వరద రివర్స్‌!

ABN , First Publish Date - 2021-07-27T06:37:20+05:30 IST

పోలవరం కాఫర్‌ డ్యామ్‌ వల్ల దిగువ భాగంలో వరద ప్రభావం బాగా తగ్గింది. కానీ ఎగువభాగంలోని ఏజెన్సీ ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. అంటే పోలవరం ప్రాజెక్టు కట్టిన తర్వాత దిగువకు వరద ప్రభావం బాగా తగ్గుతుంది. రాజమహేంద్రవరం అఖండ గోదావరి ఉగ్రరూపం కూడా దాల్చే అవకాశాలు తక్కువ. కోనసీమకు కూడా ఇక ఏటిగట్లను తోచేసేటంత వరద ఉండదేమో. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రి

వరద రివర్స్‌!
రాజమహేంద్రవరంలో జంట వంతెనల నడుమ వరద ఉధృతి

ఈసారి కథ తారుమారు  

కాఫర్‌ డ్యామ్‌తో దిశ మార్చుకున్న వరద

బ్యాక్‌ వాటర్‌తో మునిగిన ఏజెన్సీ గ్రామాలు 

లంకలకు తప్పిన వరద ముప్పు

కేతావారిలంక, బ్రిడ్జిలంకలల్లో ఇళ్లు సేఫ్‌.. 

కోనసీమలోనూ సురక్షితమే


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

పోలవరం కాఫర్‌ డ్యామ్‌ వల్ల దిగువ భాగంలో వరద ప్రభావం బాగా తగ్గింది. కానీ ఎగువభాగంలోని ఏజెన్సీ ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. అంటే పోలవరం ప్రాజెక్టు కట్టిన తర్వాత దిగువకు వరద ప్రభావం బాగా తగ్గుతుంది. రాజమహేంద్రవరం అఖండ గోదావరి ఉగ్రరూపం కూడా దాల్చే అవకాశాలు తక్కువ. కోనసీమకు కూడా ఇక ఏటిగట్లను తోచేసేటంత వరద ఉండదేమో. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రిజర్వాయర్‌ పూర్తిగా నిండిపోతేనే మిగిలిన నీటిని కిందకు వదులుతారు. అందువల్ల అది ఏజెన్సీ గ్రామాలను పాపికొండలు, అడవులను ముంచేస్తుంది. అక్కడి గిరిజనుల ఉని కినే మార్చేస్తుంది. అదే సమయంలో పోలవరం దిగువ రాజమహేంద్రవరం గోదావరిలోని లంకలు, కోనసీమలోని లంకలపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోయినా ఎగువ కాఫర్‌ డ్యామ్‌ కట్టడం వల్లే వరద ప్రభావంలో పెద్ద మార్పులు వచ్చాయి. భద్రాచలం వద్ద సుమారు 49 అడుగుల వరకూ నీటిమట్టం నమోదైతే, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయ్యేది.


అప్పుడు రాజమహేంద్రవరం గోదావరిలోని కేతావారిలంక, బ్రిడ్జిలంక వంటివన్నీ కనిపించేవి కావు. కోనసీమలో ఏటిగట్ల వరకూ వరద వచ్చేది. అంతకుమించి వస్తే ఏటిగట్ల మీద కూడా ప్రభావం చూపేది. ఇవాళ కాఫర్‌డ్యామ్‌ వల్ల సుమారు 32 మీటర్ల ఎత్తున వరద నీరు నిలిచిపోయింది. స్పిల్‌వే గుండా సుమారు 9 లక్షల క్యూసెక్కులలోపు వరద ప్రభావం కిందకు వచ్చింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి మర్నాడే ఎత్తేశారు. సాధారణంగా ధవళేశ్వరం వద్ద 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం గానీ, 11.75 అడుగుల నీటిమట్టంగానీ నమోదు అయితే మొదటి వార్నింగ్‌ జారీ చేస్తారు. వాస్తవానికి పోలవరం కాఫర్‌ డ్యామ్‌ లేకపోతే ముందుగానే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితి ఏర్పడేది. కానీ కాఫర్‌డ్యామ్‌ వల్ల భద్రాచలం నుంచి వచ్చేనీరు ధవళేశ్వరం బ్యారేజీకి రావడానికి ఆలస్యమవుతోంది. దీని వల్ల భారీ వరద వస్తేనే దిగువ భాగంలో ప్రభావం ఉండవచ్చు. 


వరద తగ్గుముఖం

గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఆదివారం జారీచేసి మొదటి ప్రమాదహెచ్చరికను సోమవారం ఉపసంహరించుకున్నట్టు రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు తెలిపారు. బ్యారేజీ వద్ద సోమవారం రాత్రి 9 గంటలకు నీటిమట్టం 9.80 అడుగులకు తగ్గగా, 7,48,983 క్యూసెక్కులు వదిలేస్తున్నారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 32.20 అడుగులకు తగ్గింది. రెండు మూడు రోజులపాటు వరద ప్రభావం ఉంటుంది. 


శాంతిస్తున్న గోదావరి

ఊపిరిపీల్చుకున్న లంక గ్రామాల ప్రజలు

పి.గన్నవరం, జూలై 26: ఎగువ ప్రాంతంలో వరద ఉధృతి తగ్గడంతో దిగువన ప్రవహిస్తున్న గౌతమి, వృద్ధగౌతమి, వైనతేయ, వశిష్ఠ నదీపాయలు శాంతించి క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో లంకగ్రామాల ప్రజలు, రైతులు ఉపిరిపీల్చుకున్నారు. మండల పరిధిలోని గంటిపెదపూడి శివారు బూరుగులంక, పెదపూడిలంక, అరిగెలవారిపేట, ఊడిమూడి శివారు ఊడిమూడిలంక గ్రామాల ప్రజలు.. అధికారులు ఏర్పాటుచేసిన రెండు ఇంజన్‌ పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఇక తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతం కనకాయలంక కాజ్‌వేపై వరద ఉధృతి కొనసాగడంతో ఇంజన్‌బోట్ల పైనే లంకగ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అనగార్లంక, పెదమల్లంక, అయోధ్యలంక గ్రామస్తులు కూడా పడవలపైనే ప్రయాణం చేస్తున్నారు. లోతట్టు లంక ప్రాంతాల్లో పలుచోట్ల మునగ, బీర, పచ్చిమిర్చి పంటలకు వరదపోటు తగిలింది. ఒక్కసారి వరదనీరు తాకితే ఆ పంటలు పనికిరావని రైతులు చెబుతున్నారు.

Updated Date - 2021-07-27T06:37:20+05:30 IST