గోదారి తీరాన ఆరని చితిమంటలు

ABN , First Publish Date - 2021-05-07T06:57:28+05:30 IST

కొవిడ్‌.. ఎన్ని కుటుంబాలను బలి తీసుకుంటుందో రాజమహేంద్రవరంలోని కైలాసభూమిని చూస్తే అర్థమవుతేంది.

గోదారి తీరాన ఆరని చితిమంటలు
రాజమహేంద్రవరం గోదావరి తీరాన ఉన్న కైలాసభూమిలో కొవిడ్‌ మృతుల దహనం

 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకూ 500 కరోనా పార్ధివ దేహాల దహనం

 గురువారం నాడే 51 దహనాలు 

 ప్రభుత్వ లెక్కలకు పొంతనే లేదు

 చివరిచూపు కోసం పడిగాపులు.. శ్మశానంలోనే బంధువుల రోదనలు

 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారే  ఎక్కువమంది బలి

 స్త్రీ, పురుషులను ఇంచుమించు సమానంగా మింగేస్తున్న కరోనా

 చితాభస్మం కూడా ఇవ్వకూడదని అధికారుల ఆంక్షలు

రాజమహేంద్రవరం కైలాస భూమిలో హృదయ విదారకర దృశ్యాలు


జిల్లాలో రోజూ మరణిస్తున్న వారెందరు? అధికారులు బులిటెన్‌ లెక్కలకు, వాస్తవానికి ఏమైనా తేడా ఉందా? అని గమనిస్తే.. గుండె జారిపోయే సంఖ్య లివి. రోజుకు ఎంతమంది కనుమరుగైపోతున్నారో తెలిస్తే నిజంగానే మన హృదయం బద్ధలవుతుంది. బులిటెన్‌ లెక్క ప్రకారం గడిచిన 24 గంటల్లో 9 మంది జిల్లావ్యాప్తంగా కొవిడ్‌తో మరణించారు. ఏప్రిల్‌ ఒకటి నుంచి చూస్తే అధికారికంగా మరణాలు 109. కానీ ఒక్క రాజమహేంద్రవరం కైలాసభూమిలో గురువారం దహనం చేసిన కరోనా మృతదేహాల సంఖ్య 51. ఏప్రిల్‌ ఒకటి నుంచి 36 రోజుల్లో ఈ ఒక్క కైలాసభూమిలోనే 500 మృతదేహాలకు దహన సంస్కారాలు జరిగాయి. మరి జిల్లా అంతటా లెక్కిస్తే...?

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌.. ఎన్ని కుటుంబాలను బలి తీసుకుంటుందో రాజమహేంద్రవరంలోని కైలాసభూమిని చూస్తే అర్థమవుతేంది. ప్రభుత్వ లెక్కలకు, ఇక్కడ దహనమయ్యే కరోనా పార్ధివ దేహాలకు అసలు పొంతనే లేదు. గురువారం ఒక్కరోజే 51 కరోనా పార్ధివదేహాలను ఇక్కడ దహనం చేశారు. ఇక్కడ కేవలం పార్ధివదేహాలే కాదు, అనేక జీవితాలు భస్మమైపోతున్నాయి. ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకూ ఏకంగా సుమారు 500 మంది కరోనాతో మృతి చెందిన వారిని ఇక్కడ దహనం చేయడం గమనార్హం. ఏప్రిల్‌ 1వ తేదీకి జిల్లావ్యాప్తంగా 636 మంది మృతి చెందిన అధికారులు ధ్రువీకరించారు. గురువారం నాటికి ఈ సంఖ్య 745కు చేరినట్టు అధికారుల లెక్క. ఇది గత ఏడాది కరోనా మొదలైప్పటి నుంచి ఇప్పటివరకూ అధికారికంగా మృతి చెందిన వారి సంఖ్య. కానీ రాజమహేంద్రవరంలో కైలాసభూమిలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకూ 500 మంది అంటే కేవలం 36 రోజుల్లోనే కరోనా పార్ధివ దేహాలను దహనం చేశారు. గత ఏడాది మరింత ఎక్కువ జరిగింది. ఇక్కడే ఇన్ని జరిగితే జిల్లాలోని కాకినాడ, అమలాపురం తదితర ప్రాంతాలలోపాటు అనేకచోట్ల శ్మశానవాటికలు ఉన్నాయి. అక్కడ రోజూ చాలా పార్ధివదేహాలను దహనం చేస్తున్నారు. ఈ లెక్కన ఎన్ని కుటుంబాలు కరోనాకు బలైపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇవి నిజం అని చెప్పడానికి ఈ కైలాసభూమిలో నమోదు చేస్తున్న వివరాలే ఆధారాలు. కరోనాతో మృతి చెందితే ఇక్కడ కరోనా అని నమోదు చేస్తారు. పేరు, వయస్సు, ఏవూరు, ఏకులం, మృతి చెందిన స్థలం ఇంటివద్ద అయితే, ఇంటి వద్ద అనీ, ఆసుపత్రిలో అయితే ఆసుపత్రిలోనని నమోదు చేస్తారు. అంతేకాదు ఎన్ని గంటలకు మృతి చెందారో కూడా నమోదు చేస్తారు. మృతుడి ఆధార్‌ నంబర్‌ కూడా ఇక్కడ నమోదు చేస్తారు. పైగా కరోనా వల్ల మృతి చెందిన వారి అంత్యక్రియల కోసం రూ.6 వేలు వసూలు చేస్తారు. సాధారణ మృతి అయితే రూ.5 వేలు. ఇన్ని ఆధారాలతో ఇక్కడ కరోనా కేసులను నమోదు చేస్తారు.

వరుసగా చితిమంటలు..

 గోదావరి ఒడ్డున ఉన్న ఇన్నీసుపేట కైలాసభూవిలో ఉదయం నుంచి చితిమంటలు  కాలుతూనే ఉన్నాయి. గురువారం ఉదయం 10 గంటల సమయంలో 20 కరోనా వల్ల మృతిచెందిన వారి పార్ధివదేహాలను వరుసగా కొంచెం గ్యాప్‌తో పేర్చిన చితులమీద పెట్టి దహనం చేశారు. వాటికి సంబంధించిన బంధువులు కొందరు పీపీఏ కిట్లు ఽధరించి, దూ రం నుంచే ఈ చితులను చూశారు. మండుతున్న చితిని చూస్తూ తమ వాళ్లకు దూరం నుంచే కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. ఆ చితి తమ తల్లిది అని ఒకరు, తండ్రిది అని ఒకరు, తన బావది అని మరొకరు విలపిస్తూ కూలబడిపోవడం కనిపించింది. తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఒక మహిళ, భర్తను పోగొట్టుకుని తన పిల్లలతో కలిసి రోదిస్తూ మరో మహిళ చేస్తున్న ఆర్తనాదాలు అక్కడి వారి హృదయాలను చలింపజేశాయి. ఇక గురువారం ఒక్కరోజునే ఇక్కడ 51 మంది చితిమంటల్లో కాలి బూడిదైపోయారు. ఉదయం 10 గంటలలోపు 20 మృతదేహాలు రాగా, రాత్రి 7 గంటలకు వాటి సంఖ్య 50కు చేరింది. చివరకు జీఎస్‌ఎల్‌ నుంచి మరో మృతదేహం రావడంతో కరోనాకు బలైన వారి సంఖ్య 51కు చేరింది. వీరంతా రాజమహేంద్రవరం, దాని పరిసర ప్రాంతాలకు చెందినవారే. కొద్ది మం ది ఇతర ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. ప్రభుత్వాసుపత్రి, జీఎస్‌ఎల్‌, బొల్లినేని, ఇతర ప్రైవేట్‌ ఆసుపత్రుల నుంచి వచ్చినవి ఎక్కువ ఉన్నాయి. కాగా కేశవరం ప్రాంతానికి చెందిన ఒక బాధితుడిని బతికించడం కోసం 18 ఆసుపత్రులు తిరిగినట్టు వారి బంధువు ఒకరు చెప్పారు. ఎక్కడకు వెళ్లినా ఆక్సిజన్‌ లేదని పంపించేశారని, కాకినాడ, రాజమహేంద్రవరంలలో కూడా ప్రయత్నం చేశామన్నారు. ఆక్సిజన్‌ ఉంటే తమ బంధువు ప్రాణాలు దక్కేవని వాపోయాడు. ఈ కైలాసభూమి అంతిమ దహన సంస్కారాలకు ధరలు నిర్ణయించారు. వీటిని గేటువద్ద ప్రదర్శించారు. అంతిమ సంస్కారాలకు రూ.5 వేలు. కరోనాతో మృతి చెందితే రూ.6 వేలు,  అంతిమ ఖననానికి రూ.2000, కైలాస రథం చార్జీలు రాజమహేంద్రవరం పరిధిలో రూ.500, అస్థికలు భద్రపరచడానికి రూ.200 వసూలు చేస్తున్నారు. ఇక్కడ కట్టెలు, ఇతర సామగ్రి అంతా వాళ్లే సమకూర్చుకుంటారు. కానీ బయటి అంబులెన్స్‌ నిర్వాహకుల దోపిడీ మాత్రం ఆగలేదు. ఆసుపత్రి నుంచి ఇక్కడ తీసుకొచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి రూ.20 వేలు వసూలు చేస్తున్నారు. మనిషి బట్టి వసూలు చేస్తున్నారు. పేదవాడైనా ఏమాత్రం కనికరం లేదు.

అస్థికలు కూడా ఇవ్వొద్దు

 కొద్దిరోజుల వరకూ ఇక్కడ అస్థికలు భద్రపరిచేవారు. వాటికి రూ.200 చార్జి వేసేవారు. ఇటీవల జిల్లా అధికారులు ఇక్కడ అస్థికలు కూడా భద్రపరచవద్దని హెచ్చరించినట్టు చెబుతున్నారు. దీంతో అస్థికలు తీయడంలేదు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన వ్యక్తి తన తండ్రి ఆస్థికలు తీసి లాకర్‌లో పెట్టమని కోరగా, ప్రస్తుతం ఆ సౌకర్యం లేదని నిర్వాహకులు చెప్పారు. తాను హైదరాబాద్‌ నుంచి వచ్చానని, గోదావరిలో అస్థికలు కలుపుదామనుకున్నానని ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ వేడుకోవడం అక్కడ కనిపించింది.

Updated Date - 2021-05-07T06:57:28+05:30 IST