ఉమ్మడి జిల్లాకు గోదావరి, కృష్ణా జలాలు

ABN , First Publish Date - 2022-05-29T05:58:03+05:30 IST

ఉమ్మడి జిల్లాకు గోదావరి, కృష్ణా జలాలు

ఉమ్మడి జిల్లాకు గోదావరి, కృష్ణా జలాలు


  • భవిష్యత్తులో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు
  • జడ్పీ సమావేశంలో కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

మేడ్చల్‌, మే 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు భవిష్యత్తులో తాగునీటి ఎద్దడి లేకుండా కృష్ణా, గోదావరి నుంచి జలాలను సరఫరా చేసే విధంగా ప్రణాళికలు పూర్తి అయ్యాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం మేడ్చల్‌లోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జడ్పీ చైౖర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి అధ్యక్షత సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రితో పాటు అదనపు కలెక్టర్‌ జాన్‌ శ్యాంసన్‌, సీఈవో దేవసహాయం హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాగర్‌కర్నూల్‌ ప్రాంతం నుంచి కృష్ణాజలాలను  తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్‌ రూ. 1405 కోట్లు కేటాయించారన్నారు. ఘట్‌కేసర్‌ ఆస్పత్రిలో కిడ్ని బాధితులను అదుకోవడానికి డయాలసిస్‌ సెంటర్‌ను మంజూరైందన్నారు. మన ఊరు- మనబడి కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు.  కాగా ప్రభుత్వం పల్లె ప్రగతి పేరుతో నిర్వహించే  15 రోజుల్లో కార్యక్రమాలకు అవసరమైన నిధులు విడుదల చేయడకుంటే ఎలా నిర్వహిస్తామని జిల్లా పరిషత్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఎంసీపల్లి జడ్పీటీసీ హరివర్థన్‌రెడ్డి విమర్శించారు.  ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా పల్లె ప్రగతి చేపట్టాలనడం, ధాన్యం కొనుగోలు చేయక పోవడాన్ని నిరసిస్తూ ఆయన సభ నుంచి వాకౌట్‌ చేశారు. 

 నిధులను వైద్యశాఖకు ఇచ్చేది లేదు

జిల్లా పరిషత్‌కు మంజూరైన రూ. 25 లక్షల నిధులను వైద్యశాఖకు బదిలీ చేయాలని పంచాయతీరాజ్‌ కమిషన్‌ నుంచి లేఖ వచ్చిందని జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి తెలిపారు. ఈ నిధులను మళ్లింపుపై సభ్యులు తీర్మాణం చేయాల్సి  ఉండగా,  ఆ నిధులను వైద్యశాఖకు ఇచ్చేది లేదని సభ్యులు తిరస్కరించారు. అవసరమైతే ఈ నిధులను ఐదు మండలాల్లోని వైద్యశాఖ సూచించిన పనులకు ఖర్చు చేయాలని జడ్పీ వైస్‌చైర్మన్‌ వెంకటేశం అన్నారు. మేడ్చల్‌, ఘట్‌కేసర్‌ ఆస్పత్రుల్లో పోస్టుమార్టం రూమ్‌ను బాగు చేయడంతో పాటు అన్ని సమయాల్లో పోస్టుమార్టం నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని మేడ్చల్‌ జడ్పీటీసీ శైలాజ, ఘట్‌కేసర్‌ ఎంపీపీ వై.సుదర్శన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎదులాపూర్‌లో పల్లె దవాఖానాలో వైద్యులు రావడం లేదన్నారు. అన్ని ఆస్పత్రులను పరిశీలిస్తున్నామని, సమస్యలు పరిష్కారిస్తామని డీఎంహెచ్‌వో పుట్ల శ్రీనివాస్‌ తెలిపారు. 

 వాకౌట్‌పై అభ్యంతరాలు

సమస్యల పరిష్కారానికి ఎంపీగా రేవంత్‌రెడ్డి  జడ్పీ సమావేశానికి రావడం లేదని కాంగ్రెస్‌ జడ్పీటీసీ హరివర్థన్‌రెడ్డి సభల్లోంచి వాకౌట్‌ పర్వం చేపడుతాడని వైస్‌ ఛైర్మన్‌ వెంకటేశం అన్నారు. జిల్లాలో ఇప్పటికే రూ. 4 కోట్ల విలువ చేసే వడ్లను కొనుగోలు చేసినా, విమర్శలు చేయడం తగదన్నారు. అనంతరం రోడ్లు భవనాలు, వ్యవసాయం, ఉద్యాన శాఖతోపాటు మిషన్‌భగీరథ పథకాలపై చర్చించారు.  

మొదటి నుంచి చిన్న చూపే..

 తాము రాకుండా సమావేశాన్ని ఎలా ప్రారంభిస్తారని  అధికార పార్టీకి చెందిన ముగ్గురు జడ్పీటీసీలు  సభ్యులు సీఈవో దేవసహాయంను  ప్రశ్నించినపుడు కాంగ్రెస్‌ జడ్పీటీసీతో కోరం ఉందని సమావేశాన్ని ప్రారంభించామని చెప్పారు. దీంతో అగ్రహించిన మేడ్చల్‌, కీసర, శామీర్‌పేట జడ్పీటీసీ శైలజా, వెంకటేశం, అనిత సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చి ప్రాంగణంలో బైటాయించారు. సమావేశానికి కలెక్టర్‌ రావడవం లేదని, సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియడం లేదని,  సీఈవో జడ్పీటీసీలకు కనీస మర్యాద కూడా  ఇవ్వడం లేదని,  సభ్యులు ఆరోపించారు.  మంత్రి వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటామని మొండికేశారు. చివరకు జడ్పీ  చైౖర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి  సభ్యులను సముదాయించారు.

Updated Date - 2022-05-29T05:58:03+05:30 IST