పధ్నాలుగు ఆజ్ఞలు

ABN , First Publish Date - 2020-03-20T06:04:31+05:30 IST

మానవాళి ఎలా జీవించాలో దైవం దివ్య ఖురాన్‌లో నిర్దేశించాడు. మానవులు పాటించాల్సిన నియమాలను పధ్నాలుగు ఆజ్ఞల ద్వారా దివ్య ఖుర్‌ఆన్‌లో....

పధ్నాలుగు ఆజ్ఞలు

మానవాళి ఎలా జీవించాలో దైవం దివ్య ఖురాన్‌లో నిర్దేశించాడు. మానవులు పాటించాల్సిన నియమాలను పధ్నాలుగు ఆజ్ఞల ద్వారా దివ్య ఖుర్‌ఆన్‌లో (బనీఇస్రాయిల్‌ 17: 23-39) స్పష్టంగా వివరించాడు. అవి:


మీ ప్రభువు మీకు ఆజ్ఞాపించాడు. ఆయనను తప్ప మరెవరినీ ఆరాధించకూడదు. తల్లితండ్రులవిషయంలో ఉత్తమంగా వ్యవహరించాలి. వారు వృద్ధాప్యానికి చేరుకున్నట్టయితే వారి పట్ల విసుగు చెందకూడదు.  వారితో మర్యాదగా మాట్లాడాలి. ‘‘ఓ ప్రభూ! బాల్యంలో వీరు నన్ను ప్రేమానురాగాలతో పోషించినట్టే నీవు వారిపై దయచూపించు’’ అని వారి కోసం ప్రార్థిస్తూ ఉండాలి.


మీ ఆంతర్యాలలో ఏముందో మీ ప్రభువుకు బాగా తెలుసు. మీరు మంచివారుగా మసలుకుంటే అల్లాహ్‌ క్షమిస్తాడు. బంధువుల, నిరుపేదల, ప్రయాణికుల హక్కును వారికి ఇస్తూ ఉండాలి. దుబారా చేయకూడదు. అలా ఖర్చు చేసేవారు సైతాను సోదరులు.


ఎవరి విషయంలోనైనా ముఖం తిప్పుకోవాల్సి వస్తే, వారికి చెప్పాల్సింది మృదువుగా చెప్పండి.

చేతులను మెడమీద ఉంచకండి. అలా అని విచ్చలవిడిగా వదిలెయ్యకండి. చేతులు అదుపులో లేకపోతే నిందలపాలు అవుతారు. 

ప్రభువు తాను కోరిన వారికి ఉపాధిని విస్తృతం చేస్తాడు. అలా కోరకపోతే పరిమితం చేస్తాడు. నిస్సందేహంగా ఆయన తన దాసుల గురించి అన్నీ తెలిసినవాడు, అన్నీ చూస్తున్నవాడు. 

దారిద్య్ర భయంతో మీ సంతానాన్ని చంపకండి. వారికీ, మీకూ ఉపాధి ఇచ్చేది మేమే. వారి హత్య ముమ్మాటికీ మహా పాతకం.

వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళకండి. ఎందుకంటే అది నీతి బాహ్యమైన చేష్ట. చాలా చెడ్డ మార్గం.

న్యాయ సమ్మతంగా తప్ప ఏ ప్రాణినీ హతమార్చకూడదు. 

అనాథల ఆస్తి దరిదాపులకు కూడా వెళ్ళకండి. వారు యుక్త వయసుకు వచ్చే వరకూ వాగ్దానాన్ని వారి విషయంలో నెరవేర్చండి.

మీరు కొలిచి ఇస్తున్నప్పుడు నిండుగా కొలవండి. సరైన త్రాసులో తూచండి. అదే ఉత్తమమైన పద్ధతి. దాని ఫలితం గొప్పగా ఉంటుంది.

మీకు అవసరం లేని విషయాల వెంటపడకండి.  

నేలపై నిక్కుతూ నడవకండి. మీరు నేలను చీల్చనూ లేరు. పర్వత శిఖరాలను అందుకొనేంత ఎత్తుకు ఎదగనూ లేరు. 

మీ చర్యలలో చెడు ఉండకూడదు. మీరు ప్రభువు సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ చర్యలను ఆయన నిరాకరిస్తాడు.

అల్లా్‌హతో పాటు మరొకరిని ఆరాధ్యునిగా మీరు కల్పించవద్దు. అలా చేశారంటే నిందితులు అవుతారు.  


మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2020-03-20T06:04:31+05:30 IST