వంద కోట్ల దేవుడి ఆస్తి కాజేసేందుకు Minister మాస్టర్ ప్లాన్..!

ABN , First Publish Date - 2021-10-19T06:14:43+05:30 IST

దేవుడి ఆస్తులకూ రక్షణ లేకుండా పోతోంది. వందల కోట్ల విలువ చేసే దేవుడి ఆస్తి కొట్టేసేందుకు మాస్టర్‌ ప్లాన్‌ రెడీ అయింది...

వంద కోట్ల దేవుడి ఆస్తి కాజేసేందుకు Minister మాస్టర్ ప్లాన్..!

  • ప్రైవేటు వ్యక్తులకు కొత్తపేట వేణుగోపాలస్వామి ఆలయం
  • ఈ ఆలయానికి నెలకు రూ.లక్షపైనే ఆదాయం
  • రూ.100 కోట్ల దేవుడి ఆస్తి కాజేసేందుకు మాస్టర్‌ప్లాన్‌
  • వన్‌టౌన్‌ వేంకటేశ్వరస్వామి దేవస్థానంపైనా కన్ను
  • మరో మూడు ఖరీదైన సంస్థలకు టెండర్‌
  • వేగంగా పావులు కదుపుతున్న మంత్రి..
  • ఫైల్‌ సర్క్యులేట్‌ చేయాలని ఆదేశం


దేవుడి ఆస్తులకూ రక్షణ లేకుండా పోతోంది. వందల కోట్ల విలువ చేసే దేవుడి ఆస్తి కొట్టేసేందుకు మాస్టర్‌ ప్లాన్‌ రెడీ అయింది. అందులో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి ఇంటి పక్కనే ఉన్న పురాతన వేణుగోపాలస్వామి ఆలయాన్ని ఓ కుల సంఘానికి కట్టబెడుతూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని ఆధారంగా చేసుకుని సుమారు రూ.100 కోట్లకుపైగా విలువైన ఆస్తిని చేజిక్కించుకునేందుకు మంత్రి అనుచరులు సిద్ధమవుతున్నారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేవాలయాలకు చెందిన ఖరీదైన ఆస్తులపై అధికారపార్టీ నాయకులు కన్నేశారు. అందులో భాగంగా కొద్దిరోజుల క్రితం విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన సుమారు రూ.10 కోట్లు విలువైన 900 గజాల స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే సహకారంతో గన్నవరంలోని భువనేశ్వరి పీఠం ముసుగులో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. తాజాగా పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి ఇంటి పక్కనే ఉన్న శ్రీసత్యభామ, రుక్ష్మిణీ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానాన్ని యాదవ కుల సంఘానికి కట్టబెడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆ ఆలయాన్ని తమ పూర్వీకులు నిర్మించారని, అది తమకే చెందుతుందని యాదవ కులస్థులు పెట్టుకున్న దరఖాస్తు మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే దీని వెనుక మాస్టర్‌ప్లాన్‌ ఉందని, సుమారు రూ.100 కోట్ల విలువ చేసే ఆస్తులున్న నాలుగు సంస్థలను చేజిక్కించు కునేందుకే మంత్రి అనుచరులు ఈ ఆలయాన్ని పథకం ప్రకారం యాదవ కులసంఘానికి కట్టబెట్టారని దేవదాయశాఖ ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. 


మావాళ్లే కట్టారు.. మాకిచ్చేయండి..!

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడి ఆస్తులను కొట్టేసేందుకు కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ‘ఫలాన ఆలయం మా పూర్వీకులు నిర్మించారు.. దానిని మాకు అప్పగించేయండి.. అక్కడికి వచ్చే భక్తుల్లో అధికశాతం మా సామాజికవర్గం వారే.. అందుకే మాకు ఇచ్చేయండి..’ అంటూ దరఖాస్తులు చేసుకోవడం, మెల్లగా ఆ ఆలయాన్ని.. ఆలయంతోపాటు ఆస్తులను స్వాధీనం చేసుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా పశ్చిమ నియోజకవర్గంలోని వేణుగోపాలస్వామి ఆలయం విషయంలోనూ అదే జరిగింది. ఈ ఆలయానికి నెలకు సుమారు లక్ష ఆదాయాన్నిచ్చే ఆస్తులు ఉన్నాయి. గుడి చెంతనే 21 కమర్షియల్‌ దుకాణాలు ఉన్నాయి. మైలవరం నియోజకవర్గం కౌలూరులో రెండు ఎకరాల పొలం ఉంది. ఇలాంటి ఆలయాన్ని కుల సంఘం పెద్దలు అడిగారని ప్రభుత్వం ఆగమేఘాలపై కట్టబెట్టేసింది. ఇదే రీతిలో సుమారు రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్న నాలుగు సంస్థలను చేజిక్కించుకునేందుకు మంత్రి అనుచరులు మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. 


వారికిచ్చారు.. మాకూ ఇచ్చేయండి

విజయవాడ వన్‌టౌన్‌లోని బ్రాహ్మణవీధిలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. దీని చెంతనే నిడుముక్కల రంగవల్లి తాయారమ్మ చారిటీస్‌, నిడుముక్కల సుబ్బారాయుడు ధర్మ రామానుజ కూటం, పారేపల్లి శ్రీరాములు ధర్మరామానుజ కూటం ఉన్నాయి. ఈ నాలుగు సంస్థలూ దేవదాయ శాఖ అధీనంలో ఉన్నాయి. వీటిలో పారేపల్లి శ్రీరాములు ధర్మరామానుజ కూటాన్ని ఫౌండర్‌ ఫ్యామిలీ మెంబర్‌(ఎఫ్‌ఎఫ్‌ఎం) పర్యవేక్షిస్తుండగా, మిగిలిన మూడు సంస్థలనూ దేవదాయశాఖ ఈవోలు పర్యవేక్షిస్తున్నారు. ఈ నాలుగు సంస్థలకూ జిల్లావ్యాప్తంగా సుమారు రూ.100 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిపైన మంత్రి బినామీల కన్ను పడింది. కబ్జా చేసేందుకు మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు. అందులో భాగంగా శ్రీకన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం మేనేజింగ్‌ కమిటీ పేరుతో ఓ లేఖ సిద్ధమైంది. దేవదాయ శాఖ అధీనంలో ఉన్న పైనాలుగు సంస్థలను తమకు అప్పగించాలన్నది ఆ లేఖ సారాంశం. ఈ లేఖను గత ఏడాది డిసెంబరు ఏడో తేదీన దేవదాయశాఖ మంత్రికి ఇవ్వగా, ఆయన అదే రోజు ఆ లేఖపై ఫైల్‌ను సర్క్యులేట్‌ చేయాల్సిందిగా రాసేశారు. ఈ విషయాన్ని అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకురావడంతో ఫైల్‌కు బ్రేక్‌ పడింది. తాజాగా వేణుగోపాలస్వామి ఆలయం అప్పగింతకు ఓకే చెబుతూ జీవో విడుదలవడంతో, దానిని అడ్డుపెట్టుకుని, తమ ఫైలుకూ ఆమోద ముద్ర వేయించుకునేందుకు మంత్రి అనుచరులు సిద్ధమయ్యారు. వాస్తవానికి ఈ ఫైల్‌కు లైన్‌ క్లియర్‌ చేసేందుకే వేణుగోపాలస్వామి ఆలయం అప్పగింతకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారన్న ప్రచారం ఉంది. వేణుగోపాలస్వామి ఆలయాన్ని అప్పగించిన తరహాలోనే దేవదాయశాఖ ఆధీనంలో ఉన్న నాలుగు సంస్థలనూ తమకు అప్పగించాలంటూ శ్రీకన్యకాపరమేశ్వరి దేవస్థానం కమిటీ మరో లేఖ రాసేందుకు సిద్ధమవుతోంది. దీనికి కూడా ఆమోద ముద్ర వేసేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. 


ఆ ఆస్తుల విలువ రూ.100 కోట్లకుపైనే..

బ్రాహ్మణవీధిలోని వెంకటేశ్వరస్వామి దేవస్థానానికి గూడవల్లిలో ఎకరం పొలం ఉంది. దీని విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుంది. పోరంకిలో రూ.2 కోట్ల విలువ చేసే 1.10 ఎకరం, యనమలకుదురులో రూ.10 కోట్ల విలువ చేసే రెండు ఎకరాలు, ఉంగుటూరు మండలం వేమండలో రూ.2 కోట్ల విలువ చేసే పది ఎకరాలు, విజయవాడ గవర్నర్‌పేటలో 800 గజాల స్థలంలో 8 షాపులు ఉన్నాయి. చాకలివారి వీధిలో 600 గజాలు ఉంది. దీని విలువ రూ.6 కోట్ల వరకు ఉంటుంది. ఈ ఆస్తుల విలువ మొత్తం రూ.30 కోట్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయం ఉన్న స్థలం కూడా ఈ దేవస్థానానిదే. పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమీపంలో ఉన్న ఈ స్థలం విలువ కూడా రూ.కోట్లలోనే ఉంటుంది. 

నిడుముక్కల రంగవల్లి తాయారమ్మ చారిటీస్‌కు సామారంగం చౌక్‌లో 300 గజాల విస్తీర్ణంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఉంది. దీని విలువ రూ.10 కోట్ల వరకు ఉంటుంది. నిడుముక్కల సుబ్బారాయుడు ధర్మ రామానుజ కూటానికి పాత శివాలయం వద్ద 200 గజాల విస్తీర్ణంలో వాణిజ్య సముదాయం ఉంది. దీని విలువ రూ.5 కోట్లు ఉంటుంది. ఈ రెండు సంస్థలకూ ఉమ్మడిగా బ్రాహ్మణ వీధిలో 300 గజాల స్థలంలో భవనం ఉంది. ఇక్కడే ఈవో కార్యాలయం కూడా నిర్వహిస్తున్నారు. దీని విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుంది. పారేపల్లి శ్రీరాములు ధర్మరామానుజ కూటానికి శేష్‌మహల్‌ సమీపంలో కనకవల్లి కాంప్లెక్స్‌ పేరిట 40 దుకాణాల వాణిజ్య సముదాయం ఉంది. దీని విలువ రూ.20 కోట్లకుపైనే ఉంటుంది. ఆర్‌ ఆర్‌ అప్పారావు వీధిలో 400 గజాల స్థలం, బ్రాహ్మణవీధిలో సుమారు 400 గజాల స్థలం ఉన్నాయి. వీటి విలువ రూ.20 కోట్లు ఉంటుంది. మొత్తం మీద ఈ నాలుగు సంస్థల ఆస్తి రూ.100 కోట్లకు పైనే ఉంటుంది.


రాజులు నిర్మించిన ఆలయానికీ సామాజిక రంగు!

వాస్తవానికి వేంకటేశ్వరస్వామి ఆలయంతో కన్యకాపరమేశ్వరి దేవస్థానం కమిటీకి ఎలాంటి సంబంధమూ లేదు. ఈ ఆలయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం చాళుక్య రాజులు నిర్మించారని చెబుతారు. అలాంటి ఆలయాన్ని సామాజికవర్గం పేరుతో చేజిక్కించుకునేందుకు జరుగుతున్న ప్రయత్నంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2021-10-19T06:14:43+05:30 IST