మధుర భక్తికి తార్కాణం

ABN , First Publish Date - 2021-12-10T05:30:00+05:30 IST

ద్రవిడవేదం’గా వినుతికెక్కిన ‘నాలాయిర’ (నాలుగువేల పాశురాల) దివ్య ప్రబంధానికి తలమానికం ‘తిరుప్పావై’. నాలాయిర పాశురాలను రచించి....

మధుర భక్తికి తార్కాణం

‘ద్రవిడవేదం’గా వినుతికెక్కిన ‘నాలాయిర’ (నాలుగువేల పాశురాల) దివ్య ప్రబంధానికి తలమానికం ‘తిరుప్పావై’. నాలాయిర పాశురాలను రచించి, గానం చేసిన పన్నిద్దరాళ్వారుల్లో ‘తిరుప్పావై’ని ప్రవచించిన ఆండాళ్‌ (గోదాదేవి) ఏకైక మహిళ కావడం ఒక విశేషం కాగా... నాలాయిర దివ్య ప్రబంధం ‘తిరుప్పావై’తో మొదలై, ‘తిరుప్పావె’ౖతోనే ముగియడం మరో విశేషం. 


చాంద్రమానంలోని మార్గశిర మాసం... ఆ మాసంలో ధనురాశిలోకి సూర్యుడి ప్రవేశంతో మొదలయ్యే ధనుర్మాసం... ఇవి మహావిష్ణువుకు ప్రీతిప్రదమైనవి. ‘మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ కాలంలో చేసే వ్రతాలు, పుణ్యకార్యాలు విశేష ఫలాన్ని ఇస్తాయని పెద్దలు చెబుతారు. ధనుర్మాసం ఆరంభం నుంచి, మకర సంక్రాంతి వరకూ... నెలరోజుల పాటు ఇంటి ముంగిళ్ళను ముగ్గులతో, గొబ్బెమ్మలతో అలంకరించడం తెలుగు ప్రాంతాల్లో అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ప్రధానంగా  వైష్ణవ ఆలయాల్లో దివ్యప్రబంధమైన ‘తిరుప్పావై’ గానంతో స్వామివారిని మేలుకొలపడం సంప్రదాయంగా వస్తోంది. తిరుమలలో సైతం శ్రీ వేంకటేశ్వర స్వామిని ఈ నెలరోజులూ సుప్రభాతానికి బదులు తిరుప్పావైతోనే మేలుకొలుపులు పాడతారు. 


వేద వృక్షానికి బీజం...

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నివాసి అయిన ఆమె తండ్రి విష్ణుచిత్తుడు పెరియాళ్వారుగా ప్రసిద్ధుడు. ఆయన ‘తిరుప్పల్లాండు’ కర్తగా ఖ్యాతి పొందగా, తండ్రిని మించిన తనయురాలుగా... ‘తిరుప్పావై’తో ధ్రువతారగా నిలిచింది. బాల్యం నుంచి విష్ణుభక్తురాలైన ఆండాళ్‌ ఆ స్వామినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ద్వాపరయుగంలో గోపికలు చేసినట్టే తాను కూడా వ్రతం చేయాలని సంకల్పించుకుంది. ధనుర్మాస ప్రారంభం నుంచి నెల రోజుల పాటు... మార్గళి (మార్గశిర) వ్రతాన్ని (దీన్నే ‘ధనుర్మాస వ్రతం’ అని, ‘శ్రీవ్రతం’ అని అంటారు) ఆచరించిన ఆండాళ్‌ రోజుకో పాశురంతో స్వామికి అక్షరాభిషేకం చేసింది. తన స్నేహితురాళ్ళను ఆ పాశురాలతో మేలుకొలుపుతూ, స్వామి సేవకు ఆహ్వానించింది. సమస్త లోకానికీ శ్రేయస్సును అందించే ఆ వ్రతాన్ని చేసి... పరమోన్నతుడైన స్వామి అనుగ్రహాన్ని పొందాలని పిలుపునిచ్చింది. శ్రీమహావిష్ణువు అవతార వైభవాన్ని కీర్తించింది. స్వామిని చేరాలనే తమ కోరికను అనుకూలపరచాలని శ్రీకృష్ణుడి పరివారాన్నీ, దేవేరులనూ వేడుకుంది. తమకు పరాన్ని అనుగ్రహించాలని స్వామిని ప్రార్థించింది. వ్రత సమాప్తి తరువాత... శ్రీరంగనాథుడి ఆజ్ఞ మేరకు ఆమెను శ్రీరంగ క్షేత్రానికి కుమార్తెను విష్ణుచిత్తుడు తీసుకురాగా... ఆమెను స్వామి పరిణయమాడి తనలో ఐక్యం చేసుకున్నాడు. ఆమె ప్రవచించిన ‘తిరుప్పావై’ భక్తి, వేదాంత, ఆధ్యాత్మిక, పౌరాణిక అంశాల సమాహారం. దీన్ని ‘వేదమనై తుక్కుం విత్తాంగు’ అంటారు. అంటే ‘వేదాలన్నీ మహా వృక్షమైతే వాటికి విత్తనం లాంటిది’ అని అర్థం. అంతటి విశిష్టమైన ‘తిరుప్పావై’ని అందించిన ఆండాళ్‌ కథ మధురభక్తికి విశిష్టమైన తార్కాణం.

Updated Date - 2021-12-10T05:30:00+05:30 IST