కూలి పనికి వెళ్లి..

ABN , First Publish Date - 2022-08-15T05:36:29+05:30 IST

ఆటోపై చెట్టుకూలిన ప్రమాదంలో పిట్టాడ గ్రామానికి చెందిన యువకుడు రొంగలి మహేష్‌(27), లోతుగెడ్డ పంచాయతీ కొండపర్తి బాడవకు చెందిన మహిళ జునపాలి సింహాచలం(25) మృతిచెందారు.

కూలి పనికి వెళ్లి..
ఆటోలో మృతదేహాలు

 తిరిగి బయలుదేరుతుండగా ఆటోపై కూలిన చెట్టు  
 డ్రైవర్‌, కూలీ మృతి
 ప్రమాదం నుంచి బయటపడ్డ 11 మంది కూలీలు
మెంటాడ, ఆగస్టు 14:
ఆటోపై చెట్టుకూలిన ప్రమాదంలో పిట్టాడ గ్రామానికి చెందిన యువకుడు రొంగలి మహేష్‌(27), లోతుగెడ్డ పంచాయతీ కొండపర్తి బాడవకు చెందిన మహిళ జునపాలి సింహాచలం(25) మృతిచెందారు. ఆండ్ర పోలీసులు, బాధిత కుటుంబాల సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి. రొంగలి మహేష్‌ మెంటాడలో పురుగు మందు దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆటో కూడా నడుపుతుంటాడు. పిట్టాడలో వరినాట్లు వేసేందుకు కొండపర్తి బాడవ నుంచి  12 మంది గిరిజన కూలీలను ఆదివారం ఉదయం ఆటోలో తీసుకువెళ్లాడు. తిరిగి సాయంత్రం మళ్లీ వారిని స్వగ్రామానికి తరలించేందుకు వచ్చాడు. పిట్టాడ సమీపంలోని తాటిమాను పొలంవద్ద అర్‌అండ్‌బి రహదారిపై ఆటో నిలిపాడు. కూలీలంతా వచ్చాక ఆటోను స్టాట్‌ చేశాడు. అంతలోనే రహదారిని ఆనుకొని ఉన్న తాటిచెట్టు అమాంతంగా ఆటోపై కూలిపోయింది. మహేష్‌, సింహాచలంపై చెట్టు బలంగా పడడంతో క్షణాల్లో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఆటోలో వున్న మరో ఇద్దరికి స్వల్ప గాయాల య్యాయి. మిగిలినవారంతా ప్రమాదం నుంచి బయట పడ్డారు. మహేష్‌కు తల్లిదండ్రులు మంగమ్మ,సత్యం వున్నారు. సింహాచలానికి ఇద్దరు కుమారైలు, భర్త వున్నారు. మృతదేహాలను శవపంచనామా కోసం గజపతినగరం కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. ఆండ్ర ఎస్‌ఐ సుదర్శన్‌ కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు. ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, సర్పంచ్‌ కాపారపు పైడపునాయుడు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.



Updated Date - 2022-08-15T05:36:29+05:30 IST