గోదా కల్యాణ వైభోగి!

ABN , First Publish Date - 2022-01-14T05:30:00+05:30 IST

గోదాదేవి మధుర భక్తి నిధి. ఆమె చరిత్ర పరమపావనమైనది. జనక మహారాజుకు నాగేటి చాలులో సీతాదేవి లభించినట్టు... తులసివనంలో పెరియాళ్వారుకు (విష్ణుచిత్తునికి) సాక్షాత్తూ భూదేవి దొరికింది. సంతానం లేని విష్ణుచిత్తుడు ఆమెకు ‘గోదా’ అని పేరు పెట్టి, అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశాడు.

గోదా కల్యాణ వైభోగి!

గోదాదేవి మధుర భక్తి నిధి. ఆమె చరిత్ర పరమపావనమైనది. జనక మహారాజుకు నాగేటి చాలులో సీతాదేవి లభించినట్టు... తులసివనంలో పెరియాళ్వారుకు (విష్ణుచిత్తునికి) సాక్షాత్తూ భూదేవి దొరికింది. సంతానం లేని విష్ణుచిత్తుడు ఆమెకు ‘గోదా’ అని పేరు పెట్టి, అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశాడు. బాల్యం నుంచీ పరమభక్తురాలైన గోదా... శ్రీ విల్లిపుత్తూరులో వటపత్రశాయిని సేవిస్తూ... తన అంతరంగాన్ని శ్రీ రంగనాథుడికి అర్పించింది. ఆయనను తప్ప మరొకరిని వివాహం చేసుకోరాదనే నిశ్చయానికి వచ్చింది. తన మనసులోని కోరికను తండ్రికి వివరించింది. తండ్రి సూచన మేరకు... ధనుర్మాసంలో శ్రీ వ్రతాన్ని ఆచరించింది. రోజుకో పాశురాన్ని గానం చేసింది. ఆ పాశురాలే ‘తిరుప్పావై’గా ప్రసిద్ధి చెందాయి. ఆమె అనన్య భక్తికి శ్రీరంగనాథుడు పరవశుడయ్యాడు. విష్ణుచిత్తునికి కలలో కనిపించి... గోదాదేవికి తనతో వివాహం చెయ్యాల్సిందిగా ఆజ్ఞాపించాడు. అలాగే ఆ ప్రాంతాన్ని పాలించే రాజుకు స్వప్నంలో కనిపించి... పల్లకిని పంపాల్సిందిగా ఆనతి ఇచ్చాడు.


ఆ ఆజ్ఞానుసారం గోదాదేవికి నవవధువుగా అలంకారాలు చేసి, పల్లకిలో ఆసీనురాల్ని చేసి... బంధుమిత్ర సపరివారంగా విష్ణుచిత్తుడు బయలుదేరాడు. బ్రహ్మాది దేవతలు తమ దేవేరులతో ఆ పల్లకి వెంట శ్రీరంగనాథుడి సన్నిధికి చేరుకున్నారు. గోదాదేవిని వశిష్టాది సప్త ఋషులు, అరుంధతి తదితర ఋషి పత్నులు దీవించారు. ఆమెను పెళ్ళి కూతుర్ని చేశారు. శ్రీరంగనాథుడి పాదాలను విష్ణుచిత్తుడు కడిగి... తన కుమార్తె గోదాదేవిని కన్యాదానం చేశాడు. అంగరంగ వైభవంగా ఆ వైవాహిక ఘట్టం పూర్తయింది. జీవాత్మ (గోదాదేవి) పరమాత్మలో (శ్రీరంగనాథుడిలో) ఐక్యమయింది.


ఇలా అన్ని భోగాలతో గోదాదేవి శ్రీరంగనాథుణ్ణి అర్చించి... ఆయనలో ఐక్యం చెందిది కాబట్టి ఇది 

‘భోగి పండుగ’గా ప్రసిద్ధి చెందింది. 

ఆయపిళ్ళ రాజపాప

Updated Date - 2022-01-14T05:30:00+05:30 IST