గోవాను దేవుడే కాపాడాలి: టీఎంసీ హామీపై చిదంబరం

ABN , First Publish Date - 2021-12-12T20:57:32+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న గోవాను దేవుడే కాపాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత, గోవా కాంగ్రెస్ ఇన్‌చార్జి పి.చిదంబరం పరోక్షంగా తృణమూల్ కాంగ్రెస్ ఇచ్చిన..

గోవాను దేవుడే కాపాడాలి: టీఎంసీ హామీపై చిదంబరం

పనజి: అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న గోవాను దేవుడే కాపాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత, గోవా కాంగ్రెస్ ఇన్‌చార్జి పి.చిదంబరం పరోక్షంగా తృణమూల్ కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే గోవాలోని మహిళల కోసం 'నేరుగా నగదు బదలీ' (డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్‌ఫర్) స్కీమ్ ప్రవేశపెడతామంటూ టీఎంసీ శనివారంనాడు హామీ ఇచ్చింది. ద్రవ్యోల్బణానాన్ని తట్టుకునేందుకు వీలుగా ఇంటింటికి మహిళలకు గృహలక్ష్మి పథకం కింద నెలకు రూ.5,000 నగదు బదిలీ చేస్తామని టీఎంసీ నేత మహువా మొయిత్రా వాగ్దానం చేశారు. దీనిపై చిదంబరం వరుస ట్వీట్లలో విమర్శలు గుప్పించారు.


''గోవాలోని 3.5 లక్షల ఇళ్లకు నెలకు రూ.5,000 చొప్పున లెక్కేస్తే రూ.175 కోట్లు అవుతుంది. ఏడాదికి రూ.2,100 కోట్లు. ఇది గోవాకు చాలా చిన్న మొత్తమే మరి. ఎందుకంటే గోవా ఇప్పటికే 2020 మార్చినాటికి రూ.23,474 కోట్ల మేరకు అప్పుల్లో ఉంది. గోవాను దేవుడే కాపాడాలి'' అంటూ చిదంబరం టీఎంసీ హామీపై చురకలు వేశారు.


టీఎంసీ కౌంటర్...

కాగా, చిదంబరం వ్యాఖ్యలను టీఎంసీ నేత కిరణ్ కండోల్కర్ వెంటనే తిప్పికొట్టారు. ''ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ లూటీ చేసిన రూ.35,000 కోట్లను ఇంతవరకూ రికవర్ చేయలేదు. గోవా కుటుంబాలకు ఏడాదికి రూ.2,000 కోట్లు ఇస్తామంటే కాంగ్రెస్ గగ్గోలు పెడుతోంది'' కిరణ్ కండోల్కర్ వ్యాఖ్యానించారు. దిగంబర్ కామత్ 2007 నుంచి 2012 వరకూ గోవా సీఎంగా ఉన్నారు.

Updated Date - 2021-12-12T20:57:32+05:30 IST