కన్నెల ఆసుపత్రిలో
కళ్లు తెరిచిన ఖాజా హుస్సేన్ అతడు
చెట్టుకు అమ్మై
దేవికి ప్రియుడైనవాడతడు
నీటిపుట్టలా చిట్లి
నేల నలుచెరగులా పారాడినవాడు
తుఫాను తుమ్మెదై
కవితా వధూటికన ఝూంకరించినవాడు
పిట్ట కూడా ఎగిరిపోవాల్సిందేనని
తెలిసీ, పట్టు కలల గూళ్లు నిర్మించినవాడు
చేపచిలుకై ప్రతీకల కొత్త జోస్యం చెప్పినవాడు
పరిసరాలను పరిమళభరితం చేసే గంధకుటి అతడు
తూటలు నిండిన తుపాకీలా
నిశ్శబ్దంగా అరణ్యపురాణం వినిపించగలవాడు
సినిమా జమ్మలమర్రి నడుమున
కొడవళ్ల కొసలు మెరిపించిన పాటగాడు
మారే రంగు రాజకీయాలపై
కసిగా కామెంట్లు విసిరిన పాత్రికేయుడతడు
ఇం..కొకప్పుడు నవాబులానే బతికినవాడు
చివరకు పద్యాలను సైతం మనకొదిలిపెట్టేసి
హఠాత్తుగా వెళ్లిపోయిన గరీబతడు
దేశరాజు