రాయితీ గొర్రెల్లో కోత

ABN , First Publish Date - 2021-04-16T05:48:03+05:30 IST

రాయితీ గొర్రెల్లో కోత

రాయితీ గొర్రెల్లో కోత

 21 గొర్రెలకు బదులు 15 పంపిణీ చేస్తున్న వైనం

 పెరిగిన ధరలు, దళారుల అత్యాశతో

 నష్టపోతున్న రైతులు -   పట్టించుకోని పశువైద్యాధికారులు

భీమదేవరపల్లి, ఏప్రిల్‌ 15 : ప్రభుత్వం గొర్రెల కాపర్లను ఆదుకునేందుకు అట్టహాసంగా ప్రారంభించిన రాయితీ గొర్రెల పంపిణీ అపహాస్యమవుతోంది. ప్రభుత్వ నిబంధన ప్రకారం పంపిణీ చేయాల్సిన గొర్రెల సంఖ్యను తగ్గించేశారు. దళారుల అత్యాశ, అధికారుల పట్టింపులేని తనంతో గొర్రెల కాపరులు నష్టపోతున్నారు.

మూడేళ్ల కిందట రాష్ట్రంలో గొర్రెలు, వాటి మాంసం ఉత్పత్తి పెంచాలనే లక్ష్యంతో గొర్రెల కాపర్లకు రాయితీపై గొర్రెలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో రూ.31వేలు గొర్రెల కాపర్లు డీడీలు తీస్తే రూ.90వేలు ప్రభుత్వం కలిపి రాయితీ గొర్రెలను అందించింది. ఒక్కో యూనిట్‌లో 20 ఆడ గొర్రెలు, ఒక గొర్రె పొట్టేలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే విధంగా మూడేళ్ల కిందట వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో రెండో విడత కింద 3,219యూనిట్లు మంజూరయ్యాయి. కానీ రెండేళ్లుగా వాటి పంపిణీ ప్రారంభం కాలేదు. దీంతో డీడీలు కట్టిన రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు గొర్రెల పంపిణీ ప్రారంభం కాగా, రైతులకు తీవ్ర నిరాశ ఎదురైంది. 21గొర్రెలు పంపిణీ చేయాల్సి ఉండగా, 14 లేదా 15 గొర్రెలనే పంపిణీ చేస్తున్నారు. గతంలో ఒక్కో గొర్రెకు రూ.5200 నుంచి 5,500వరకు ధర ఉండగా, ప్రస్తుతం రూ.7వేల నుంచి 8వేల వరకు గొర్రెల ధరలు పెంచి మధ్య దళారులు లాభ పడుతున్నారు. 

గతంలో కర్నూలు, అనంతరపూర్‌ జిల్లాల్లో గొర్రెలు కొనుగోలు చేయగా ఇప్పుడు మాత్రం గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో గొర్రెలు కొనుగోలు చేస్తున్నారు. పశువైద్యాధికారులు ఆయా ప్రాంతాలకు వెళ్లి 21గొర్రెలను కొనుగోలు చేయించి ఆ గొర్రెలకు ఇన్సూరెన్స్‌, రవాణా సౌకర్యానికి కల్పించే వారు. కానీ ప్రస్తుతం పశువైద్యాధికారులను పంపించడం లేదు. గుర్తించిన లబ్ధిదారులను నేరుగా దళారుల వద్దకే వెళ్లడంతో అధిక ధరలు పెంచి రైతులకు అంటకడుతున్నారు. దీంతో 14, 15 గొర్రెలు కూడా రావడం లేదు. అందులో కూడా ఒకటి రెండు చిన్న పిల్లలే ఉంటున్నట్లు లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే రెండున్నర ఏళ్లుగా రాయితీ గొర్రెలు అందించకపోవడంతో వచ్చినకాడికే గొర్రెలు తెచ్చుకుంటున్నట్లు, మరికొంత మంది రైతులు పేర్కొంటున్నారు. గొర్రెల రాయితీ పథకాన్ని మంగళం పాడినట్లు అవుతుందని, మరికొంత మంది రైతులు వాపోతున్నారు.

21 గొర్రెలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి

- గుండెల్లి సదానందంయాదవ్‌, గొర్రెల కాపర్ల సంఘం నేత 

రెండో విడతలో పంపిణీ చేస్తున్న రాయితీ గొర్రెల పథకంలో 21 గొర్రెలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గొర్రెల కాపర్లు రెండు మూడేళ్ల నుంచి డీడీలు తీసి రాయితీ గొర్రెల కోసం ఎదురు చూశాం. తీరా రెండున్నర సంవత్సరాల తరువాత రాయితీ గొర్రెలు వస్తే ఒక్కో యూనిట్‌లో 14లేదా 15 గొర్రెలు మాత్రమే వస్తున్నాయి. దీంతో గొర్రెల కాపర్లు తీవ్ర నిరాశకు గురవుతున్నాం. సంబంధిత అధికారుల పర్యవేక్షణలో 21 గొర్రెలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 

Updated Date - 2021-04-16T05:48:03+05:30 IST