గోదావరి మళ్లీ ఉగ్రరూపం

ABN , First Publish Date - 2022-08-17T08:09:16+05:30 IST

గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది.

గోదావరి మళ్లీ ఉగ్రరూపం

భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పెరిగిన గోదావరి ఉధృతి

భద్రాచలం వద్ద తుది ప్రమాద హెచ్చరిక జారీ

కృష్ణా ప్రాజెక్టులకు నిలకడగా వరద

శ్రీశైలం, సాగర్‌లకు వచ్చిన నీరు వచ్చినట్లే కిందకు...

మూసీకి అలుగులతో పెరిగిన ఇన్‌ఫ్లో


హైదరాబాద్‌/భద్రాచలం/ములుగు/నాగార్జునసాగర్‌/గద్వాల, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఉపనదులు మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి క్యాచ్‌మెంట్‌ ఏరియాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. మంగళవారం సాయంత్రానికి మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీకి 9 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ములుగు జిలా లో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజీకి ఏకంగా 13.45 లక్షల క్యూసెక్కుల వరద చేరింది. ఇక దుమ్ముగూడెం (సీతమ్మసాగర్‌), అన్నారం (సరస్వతి), సుందిళ్ల (పార్వతి) బ్యారేజీలకు వచ్చి న వరదను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. ఏటూరునాగారం మం డలం పూసూరు, రామన్నగూడెం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు.

లాగే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 40వేలు, కడెం ప్రాజెక్టుకు 4,766, శ్రీపాద ఎల్లంపల్లికి 80వేల క్యూసెక్కుల వరద వస్తుండగా... శ్రీరాంసాగర్‌ నుంచి 19వేలు, కడెం నుంచి 6,287, ఎల్లంపల్లి నుంచి 1.01లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలిపెడుతున్నారు. ఇక కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద నిలకడగా వస్తోంది. ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి 1.25 లక్షలు, నారాయణపూర్‌ నుంచి 1.18 లక్షల ఔట్‌ఫ్లో ఉంది. ఆ తర్వాత ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 37వేలు, జూరాల నుంచి 2.59 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. 4.37 లక్షల క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. దీంతో సాగర్‌ వద్ద వచ్చిన నీటిని వచ్చినట్లే పంపిస్తున్నారు. పులిచింతల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నింట్లో జోరుగా జల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. మరోవైపు మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో నిలకడగా కొనసాగుతోంది. హైదరాబాద్‌ నగరంతోపాటు ఎగువ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా చెరువులు, కుంటల అలుగుల ద్వారా మూసీకి ఇన్‌ఫ్లో వస్తోంది. 


భద్రాచలం వద్ద తుది ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరుకుంది. దీంతో మళ్లీ తుది ప్రమాద హెచ్చరికను జారీచేశారు. నీటిమట్టం మరికొంత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం అధికారులు తెలిపారు. వరదల కారణంగా భద్రాచలం ఏజెన్సీలో పలు చోట్ల రాకపోకలు స్తంభించాయి. భద్రాద్రి దేవస్థానం కల్యాణకట్ట కిందిభాగం, అలాగే పర్ణశాలలో నారచీరల ప్రాంతం నీట మునిగాయి. భద్రాచలం నుంచి చర్ల, కూనవరం, కుక్కునూరు వైపు వెళ్లే బస్సులను నిలిపేశారు. లోతట్టు ప్రాంతంలో ఉన్నవారికి ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ తెలిపారు. ముంపు ప్రాంతాల్లో పశువులను మేత కోసం బయటకు వదలవద్దని, జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని కలెక్టర్‌ సూచించారు.

Updated Date - 2022-08-17T08:09:16+05:30 IST