జాగ్రత్త పడకపోతే గోదావరి మనకు దక్కదు

ABN , First Publish Date - 2020-05-26T09:17:14+05:30 IST

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు తిరిగితిరిగి కృష్ణాజలాల కోసం కోట్లాడుకుంటున్నాయి. అప్పుడప్పుడు ఈ కొట్లాట మంద్ర స్థాయి లోనూ ఒక్కొక్కప్పుడు తీవ్రస్థాయిలోనూ సాగుతోంది. కృష్ణా నది నిర్వహణ బోర్డు (KRMB) అపెక్స్ కౌన్సిల్,...

జాగ్రత్త పడకపోతే గోదావరి మనకు దక్కదు

కావేరి నదీ జలాల పంపకాల మీద కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చిరకాలంగా వైరం కొనసాగుతోంది. ఎంత కొట్లాడుకున్నా కావేరిలో పిండుకోవడానికి నీళ్ళు లేవని వాటికి అర్థం అయిపోయింది. ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాలు ఏకమై చెరో రెండు వందల టిఎంసిల గోదావరి నీళ్ళను దక్కించుకోవడానికి ఢిల్లీలో వేగంగా పావులు కదుపుతున్నాయి. కేంద్రం కూడ వాటి వైపు మొగ్గు చూపే సూచనలు కనిపిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలు ముందు చూపుతో వ్యవహరించాల్సిన సమయం ఇది.


ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు తిరిగితిరిగి కృష్ణాజలాల కోసం కోట్లాడుకుంటున్నాయి. అప్పుడప్పుడు ఈ కొట్లాట మంద్ర స్థాయి లోనూ ఒక్కొక్కప్పుడు తీవ్రస్థాయిలోనూ సాగుతోంది. కృష్ణా నది నిర్వహణ బోర్డు (KRMB) అపెక్స్ కౌన్సిల్, కేంద్ర జలశక్తిశాఖలు ఈ కోట్లాటలకు వేదికలుగా మారుతున్నాయి. కృష్ణానదికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండూ దిగువ రాష్ట్రాలు. వీటి మధ్య ఒక అవగాహన సఖ్యత లేకపోతే ఎగువ రాష్ట్రాలది పైచేయి అవుతుంది.


ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ, తెలంగాణలో మహబూబ్ నగర్ తదితర ప్రాంతాలు సాగునీటి కోసం దశాబ్దాలుగా అలమటిస్తున్నాయి. వాటికి సాగునీరు ఇవ్వకుండా సామాజిక న్యాయ సాధన సాధ్యం కాదు. సామాజిక న్యాయాన్ని స్థాపించనప్పుడు అనివార్యంగా సామాజిక అశాంతి చెలరేగుతుంది. అది ఎక్కడికి దారితీస్తుందో చెప్పలేం. నీళ్ళ పంచాయతీ కారణంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడాన్ని కళ్ళారా చూసినవాళ్లు సహితం రాయలసీమకు అవసరమైన నికర జలాల్ని అందించే మార్గాల్ని వెతక్కపోవడం అన్యాయం.


రాయలసీమ, పాలమూరులకు నికర జలాలను కేటాయించడం మన ముందున్న మొదటి కర్తవ్యం అయితే, ఆ నీళ్ళను ఎక్కడి నుండి తేగలమో అన్వేషించడం అంతకన్నా ముఖ్యమైన కర్తవ్యం. ఎటు నుండి ఎటు వైపుకు చూసినా సరే కృష్ణా నదిలో నికర జలాలు లేవు. ఇది శిలా శాససనం. జస్టిస్ ఆర్ ఎస్ బచావత్ నాయకత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యూనల్ (KWDT) తీర్పు 1976 మే 27న వచ్చింది. ఆనాడు 75 శాతం ఆధారిత నికర జలాలు 2060 టిఎంసీలను ఒక్క చుక్క కూడ మిగల్చకుండ మూడు పరివాహక రాష్ట్రాలకు పంచేశారు. అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 800 టిఎంసీలు వచ్చాయి. 2014లో రాష్ట్ర విభజన జరిగినపుడు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం – 2014 సెక్షన్ 85లో కృష్ణా జలాలను నిర్దిష్టంగా పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు 64 శాతం వాటాగా 512 టిఎంసీలు, తెలంగాణకు 36 శాతం వాటాగా 288 టిఎంసీలు కేటాయించారు. రీజెనరేషన్ ద్వారా ఇంకో 11 టిఏంసిల నీళ్లు వస్తాయి. దాన్ని కూడ రెండు రాష్ట్రాలు ఆ నిష్పత్తిలోనే పంచుకుంటున్నాయి. 


కృష్ణానదిలో నీళ్ళు తక్కువ వినియోగం ఎక్కువ; వివాదాలూ ఎక్కువ! గోదావరినదిలో నీళ్లు ఎక్కువ వినియోగం తక్కువ. ఇప్పుడున్న ఏకైక పరిష్కారం ఏమంటే గోదావరి జలాల్ని సాధ్యమయినంత ఎక్కువగా కృష్ణా బేసిన్ లోనికి మళ్ళించాలి. అలా కృష్ణా నికర జలాల్ని ఆదా చేయాలి. అలా ఆదా చేసిన కృష్ణా నికర జలాల మీద రాయలసీమ, పాలమూరులకే కాక అవసరమున్న ఇతర ప్రాంతాలకూ చట్టబద్ధ హక్కు కల్పించాలి. కృష్ణా జల వివాదాల ట్రిబ్యూనల్ తీర్పును ప్రకటించిన జస్టిస్ బచావత్ గోదావరి జల వివాదాల ట్రిబ్యూనల్ (GWDT)కు కూడ న్యాయమూర్తిగా వున్నారు. ఆ తీర్పు 1980 జులై 7న వెలువడింది. ఆనాడు 75 శాతం ఆధారిత నికర జలాలు 3,565 టిఎంసీలు వున్నాయని నిర్ధారించారు. అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,495 టిఎంసీలు కేటాయించారు. వీటిల్లో ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలు 600 టిఎంసీలు మాతమే వాడుకుంటున్నాయి. మిగిలిన నీళ్ళు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి నదులు గోదావరినదిలో కలిసే కాళేశ్వరం, ఇచ్చంపల్లి, కూనవరంల వద్ద చెరో వెయ్యి టీఎంసీల నీళ్ళు ఇప్పటికీ అందుబాటులో వున్నాయి. భారత దేశంలో ప్రస్తుతం అదనపు జలాలున్న నదులు మహానది, గోదావరినది మాత్రమే.


గోదావరి నీళ్ళను వినియోగంలోనికి తెచ్చే విషయంలో మనం చాలా వెనుకబడివున్నాంగానీ, ఈ నీళ్ళను హైజాక్ చేయడానికి ఇతర రాష్ట్రాలు చురుగ్గా పావులు కదుపుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కృష్ణానది పరివాహక ప్రాంతంలో వున్నాయి. కృష్ణానది పరివాహక ప్రాంతంలో లేని తమిళనాడు రాష్ట్రం కూడా గోదావరి జలాలను తరలించుకుపోవడానికి చురుగ్గా ప్రయత్నాలను సాగిస్తున్నది! గోదావరి జలాలను కావేరీ బేసిన్‌కి మళ్ళించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఓ ఐదేళ్ళుగా చెబుతూనే వుంది. ఈ ప్రాజెక్టు మీద ముసాయిద (డ్రాఫ్ట్) డిటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (DPR) సిద్ధం అయినట్టు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రత్తన్ లాల్ కటారియా ఈ ఏడాది ఫిబ్రవరి 10న రాజ్యసభలో లిఖిత పూర్వకంగా తెలిపారు.


ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 2018-19 ధరల ప్రకారం 60,361కోట్ల రూపాయల వ్యయం కాగలదని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (NWDA) అంచనా వేసింది. కృష్ణా, పెన్నా, కావేరీ బేసిన్ లకు ఇచ్చంపల్లి నుండి 247 టిఎంసిల గోదావరి జలాలను మళ్ళించాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం అని మంత్రి తెలిపారు. అయితే, గోదావరి నుండి ఈ ప్రాజెక్టుకోసం 1100 టిఎంసిల జలాలను మళ్ళిస్తున్నట్టు ఫిబ్రవరి 29న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పాండిచ్చేరి సభలో అన్నారు. నిజానికి అంతకన్నా ఎక్కువ నీటిని తీసుకుపోవడానికే కేంద్ర ప్రభుత్వం డిపిఆర్‌లను సిద్ధం చేస్తున్నట్టుంది.


సాగుతున్నది జలయుద్ధం కనుక రాజకీయ ప్రాబల్యాలు కూడ ప్రభావాన్ని చూపుతాయి. తెలంగాణకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు లేవు. కరోనా కాలంలోనూ ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అటు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడ అంతే. మోదీకి దగ్గర కావాలని జగన్ తాపత్రయపడ్డా కేంద్రంలో ఏపీ పనులు ముందుకు సాగడం లేదు.


మరోవైపు, దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక కమలనాధులకు ముద్దు బిడ్డగా మారింది. అలాగే, తమిళనాడులోనూ తమకు బలపడే అవకాశాలు పుష్కలంగా వున్నట్టు బిజెపి భావిస్తోంది. తమిళ ప్రజల అభిమానాన్ని పొందడానికి అక్కడ ఏ పని చేయడానికి అయినా ఆ పార్టీ సిద్ధంగా వుంది. నిజానికి కావేరి నదీ జలాల పంపకాల మీద కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చిరకాలంగా వైరం కొనసాగుతోంది. ఎంత కొట్లాడుకున్నా కావేరిలో పిండుకోవడానికి నీళ్ళు లేవని వాటికి అర్థం అయిపోయింది. ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాలు ఏకమై చెరో రెండు వందల టిఎంసిల గోదావరి నీళ్ళను దక్కించుకోవడానికి ఢిల్లీలో వేగంగా పావులు కదుపుతున్నాయి. కేంద్రం కూడ వాటి వైపు మొగ్గు చూపే సూచనలు కనిపిస్తున్నాయి. తమ రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవడానికి అవసరమైతే పార్లమెంటును స్తంభింపజేసే సత్తా ఆ రాష్ట్రాల ఎంపీలకు వుంది.


తెలుగు రాష్ట్రాలు ముందుచూపుతో వ్యవహరించాల్సిన సమయం ఇది. నీళ్ళ కోసం ఎప్పుడూ వర్తమాన అవసరాల గురించి మాత్రమే ఆలోచించరాదు వందేళ్ళ తరువాతి అవసరాలను కూడ దృష్టిలో పెట్టుకోవాలి. హుస్సైన్ సాగర్‌ను 1563లో, ధవళేశ్వరం ఆనకట్టను 1852లో, బెజవాడ ఆనకట్టను 1855లో, కేసి కెనాల్‌ను 1871లో, ఉస్మాన్ సాగర్‌ను 1920లో, హిమాయత్ సాగర్‌ను 1927లో నిర్మించారు. ఈ ప్రాజెక్టులన్నీ ఒక శతాబ్దానికి పైగా సేవలందించాయి. ఇంకా అందిస్తూనే వున్నాయి. మన పూర్వీకులకు వున్నంత ముందుచూపు మనకూ వుండాలి. గోదావరీ–కృష్ణా–పెన్నా–కావేరి మల్టీ స్టేజ్ లింకేజి ప్రాజెక్టు నీటి పరిమాణాన్ని రెండు వేల టిఎంసిలకు పెంచాలి. రెండు తెలుగు రాష్ట్రాలకు రానున్న వందేళ్ళ అవసరాలను తీర్చేంత నీళ్ళు కేటాయించాకే మిగిలిన నీళ్ళను ఇతర రాష్ట్రాలకు పంచాలి. ఆ మేరకు కేంద్రంపై వత్తిడి తేవాలి. దీనివల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రెట్టింపు కావచ్చు. ఇది ఎలాగూ జాతీయ ప్రాజెక్టు గాబట్టి ఆ వ్యయాన్ని కేంద్రమే భరిస్తుంది. లేకుంటే చెరో 30 వేల కోట్ల రూపాయల భారాన్ని మోయాలని రెండు తెలుగు రాష్ట్రాలను కోరవచ్చు. నీటి పారుదల రంగంలో పెట్టే పెట్టుబడి ఎప్పుడూ వృథా కాదు. ఈ విషయంలో ఏమాత్రం అలసత్వాన్ని చూపినా ముందు తరాలు మనల్ని క్షమించవు.

డానీ

సీనియర్ పాత్రికేయుడు, సమాజ విశ్లేషకుడు

Updated Date - 2020-05-26T09:17:14+05:30 IST