Abn logo
Sep 25 2021 @ 01:26AM

పంట మార్పిడే లక్ష్యం

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

- యాసంగిలో వరి మినహాయింపునకు కసరత్తు

- జిల్లా వ్యాప్తంగా ప్రచారం 

- రైతుల అయోమయం 

-  వానాకాలం సాగులో 1.48 లక్షల ఎకరాల్లో వరి 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడం, ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవడంతో యాసంగిలో వరి సాగుకు ఢోకా లేదని రైతులు భావించారు. తాజాగా దొడ్డు ధాన్యం సాగు చేయవద్దని, ప్రత్నామ్నాయ పంట లపై దృష్టిసారించాలని ప్రభుత్వం ప్రకటించడంతో నిరాశకు గురయ్యారు.   జిల్లాలో దొడ్డురకం వడ్లు, పత్తి ప్రధాన పంటలుగా రైతులు సాగు చేస్తున్నారు.   వానాకాలం సాగులో  గతంలో కంటే దాదాపు 30 వేల ఎకరాల్లో వరి విస్తీర్ణాన్ని  పెంచారు. యాసంగిలో మరింత పెంచుకోవడానికి సిద్ధమవుతున్న క్రమంలో దొడ్డు రకం వరి వద్దంటూ ప్రచారం మొదలైంది. పంట మార్పిడి తప్పనిసరని అధికార యంత్రాంగం రైతులను అవగాహన పరిచే దిశగా ప్రచారం ప్రారంభించింది. పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్వయంగా జిల్లా స్థాయి అవగాహన సదస్సును నిర్వహించారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి  అవసరమైన విత్తనాలు సమకూర్చుకునే దిశగా మార్గనిర్దేశ  చేశారు. 

జిల్లాలో క్లస్టర్లవారీగా సదస్సులు 

యాసంగిలో దొడ్డురకం వరిసాగును భారీగా తగ్గించడానికి జిల్లాలోని 57 క్లస్టర్లలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు సదస్సులు కొనసాగనున్నాయి. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ,   కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు బంధు సమితి ప్రతినిధులు  రైతు వేదికల్లో రైతులకు ప్రత్యామ్నాయం పంటలు, ఉద్యాన పంటలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆయిల్‌పాం, కూరగాయలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న జొన్నలు, మినరల్స్‌ వంటి పంటల సాగుతో కలిగే లాభాలను వివరిస్తున్నారు. రైతులు మాత్రం ప్రత్యామ్నాయ పంటలవైపు ఆసక్తి చూపడం లేదు. కాళేశ్వరం జలాలతో ఎగువమానేరు, మిడ్‌ మానేరు, అనంతగిరి ప్రాజెక్ట్‌లతోపాటు చెరువులను నింపారు. దీనికి తోడు వర్షాలు కురవడం, గతంలో ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు పెరగడంతో రైతులు వరి వైపే ముగ్గు చూపుతున్నారు. వానాకాలం సాగు జిల్లాలో 2.60 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తే అందులో వరి 1.48 లక్షల ఎకరాల్లో వేశారు. పత్తి 98,702 ఎకరాల్లో సాగు చేశారు.  మొక్కజొన్న 408 ఎకరాలు, కందులు 10,518, ఇతర పంటలు 2 వేల  ఎకరాల్లో వేశారు. గతంలో దొడ్డురకం బదులు సన్నరకం వడ్లు సాగు చేసి మద్దతు ధర పొందలేక ఇబ్బందులు పడిన రైతులు ఈ సారి ప్రత్యామ్నాయ పంటలవైపు ఆసక్తి చూపడం లేదు. 


ఆయిల్‌పాం వైపు ప్రత్యేక దృష్టి 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయిల్‌పాం సాగుపై అధికారలు ప్రత్యేక దృష్టిసారించారు.   రైతులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం వంద ఎకరాల వరకు యాసంగిలో సాగు చేసే విధంగా ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అఽధికారులు ప్రణాళిక రూపొందించారు. మంత్రి కేటీఆర్‌ ప్రజాప్రతినిధులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో ముందుగా సాగు చేసి రైతులకు ఆదర్శంగా నిలవాలని, అంతేకాకుండా ఖమ్మంలోని అశ్వారావుపేటలో ఆయిల్‌ పాం సాగు అధ్యయనానికి రైతులను తీసుకెళ్లడానికి సిద్ధం చేశారు. జిల్లాలో ఆయిల్‌పాం పంటను కొనుగోలు చేయడానికి ఫ్యాక్టరీ స్థాపనకు మలేషియాకు చెందిన కంపెనీతో ఒప్పందం కూడా చేశారు. జిల్లాలో 13 మండలాల్లో ఎనిమిది వేల ఎకరాల్లో ఆయిల్‌ పాం తోటల సాగుకు ఒప్పందం చేసుకున్నారు. ఆయిల్‌ పాం కంపెనీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎఫ్‌జీవీ సంస్థ ప్రతినిధుల బృందం ముస్తాబాద్‌ మండలం తెర్లమద్ది ప్రాంతంలో ఫ్యాక్టరీ స్థాపనకు స్థలాని పరిశీలించింది.