Abn logo
Apr 11 2021 @ 01:11AM

గరుడ, సింహ వాహనాలపై వెంకన్న గ్రామోత్సవం

ఆత్రేయపురం, ఏప్రిల్‌ 10: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి అధ్యయన ఉత్సవాలు వైభవంగా జరుగుతు న్నాయి. మూడోరోజు శనివారం వేకువజామునే గోదావరి జలాలను తీర్థపుబిందెతో తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం, బాలభోగం తదితర కార్యక్రమాలను అర్చకబృందం ఘనంగా నిర్వహించారు. వేదపండితులు ద్రవిడ వేదపారాయణం వల్లించారు. రాత్రి వేదమంత్రాలు, మేళతాళ మంగళవాయిద్యాలు, విద్యుత్‌ వెలుగుల మధ్య గోవిందనామస్మరణతో స్వామివారు పురవీధుల్లో గరుడ, సింహ వాహనాలపై విహరించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయ చైర్మన్‌ రమేష్‌రాజు, ఈవో సతీష్‌రాజు, ధర్మకర్తలమండలి సభ్యులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ,ప్రసాదాలు స్వీకరించారు.

జగన్మోహినీ ఆలయంలో భక్తజనం

ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయంలో శనివారం భక్తజనం పోటెత్తారు. అన్నదాన ట్రస్టుకు ర్యాలికి చెందిన మద్దూరి నాగకుమార్‌ రూ.5,116 విరాళాన్ని సమర్పించారు. హైదరాబాద్‌కు చెందిన పెద్దిబొట్ల శ్రీని వాస్‌, సరిత దంపతులు స్వామివారు, అమ్మవార్ల ఆల యాల్లో గోడలకు ఫ్లోరింగ్‌, గ్రానైట్‌ నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం మహాసంప్రోక్షణ నిర్వహించి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాంతికల్యాణం, గోదర్శనం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఈవో కృష్ణచైతన్య ఏర్పాట్లు నిర్వహించారు.

శనీశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

కొత్తపేట, ఏప్రిల్‌ 10: మందపల్లి మందేశ్వర(శనీశ్వర) ఆలయానికి శనివారం విశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు. స్వామివారి ప్రాతఃకాల అర్చన తర్వాత స్వామి సర్వదర్శనానికి అనుమతినివ్వడంతో తైలాభిషేకాలకు భక్తులు క్యూకట్టారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల ద్వారా స్వామివారి ఆలయానికి రూ.94,552 ఆదాయం లభించినట్టు  సహాయ కమిషనర్‌ శింగం రాధ తెలిపారు.

వీరేశ్వరస్వామికి లక్షపత్రి పూజ

ఐ.పోలవరం, ఏప్రిల్‌ 10: మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామికి లక్షపత్రి పూజ ఘనంగా నిర్వహించారు. మాసశివరాత్రి  పురస్కరించుకుని స్వామివారికి లక్ష మారేడుదళాలతో అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ పురోహితులు  నాగాభట్ల రామకృష్ణమూర్తి ఆధ్వ ర్యంలో స్వామివారికి లక్షపత్రి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.  దేవస్థానం చైర్మన్‌ పెన్మెత్స కామరాజు, ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణతోపాటు అధికసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.అర్చకులు ఉండి దత్తుశర్మ, నాగాభట్ల శ్రీరామశర్మ, కిషోర్‌శర్మ పాల్గొన్నారు.Advertisement
Advertisement
Advertisement