గోసంక్షోభం

ABN , First Publish Date - 2020-12-25T06:26:21+05:30 IST

కర్ణాటకలో ఈ మధ్య ఆమోదించిన పశువధ నిషేధ బిల్లు–2020 అనేక పర్యవసానాలకు కారణమవుతోంది. కర్ణాటకలో విధించిన నిషేధం...

గోసంక్షోభం

కర్ణాటకలో ఈ మధ్య ఆమోదించిన పశువధ నిషేధ బిల్లు–2020 అనేక పర్యవసానాలకు కారణమవుతోంది. కర్ణాటకలో విధించిన నిషేధం, గోవాలో మాంసం కొరతకు కారణమై, క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి పెద్ద అవరోధంగా తయారైంది. ‘‘మా రాష్ట్రంలో 30 శాతం మంది మైనారిటీ మతాల వారున్నారు. నేను గోమాతను పూజించేవాడినే, గోవధను వ్యతిరేకించేవాడినే కానీ, ఒక ముఖ్యమంత్రిగా అందరి అవసరాలూ తీర్చవలసిన బాధ్యత నాకున్నది. అందుకని, పశువులను, పశుమాంసాన్ని ఇతర రాష్ట్రాల నుంచి రప్పించే ప్రయత్నం చేస్తున్నాను’’ అని భారతీయ జనతాపార్టీకి చెందిన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గత శనివారం నాడు ప్రకటించారు. ఈ ప్రకటనపై సామాజిక మాధ్యమాలలో చర్చ జరుగుతోంది. 


గోవధ నిషేధం అన్నది ఈ నాటి డిమాండ్ కాదు, అసలు ఈ సమస్యే ఇప్పటిది కాదు. శతాబ్దాల నాటిది. యజ్ఞాలలో బలులివ్వడాన్ని వ్యతిరేకించిన అహింసావాద మతాల ఆవిర్భావ సమయంలోను, మొగలుల కాలంలోను, బ్రిటిష్ పాలనలోను గోవధ ఒక వివాదాంశంగా ఉన్నది. గోహింసను నిరోధించడానికి చర్యలను చర్చించారు, అనేక విధినిషేధాలను అమలుచేశారు కూడా. గోవధ నిషేధాన్ని రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులలో చేర్చాలన్న అభిప్రాయం రాజ్యాంగ సభలో బలంగానే వ్యక్తమైంది. మైనారిటీ మతాలకు చెందిన సభ్యులు దాన్ని బలంగా వ్యతిరేకించలేకపోయారు కూడా. అయితే, గోవధ నిషేధం సామాజికమైన ఆమోదంతో స్వచ్ఛందంగా మాత్రమే అమలుజరగాలని భావించే ఉదారవాదులను ఒప్పించి, బాబా సాహెబ్ అంబేడ్కర్, గోవధ నిషేధాన్ని ఒక ఆదేశిక సూత్రంగా (ఆర్టికల్ 48) రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆవుకు, దాని సంతతికి వ్యవసాయ, గ్రామీణ జీవనంలో ఉన్న ప్రాధాన్యం రీత్యాను, మతపరమైన ప్రాధాన్యం రీత్యాను గోరక్షణను పవిత్ర కర్తవ్యంగా అధిక సంఖ్యాకులైన హిందువులు భావించవచ్చు. హిందూమతంలోనే కాకుండా, బౌద్ధ, జైన, సిక్కు మతాలలో కూడా గోవుకు ప్రాముఖ్యం ఇస్తారు, గోవధను వ్యతిరేకిస్తారు. ఇతర మతాలలో గోమాంసం విషయంలో ఎటువంటి ఆంక్షలు లేకపోవడం వల్ల, అది వారి ఆహారసంస్కృతిలో భాగంగా ఉన్నది. హిందువులలోనే అనేక దళిత సమాజాలలో పశుమాంస భక్షణపై ఎటువంటి ఆంక్షలూ లేవు. ఈశాన్య భారతంలోని ఆదివాసీ సమాజాలలో, కేరళ, గోవా వంటి బహుళ మత ప్రాంతాలలో పశుమాంసం నిత్య ఆహారంగా ఉన్నది. కాబట్టి, భారతదేశంలో మాంసభక్షణ విషయంలో మతపరంగాను, ప్రాంతాల పరంగానూ, ఆహారసంస్కృతీపరంగాను వేరువేరు సంప్రదాయాలు ఉన్నాయని గుర్తించాలి. 


స్వాతంత్ర్యానంతరం గోవధ నిషేధం కోరుతూ ఎన్నో ఉద్యమాలు జరిగాయి. సాధారణ సాధు సంతులు మాత్రమే కాకుండా, హిందూత్వ వాద సంస్థలు కూడా ఈ అంశాన్ని చేపట్టాయి. హిందూత్వ రాజకీయాలు బలపడుతున్న క్రమంలో గోవధ నిషేధం డిమాండ్ బలం పుంజుకుంటూ వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే అనుమతి లేని కబేళాలను నిరోధించడం పేరుతో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది. ఆ రాష్ట్రంలో కూడా గోవధ నిషేధంపై ఇటీవల ఆర్డినెన్స్ జారీచేశారు. దాన్ని అనుసరించే కర్ణాటకలో చట్టాన్ని ప్రవేశపెట్టారు. పశువధ, మాంస విక్రయం వంటి వృత్తులలో మైనారిటీ మతస్థులు పనిచేస్తారన్నది ఈ సందర్భంగా గమనార్హం. అయితే, పశుమాంసంతో సహా అన్ని రకాల మాంసాలను విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారాలలో మెజారిటీ మతస్థులు, అధికారపార్టీతో ప్రయాణిస్తున్న వారు ఉన్నారనేది కూడా బహిరంగ రహస్యం. గతంలో చేసిన చట్టాలు బలహీనంగా ఉన్నాయని, అవి కేవలం ఆవులను మాత్రమే వధ నుంచి మినహాయిస్తున్నాయని భావిస్తున్న ప్రస్తుత పాలకులు, ఆవులు, లేగలు, ఎడ్లు, గేదెలు, దున్నపోతులు- అన్నిటినీ వధ నుంచి మినహాయించడమే కాక, ఉల్లంఘించినవారికి తీవ్రమైన, కఠినమైన శిక్షలు ప్రతిపాదిస్తున్నారు. కర్ణాటక చట్టం అటువంటిదే. 


విక్రయాల అంశం రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూలులో పేర్కొన్న రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. దేశంలోని 20 రాష్ట్రాలలో వేరువేరు సందర్భాలలో గోవధ నిషేధ చట్టాలు చేశారు. ఆ రాష్ట్రాలు చేసిన గోవధ నిషేధ చట్టాలపై దాఖలయిన వ్యాజ్యాలన్నిటిని 2005లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మిజోరం, గోవా, కేరళ, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో గోవధపై నియంత్రణ లేదు. గోరక్షణ తమకు ఎంతో ప్రాణప్రదమైన అంశమని చెప్పుకునే పార్టీలు, ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా దాని ఊసే తీయరు, దేశమంతా గోవధ అని వాదిస్తారు, గోవా విషయంలో ఆ పట్టింపు ఏమైంది- అని ఒకనాటి మిత్రపక్షం శివసేన బిజెపిని నిలదీసింది. గోవాలో నివసించే 30 శాతం మంది ముస్లిములు, క్రైస్తవుల కోసమే కాక, ఏటా ఆ రాష్ట్రాన్ని సందర్శించే 80 లక్షల మంది పర్యాటకుల కోసమైనా అక్కడ పశుమాంసాన్ని అనుమతించక తప్పదు. ఆ అనివార్యతనే గోవా ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. 


కర్ణాటకలో పశుమాంసాన్ని గుండుగుత్తగా నిషేధించిన కారణంగా, నలభై లక్షల మందికి పైగా ఉపాధి కోల్పోతున్నారు. కోడి, మేక, గొర్రె మాంసాలను కొనుగోలు చేసే స్తోమత లేని పేదవారికి పోషకాహారం కరువవుతుంది. సామరస్య పూర్వకమైన సంప్రదింపులు జరిపి ఈ దేశంలో ఆవులను మాంసం కోసం చంపకుండా నివారించడం సాధ్యమే. మైనారిటీ మతస్థులు కూడా ఆ నియమానికి అంగీకరిస్తారు. కానీ, మొత్తంగా పశుమాంసంపైనే నిషేధం విధిస్తే, ఇప్పుడు గోవాలో వచ్చిన సంక్షోభమే దేశమంతా వస్తుంది. పశు వధను నిషేధించడంతో పాటు, గోరక్షకుల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే మూకలకు కర్ణాటక చట్టం రక్షణ ఇస్తున్నది. స్వయం ప్రకటిత రక్షకులు తెలుసుకోవలసిన వాస్తవాలు అనేకం ఉన్నాయి. వ్యవసాయ సంక్షోభం కారణంగానే కదా, రైతు కుటుంబాలు నిరంతరంగా చేస్తూ వచ్చిన పశుపోషణను విరమించుకున్నారు? పోషించలేక రైతులు అమ్ముకుంటేనే కదా, గోవులు కబేళాలకు చేరుతున్నాయి? యజమానులకు ఖరీదు కట్టి ఇచ్చి, గోవులను తమ సంరక్షణలోకి తీసుకునే ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేస్తే, ఎవరూ వధశాలలకు అమ్మరు. అమ్ముతున్నవారిని వదిలేసి, కొనుగోలు చేసేవారిని, రవాణా చేసేవారిని నిలువరిస్తే ఏమి ప్రయోజనం?

Updated Date - 2020-12-25T06:26:21+05:30 IST