Advertisement
Advertisement
Abn logo
Advertisement

అప్పన్న గో సంతతి కబేళాలకు!

రైతుల ముసుగులో లేగదూడలు తరలింపు

రెండు వాహనాల్లో రవాణా చేస్తుండగా పట్టుకున్న బీజేపీ, గో పరిరక్షణ సంఘం కార్యకర్తలు

ఆనందపురం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు

లేగదూడలు దేవస్థానం పాత గోశాలకు తరలింపు


విశాఖపట్నం: సింహాద్రి అప్పన్న స్వామికి భక్తులు సమర్పించే లేగ దూడలను.... కొంతమంది అక్రమార్కులు రైతుల ముసుగులో కబేళాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు చాలాకాలంగా  ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి రెండు వ్యాన్‌లలో కబేళాలకు తరలిస్తున్న లేగదూడలను ఆనందపురం మండలం రేగానిగూడెం గ్రామం వద్ద బీజేపీ, హిందూ గో పరిరక్షణ సంఘానికి చెందిన కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం ఆనందపురం పోలీసు స్టేషన్‌కు తరలించి, దూడలను రవాణా చేస్తున్న వారిపై ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి మాట్లాడుతూ, లేగదూడల తరలింపు వెనుక ఆనందపురం మండలానికి చెందిన ఓ వైసీపీ నాయకుడు ఉన్నాడని ఆరోపించారు. దీనికి వివరాల్లోకి వెళితే...


సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామికి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన రైతులు గోసంతతిని సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి శనివారం అధిక సంఖ్యలో గో సంతతిని.. ప్రధానంగా లేగదూడలను తొలిపావంచా వద్ద అప్పన్న స్వామికి పూజలు చేసి వదిలి వెళుతుంటారు. వీటిని దేవస్థానం సిబ్బంది పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌ కార్డు, వీఆర్‌వో ధ్రువీకరణ పత్రాల ఆధారంగా రైతులకు దత్తత ఇస్తుంటారు. వీటిని రైతులు పెంచి పోషించి వ్యవసాయ పనులకు మాత్రమే వినియోగించాలి. వీటి స్థితిగతులను దేవస్థానం అధికారులు పర్యవేక్షించాలి. అయితే సిబ్బంది కొరత కారణంగా పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ఈ నేపథ్యంలో ఆనందపురం మండలానికి చెందిన కొందరు పశు దళారులు... రైతుల ముసుగులో దేవస్థానం సిబ్బందిని నమ్మించి లేగ దూడలను  తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. ఇదే తరహాలో శనివారం వందకు పైగా లేగ దూడలను రెండు వ్యాన్లలో ఎక్కించి, కబేళాకు తరలిస్తుండగా రేగానిగూడేనికి చెందిన బీజేపీ, గో సంరక్షణ సంఘాల ప్రతినిధులు పట్టుకున్నారు.


అనంతరం ఈ విషయాన్ని దేవదాయ శాఖ ఏసీ శాంతికి ఫోన్‌ చేసి చెప్పారు. ఆమె ఘటనా స్థలికి చేరుకుని లేగదూడలతోసహా వాహనాలను ఆనందపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసులు నమోదు చేయించి, అనంతరం లేగదూడలను సింహాచలం దేవస్థానానికి చెందిన పాత గోశాలకు తరలించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దేవస్థానం ఈవో, ఇతర అధికారులతోపాటు బీజేపీ, హిందూ సంఘాలతో చర్చించి చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.  


Advertisement
Advertisement