‘గోదావరి గర్జన’లో జనసేన, పవన్ పేరే ప్రస్తావనకు రాలేదేం.. ఎందుకిలా..!?

ABN , First Publish Date - 2022-06-08T20:07:40+05:30 IST

‘గోదావరి గర్జన’లో జనసేన, పవన్ పేరే ప్రస్తావనకు రాలేదేం.. ఎందుకిలా..!?

‘గోదావరి గర్జన’లో జనసేన, పవన్ పేరే ప్రస్తావనకు రాలేదేం.. ఎందుకిలా..!?

  • ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని..
  • ప్రజలే చూస్తున్నారు!
  • వైసీపీ పాలనలో ఏపీ అప్పులపాలు
  • ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష 
  • తెలుగు భాషకూ అన్యాయమే
  • ‘గోదావరి గర్జన’ సభలో..
  • జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  
  • జనసేన ప్రస్తావన లేకుండానే.. 
  • వేలాదిగా హాజరైన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు

వైసీపీ పోవాలి.. బీజేపీ రావాలి అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలుగులో నినదించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో మంగళవారం  జరిగిన ‘గోదావరి గర్జన’ సభలో ఆయన మాట్లాడారు. జగన్‌ ప్రభుత్వంలో రాష్ట్రం అప్పులపాలైపోయిందని, శాంతి భద్రతలు క్షీణించాయని.. ప్రతిపక్షాలను కూడా జనంలో తిరగనీయకుండా రాజకీయ  కక్షతో వ్యవహరిస్తున్నారన్నారు . అందుకే ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలే చూస్తున్నారని తెలిపారు. జగన్‌ పోతారని.. బీజేపీ వస్తుందని చెప్పారు. సుమారు అర గంటకు పైగా మాట్లాడిన ఆయన ప్రధాని మోదీ పాలన వల్ల దేశ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.


నా ఊరు రాజమహేంద్రవరం..నా పేరు జయప్రద అని బీజేపీ నాయకురాలు తెలుగులో మాట్లాడి అందరినీ ఉత్సాహంలో ముంచారు. మిమ్మల్ని వదిలి వెళ్లడం బాధగా ఉన్నా మళ్లీ ఇలా రావడం ఆనందంగా ఉందన్నారు.. ఇక మీ వెంటే ఉంటానన్నారు.


రాజమహేంద్రవరం : పవిత్ర గోదావరికి నమస్కారం. ఇది చారిత్రక గడ్డ.  ఇక్కడ  వేణుగోపాలస్వామి, మార్కేండేయ స్వామి వంటి దేవుళ్లు అనేక మంది ఉన్నారు. ముందుగా శివుడికి నమస్కారం చేస్తున్నానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో మంగళవారం జరిగిన గోదావరి గర్జన సభలో వైసీపీ పోవాలి.. బీజేపీ రావాలి అంటూ తెలుగులో నినదించారు. జగన్‌ ప్రభుత్వంలో రాష్ట్రం అప్పులపాలైపోయిందని, శాంతిభద్రతలు క్షీణించాయని.. ప్రతిపక్షాలను కూడా జనంలో తిరగనీయకుండా రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారని, అందుకే ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలే చూస్తున్నారని ఆయన తెలిపారు. 


జగన్‌ పోతారని.. బీజేపీ వస్తుందని చెప్పారు. సుమారు అరగంటకు పైగా మాట్లాడిన ఆయన తెలుగు సాంస్కతిక సంప్రదాయాలకు  రాజమహేంద్రవరం నిలయమని, తెలుగుభాష ఇక్కడే పుట్టిందన్నారు. దేశవ్యాప్తంగా నూతన విద్యావిధానం అమలు చేస్తూ ఆయా మాతృభాషలను ప్రోత్సహిస్తుంటే  వైసీపీ ప్రభుత్వం తెలుగుభాషకు అన్యాయం చేస్తుందని.. తెలుగును మాట్లాడనీయకుండా చేస్తుందని విమర్శించారు. గతంలో ప్రధాని మోదీ పాలనతో టీడీపీ కలిసి పయనించిందని, కానీ జస్ట్‌ బస్సు మిస్సయిందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. అంతకు ముందు మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పలువురు నేతలు, వైసీపీని విమర్శిస్తూ టీడీపీని కూడా విమర్శించే ప్రయత్నం చేశారు. కానీ నడ్డా టీడీపీకి సానుకూలంగా వ్యాఖ్యానించడం గమనార్హం. 


సభలో తలపాగా చుట్టి, కాషాయ వస్ర్తాలు ధరించి వచ్చిన మహిళలను ఆయన అభినందించారు. అంతకు ముందు మంజీరా కన్వెన్షన్‌ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వ పురస్కార గ్రహీతలతో ఆయన సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ పురస్కార గ్రహీతలు డాక్టర్‌ కర్రి రామారెడ్డి, రైతునేస్తం వెంకటేశ్వరరావు, యడ్ల గోపాలం, డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావు, దాల్మే చలపతిరావు, డాక్టర్‌ ప్రసన్నశ్రీ, మురళీకృష్ణ, ఉషాగజపతిరాజు, కిరణ్‌ చుట్టపల్లి, డాక్టర్‌ ఎస్‌ఎన్‌.మూర్తి, ఎం.రాంభూపాల్‌రెడ్డి, ఆస్ర్టోనాట్‌ జాహ్నవిని సత్కరించారు. పురస్కారగ్రహీతలు తాము సముపార్జించిన జ్ఞానంతో పాటు దేశ సంప్రదాయాలను ఇతరులకు షేర్‌ చేయడం చాలా ముఖ్యమన్నారు.  


ప్రధాని మోదీ పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాల వల్లే దేశప్రగతి సాధ్యపడిందన్నారు. భారత్‌ 8.7 శాతం వృద్ధి సాధిస్తుంటే, అమెరికాలో 4 శాతమే వృద్ధి ఉందని అన్నారు. భారత్‌లో పేదరికం గతంలో 22 శాతంగా ఉంటే, దీన్ని ఎనిమిదేళ్లలో 10 శాతానికి తగ్గించుకోగలిగామని, ఇలా 12శాతం మేర పేదరికం తగ్గడం గతంలో ఎన్నడూ లేదన్నారు.  సాగులో నష్టపోతున్న రైతుల కోసం కిసాన్‌ సమ్మాన్‌ పథకం తీసుకొచ్చి ప్రతి మూడు నెలలకోసారి రూ.2 వేలు చొప్పున రూ.6 వేలు ఇన్‌పుట్‌ సబ్సిడీగా అందిస్తున్నట్టు చెప్పారు. కరోనా సమయంలో 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఐదు కిలోల బియ్యం, కిలో పప్పు అందజేశామని, ఇప్పటికీ అది కొనసాగుతోందని అన్నారు.


ప్రధానిగా మోదీ వచ్చిన తర్వాత జీరో బ్యాలెన్స్‌తో 45 కోట్ల జన్‌ధన్‌ అకౌంట్లు తెరిచారన్నారు. కరోనా సమయంలో 20 కోట్ల మంది మహిళల ఖాతాల్లో రూ.500 చొప్పున వేసినట్టు చెప్పారు. ఆవాస్‌ యోజన కార్యక్రమం ద్వారా 2.5 కోట్ల ఇళ్లను శాంక్షన్‌ చేశారన్నారు. అనంతరం కేంద్ర పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏయే పథకాలు పొందారు, ఎంత లబ్ధి చేకూరింది, ఉపయోగకరంగా ఉందా లేదా అని వారిని అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లు నిర్మించుకున్నామని, బీమా పథకం ద్వారా లబ్దిపొందామని, ఇళ్లు కట్టుకున్నామని పలువురు మహిళలు తెలియజేశారు. నడ్డా హిందీ, ఇంగ్లిష్‌లో మాట్లాడగా, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంద్రీరేశ్వరి తెలుగులోకి అనువాదం చేశారు.


జనసేన ప్రస్తావన ఏదీ?

రాష్ట్రంలో బీజేపీకి మిత్రపక్షమైన జనసేన పేరుగానీ, ఆపార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ పేరుగానీ ఈ సభలో ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం. నడ్డా నోట జనసేనకు అనుకూలంగా ఏదైనా మాట వస్తుందని ఆ పార్టీ భావించింది. బీజేపీ, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్‌ను ప్రకటిస్తే స్వాగతిస్తామని కూడా జనసేన వివిధ ప్రకటనల్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రసంగం ముగించడం జనసేన నాయకులను నిరాశపర్చింది.


బీసీలకు అన్యాయం..

రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతోందని, భారత దేశంలో ఎక్కడా ఈ పరిస్థితి లేదని, ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల మరింత నష్టం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. గోదావరి గర్జన సభలో ఆయన మాట్లాడుతూ నాడు-నేడు అంటే విద్యను ఉద్దరిస్తానని చెప్పిన సీఎం జగన్‌ నిర్వాకం వల్ల ఏకంగా రెండు లక్షల మంది  టెన్త్‌ విద్యార్థులు ఫెయిలయ్యారని, ఇది ఫస్ట్‌టైమని విమర్శించారు. ప్రశాంతమైన కోనసీమలో ఓట్ల కోసం రాజకీయం చేసి చిచ్చుపెట్టారని విమర్శించారు. రైతులను నిలువునా దోచేస్తున్నారని సోము విమర్శించారు.


రాజమహేంద్రవరం నా జన్మభూమి..

రాజమహేంద్రవరం నా జన్మభూమి అని.. ఉత్తరప్రదేశ్‌ నా కర్మభూమి అని ప్రముఖ సినీనటి , మాజీ ఎంపీ జయప్రద అన్నారు. అనుకోని పరిస్థితుల్లో నేను మిమ్మల్ని, మన రాష్ర్టాని వదిలి వెళ్లిపోయినందుకు క్షమాపణ కోరుతున్నానన్నారు.రాజమహేంద్రవరానికి చెందిన జయప్రద తన చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. రాజ మహేంద్రవరంతో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. అన్నారు. దీంతో సభలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గోదావరి ప్రశాంతంగా ఉంటుంది.  గలగల  ప్రవహిస్తూ కళకళలాడుతుంది. కానీ అది ఉగ్రరూపంగా మారిందంటే. పేదవాడు కన్ను ఎర్ర బడిందంటే అది గర్జన. అదే గోదావరి గర్జన అని ఆమె స్పష్టం చేశారు. ఆరంభం నుంచి చివరి వరకూ మాతృభాష తెలుగులో మాట్లాడారు.ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  సోమువీర్రాజు,  మాజీ కేంద్ర మంత్రులు దగ్గుపాటి పురందరేశ్వరి, సుజనాచౌదరి,  సీఎం రమేష్‌, టీజే వెంకటేష్‌,  బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు  కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, సునీల్‌ దియోధర్‌, వై.సత్యకుమార్‌, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అమ్యాజీవేమా, ఆదినారాయణరెడ్డి,  పరిమి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-06-08T20:07:40+05:30 IST