/భద్రాచలం/నాగార్జునసాగర్‌/గద్వాల, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయితే ఎగువన భారీ వర్షాలు పడటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరిగింది. ఇది మళ్లీ 50 అడుగులు దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇక కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద నిలకడగా వస్తోంది. ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి 1.6 లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్‌ నుంచి 1.96 లక్షలు, ఆ తర్వాత తుంగభద్ర నుంచి 80 వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు ఏకంగా 3.02 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా... 3 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. సోమవారం సాయంత్రం వరకు శ్రీశైలం ప్రాజెక్టుకు ఏకంగా 4.16 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నట్టు అంచనావేశారు. దీంతో 4.38 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలిపెడుతున్నారు. మరో రెండు మూడు రోజులు ఇదేస్థాయిలో వరద కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు 3.38 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా...


అంతే స్థాయిలో కిందికి వదులుతున్నారు. కాగా... కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నింట్లో జోరుగా జలవిద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. రోజుకు 44.77 మిలియన్‌ యూనిట్ల మేర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ ప్రధాన కేంద్రంతోపాటు కుడికాలువపై ఉన్న జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 20.4 మిలియన్‌ యూనిట్ల కరెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఆ తర్వాత శ్రీశైలంలో 16.79 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది.  కాగా... గోదావరి బేసిన్‌లో మేడిగడ్డ (లక్ష్మీ), తుపాకులగూడెం (సమ్మక్క), దుమ్ముగూడెం (సీతమ్మ), అన్నారం (సరస్వతి), సుందిళ్ల (పార్వతి) బ్యారేజీలకు వస్తున్న వరద మొత్తాన్ని ఎప్పటికప్పుడు దిగువకు వదిలేస్తున్నారు.  మరోవైపు... నాగార్జున సాగర్‌కు వరద కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి సాగర్‌కు 4.3లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఐదురోజులుగా సాగర్‌ 26 క్రస్ట్‌ గేట్లను ఎత్తి నీటిని దిగువకు పంపిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు సాగర్‌కు వస్తున్నారు. వరుసగా సెలవులు రావడంతో... ఎన్నడూలేని విధంగా సాగర్‌ డ్యాంపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ప్రధాన డ్యాంపైకి సుమారు 300 కార్లు, 500 ద్విచక్ర వాహనాలు వచ్చి ఉండొచ్చని అధికారుల అంచనా.

Updated Date - 2022-08-16T08:06:05+05:30 IST