గోదావరి నిత్యహారతికి 10 వసంతాలు

ABN , First Publish Date - 2020-11-30T06:54:50+05:30 IST

రాజమహేంద్రవరం పుష్కరాల రేవులో అనునిత్యం జరుగుతున్న గోదావరి హారతి ఉత్సవానికి ఆదివారం నిర్వహించిన పౌర్ణమితో 10 వసంతాలు నిండాయి.

గోదావరి నిత్యహారతికి 10 వసంతాలు
నిత్యహారతి ఉత్సవాన్ని తిలకిస్తున్న ఉజ్జయిని అఘోరా మహారాజ్‌ రాజేష్‌నాథ్‌

  • కనుల పండువగా హారతి ఉత్సవం 
  • మహా శివలింగానికి మహాభిషేకం 

రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 29: రాజమహేంద్రవరం పుష్కరాల రేవులో అనునిత్యం జరుగుతున్న గోదావరి హారతి ఉత్సవానికి ఆదివారం నిర్వహించిన పౌర్ణమితో 10 వసంతాలు నిండాయి. ఈ సందర్భంగా బుద్ధవరపు చారిటబుల్‌ ట్రస్ట్‌, దేవదాయధర్మదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో దశమ వేడుక ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథులుగా ఉజ్జయిని అఘోరా మహారాజ్‌ రాజేష్‌నాథ్‌, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ దంపతులు హాజరయ్యారు. వారికి ట్రస్ట్‌ నిర్వాహకులు బీవీఎస్‌ఎన్‌ కుమార్‌ స్వాగతం పలికారు. తొలుత పంటుపై ఏర్పాటు చేసిన వేదికపై స్వామికి ప్రత్యేక అభిషేకాలను రాజేష్‌నాథ్‌ నిర్వహించారు. అనంతరం ధవళేశ్వరం రాధాకృష్ణ సంగీత నృత్యకళాశాల, గాయత్రి నృత్యకళాశాల విద్యార్థినులు ప్రదర్శనలు నిర్వహించారు. పదేళ్లుగా నిత్యహారతి ఉత్సవానికి సేవలు అందిస్తున్న దేవదాయశాఖ ఈవో పి.తారకేశ్వరరావు, ఉద్యోగి గణపతి, కార్పొరేషన్‌ శానిటరీ ఇనస్పెక్టర్‌ రమణ, హారతి పడుతున్న బ్రహ్మణుల బృందం నుంచి ప్రియతమ్‌, యశ్వంత్‌, ఆదిత్య, మణికంఠ, బ్రహ్మణోత్తములను జ్ఞాపికలతో సత్కరించారు. బుద్దవరపు చారిటబుల్‌ ట్రస్ట్‌లో సేవలందించేందుకు ముందుకు వచ్చిన తటవర్తి శ్రీనివాస్‌ను సత్కరించారు. అనంతరం 13 రకాల హారతులను బ్రహ్మణోత్తములు గోదావరికి శాసో్త్రక్తంగా ఇచ్చారు. ఒక్కొక్క హారతీ విశిష్టతను వివరిస్తూ హారతిని ఇచ్చారు. ఎంపీ భరత్‌రామ్‌ మాట్లాడుతూమహాశివుడి అత్యంత ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి అన్నారు. కాశీకి మాత్రమే పరిమితమైన హారతీ ఉత్సవాన్ని ఆధ్యాత్మిక సాంస్కృతిక నగరమైన రాజమహేంద్రవరంలో  నిర్వహించడం,  ఇక్కడ విశిష్టతను పెంచడమేనని, ఈ కార్యాన్ని నిర్విరామంగా చేస్తున్న బుద్దవరపు చారిటబుల్‌ట్రస్ట్‌ను చైర్మన్‌ బీవీఎస్‌ఎన్‌ కుమార్‌ను ఎంపీ అభినందించారు. అనంతరం కుమార్‌ పదేళ్ల నిత్యహారతి ప్రస్థానాన్ని వివరించారు.


  • మహశివలింగానికి మహభిషేకం 

రాజమహేంద్రవరం పుష్కరాల రేవు వెలుపల ఉన్న మహశివలింగానికి ఎంపీ భరత్‌రామ్‌, రాజేష్‌నాథ్‌లు అభిషేకం నిర్వహించారు.  ఈ శివలింగానికి యేటా అభిషేకం చేయాల్సిన ఆవశ్యకతను వారు వివరించారు. పవిత్రగోదావరి నదీతీరాన కార్తీక మాసంలో తాను తన శిష్యబృందం రావడం ఆనందంగా వుందని, మహాశివుని కటాక్షంతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని రాజేష్‌నాథ్‌ అన్నారు. కార్యక్రమంలో మాజీ ఫ్లోర్‌ లీడర్‌ పోలు విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు పిల్లి నిర్మల, మజ్జి నూకరత్నం, నాయకులు మజ్జి అప్పారావు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-30T06:54:50+05:30 IST