ఎంతవరకైనా వెళ్తా

ABN , First Publish Date - 2022-08-04T10:43:57+05:30 IST

‘‘మీ కోసం నేను ఎంతవరకైనా వెళ్తా.

ఎంతవరకైనా వెళ్తా

  • మీకోసం నా అధికారాలన్నింటినీ ఉపయోగిస్తా
  • మీ సమస్యలు తెలుసుకునేందుకు వర్సిటీలకు వస్తా
  • 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా 75 కాలేజీలకొస్తా
  • విద్యార్థులకు నా నైతిక మద్దతు 200 శాతం ఉంటుంది
  • 11 వర్సిటీల విద్యార్థి ప్రతినిధులతో గవర్నర్‌ తమిళిసై
  • సర్కారుపై అసంతృప్తితో ఉన్న వర్గాలకు దగ్గరయ్యేలా వ్యూహాత్మక వైఖరి


హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ‘‘మీ కోసం నేను ఎంతవరకైనా వెళ్తా. నా అధికారం ఎంత వరకు ఉపయోగించాలో అంత వరకు ఉపయోగిస్తా’’ అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ విద్యార్ధులకు భరోసా ఇచ్చారు. బాసర ట్రిపుల్‌ ఐటీలో రగులుతున్న విద్యార్థుల నిరసనల నేపథ్యంలో.. ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న విద్యార్థి లోకానికి దగ్గరయ్యేందుకు గవర్నర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే.. బుధవారం ఆమె 11 యూనివర్సిటీల విద్యార్థి ప్రతినిధులతో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌ మధ్య కోల్డ్‌ వార్‌ నేపథ్యంలో.. ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న వర్గాలకు గవర్నర్‌ దగ్గరవుతూ, వారికి ‘నేనున్నాన’నే భరోసా కల్పిస్తున్న సంగతి తెలిసిందే! అందులో భాగంగానే.. సామాన్య ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు రాజ్‌భవన్‌ వద్ద ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారామె. రాష్ట్రంలో మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. నిస్సహాయ మహిళలకు భరోసా కల్పించేందుకు జూన్‌ 10న ‘మహిళా దర్బార్‌’ నిర్వహించారు.


 ఆ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. అలాగే, ఇటీవల భద్రాచలం ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించిన రోజే తానూ పర్యటించి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. ఇప్పుడు తమను ప్రభుత్వం విస్మరిస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్న నేపథ్యంలో రాజ్‌భవన్‌ దర్బార్‌ హాల్‌లో బుధవారంనాడు 11 యూనివర్సిటీ విద్యార్థులతో గవర్నర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వర్సిటీల్లో నెలకొన్న సమస్యల గురించి విద్యార్థులు గవర్నర్‌ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులతో జరిపిన చర్చల్లో చాలా విషయాలు తెలిశాయన్నారు. ‘‘విద్యార్థులు అడుగుతున్నది మంచి విద్య, కనీస సదుపాయాలు, ఉపాధి అవకాశాలు’’ అనడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కనీస సదుపాయాలు కూడా కల్పించట్లేదన్న అర్థం వచ్చేలా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులకు తన నైతిక మద్దతు ఎప్పుడూ ఉంటుందని.. వారి సమస్యల పరిష్కారానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. ఈ దిశగా తొలుత రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాలను సందర్శించేందుకు గవర్నర్‌ సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా ఏడాది వ్యవధిలో దశలవారీగా 75 కళాశాలలను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలని నిర్ణయించారు. కాగా.. 8500 మంది విద్యార్థులకు ప్రాతినిధ్యం వహిస్తూ తమ సమస్యలను గవర్నర్‌కు విన్నవించేందుకు రాజ్‌భవన్‌కు వచ్చామని బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి మదేష్‌ చెప్పారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ గవర్నర్‌ దృష్టికి తీసుకొచ్చామని.. వాటిపై ఆమె సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇక.. తెలంగాణ కోసం ఉద్యమాలు చేసింది, ప్రాణ త్యాగాలు చేసింది విద్యార్థి లోకమేనని.. కానీ, స్వరాష్ట్రం ఏర్పడ్డాక విద్యార్థులకే తీవ్ర అన్యాయం జరుగుతోందని కాకతీయ వర్సిటీ విద్యార్థి జేఏసీ చైర్మన్‌ తిరుపతి యాదవ్‌ ఆవేదన వెలిబుచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో లేని నిర్బంధాలు ప్రత్యేక తెలంగాణలో ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీల్లో గవర్నర్‌ పర్యటనతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని ఆశిస్తున్నామని తిరుపతి యాదవ్‌ అన్నారు.


వ్యాసాలు రాయండి

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా ‘భారతదేశం శతాబ్ది సంవత్సరం-నా దృష్టి’ అనే అంశంపై నిర్వహిస్తున్న వ్యాసరచన పోటీల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తమిళిసై పిలుపునిచ్చారు. బాగా రాసినవారిలో 75 మందిని ఉత్త మ వ్యాసకర్తలుగా ఎంపిక చేస్తామని, వారి వ్యాసాలను పుస్తకరూపంలో ముద్రిస్తామని చెప్పారు.

Updated Date - 2022-08-04T10:43:57+05:30 IST