క్షేమంగా వెళ్లి.. రండి

ABN , First Publish Date - 2021-12-27T06:23:52+05:30 IST

ఒక ప్రయాణం చివరిదాకా సాగి, గమ్యాన్ని చేరి ముగుస్తుంది. అదే పయనం మధ్యలోనే ఆగిపోతే.. ఎన్నో సవాళ్లు, మరెన్నో జీవన పోరాటాలు. ఇంటి పెద్దను కోల్పోయి, పోషించే వ్యక్తి దూర మై, ఎన్నో కుటుంబాలు వెన్ను విరిగి కుప్పకూలిపోతున్నాయి.

క్షేమంగా వెళ్లి.. రండి
ప్రమాదాలకు నెలవయిన సూర్యాపేట జిల్లా మునగాల ప్రధాన రహదారి

65వ నెంబర్‌ జాతీయ రహదారిపై మృత్యుఘంటికలు

334 రోజుల్లో 342 ప్రమాదాలు, 165 మంది మృతి

అతివేగంతో పెరుగుతున్న ప్రమాదాలు

పెద్దదిక్కును కోల్పోయి వీధిపాలవుతున్న కుటుంబాలు


ఒక ప్రయాణం చివరిదాకా సాగి, గమ్యాన్ని చేరి ముగుస్తుంది. అదే పయనం మధ్యలోనే ఆగిపోతే.. ఎన్నో సవాళ్లు, మరెన్నో జీవన పోరాటాలు. ఇంటి పెద్దను కోల్పోయి, పోషించే వ్యక్తి దూర మై, ఎన్నో కుటుంబాలు వెన్ను విరిగి కుప్పకూలిపోతున్నాయి. పిల్లల్ని పెంచే స్థోమత లేక, రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాల ఆకలికేకలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిత్యకృత్యమ య్యాయి. వీరిని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో దిక్కుతోచక దిగాలు చెందుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 165 మంది మృతి చెందగా, వారిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడ్డాయి.  జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై ఇయర్‌ రౌండప్‌.. 


కోదాడ, డిసెంబరు 26: అత్యంత సాంకేతిక, ఆధునిక పరిజ్ఞానంతో రోడ్డు భద్రతా ప్రమాణాలతో నిర్మించిన హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. అందుకు ఈఏడాది జరిగిన ప్రమాదాలు నిదర్శనంగా మారాయి. జనవరి నుంచి నవంబరు నెలాఖరు నాటికి 342 ప్రమాదాల్లో 165 మంది మృతి చెందగా, 249 మంది క్షతగాత్రులయ్యారు. రహదారి నిర్మాణంలో సాంకేతికలోపం, వాహనదారుల మితిమీరిన వేగంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవి బాధిత కుటుంబ సభ్యులను వీధిపాలు చేయడంతోపాటు అనాథలను చేస్తున్నాయి. కోదాడ మండలంలోని రాష్ట్ర సరిహద్దు నల్లబండగూడెం నుంచి హైదరాబాద్‌ సమీపంలోని దండుమల్కాపురం వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్‌హెచ్‌-65 సుమారు 195 కిలోమీటర్ల మేరకు ఉంది. ఇంజనీరింగ్‌ లోపం, అతివేగం, సక్రమంగా లేని బైపా్‌సలు, జంక్షన్లు, క్రాసింగ్‌లు, అండర్‌పా్‌సలలోని ఇంటర్‌ సెక్షన్‌లలో ప్రమాదాలు జరగటానికి కారణమని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం, జీఎంఆర్‌ చర్యలు చేపట్టాలని రవాణా అధికారులు, వైద్యులు, సామాజిక కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు. 


హైవేపై సగటున రెండు రోజులకు ఒకరు మృతి

హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై ఈ ఏడాది నవంబరు నాటికి 342 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రమాదాల్లో 165 మంది మృతి చెందారు. సగటున 11నెలల్లో నెలకు 15మంది,రెండు రోజులకు ఒకరు చొప్పున మృతి చెందడం ప్రమాదాల తీవ్రతకు తార్కాణంగా నిలుస్తోంది. అంతేగాక నెలకు 249మంది క్షతగాత్రులయ్యారు. నెలకు 23మంది కాళ్లు, చేతులు, విరగడమేగాక శాశ్వత అంగవైకల్యం పొందుతున్నారు. వీరిపై ఆధారపడిన కుటుంబా లు వీధినపడుతున్నాయి. ఆయా కుటుంబాలకు ఇటు జీఎంఆర్‌నుంచి కానీ, అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థికసాయం అందడం లేదు.


ఆందోళన చేసినా... 

ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని హైవేవెంట గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అయినా ఫలితం కనిపించడం లేదు. అక్టోబ రు 31న కోదాడ సమీపంలోని కట్టకొమ్ముగూడెం క్రాస్‌రోడ్డు వద్ద బైక్‌ను కా రు ఢీకొన్న ప్రమాదంలో కాంట్రాక్టు విద్యుత్‌ ఉద్యోగి రాయబారపు లక్ష్మ య్య(47) అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ప్రమాదాల నివారణ చర్య లు చేపట్టాలని కట్టకొమ్ముగూడెం గ్రామస్థులు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. స్థానిక పోలీసులు జీఎంఆర్‌ సంస్థమే మాట్లాడుతామని సర్ధిచెప్పి ధర్నా విరమింపజేయించారు. అయితే చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని సామాజిక కార్యకర్త వేమూరి సత్యనారాయణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు వినతిపత్రం పంపారు. 


రహదారిపై బ్లాక్‌స్పాట్లు

హైవే-65పై తరుచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను అధికారులు గుర్తించారు. 

చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద ములుపు  

నకిరేకల్‌ శివారులోని పద్మానగర్‌ బైపాస్‌ జంక్షన్‌

కేతేపల్లి మండలం ఇనుపాముల బైపాస్‌ జంక్షన్‌

మునగాల మండలం ఆకుపాముల

కోదాడ మండలం దుర్గాపురం కూడలి


పలు ప్రమాదాలు ఇలా..

కోదాడకు చెందిన ఎస్‌కే జానీ ద్విచక్రవాహనంపై వెళుతూ 2014లో 65వ హైవేపై కట్టకొమ్ముగూడెం వద్ద రోడ్డు దాటుతుండగా అతివేగంతో వచ్చిన కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.  మునగాల మండలం ఆకుపాములకు చెందిన దేవరం నాగయ్య 2015లో టూవీలర్‌పై 65 జాతీయ రహదారిపై వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. 


ట్రామాకేర్‌ సెంటర్ల ఏర్పాటు ఎప్పుడో

అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందించడానికి ట్రామాకేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. రహదారులపై ప్రమాదం జరిగినప్పుడు గాయపడిన వారికి 30 నిమిషాల్లోపు వారికి చికిత్స అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన ఈ సెంటర్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తాయి. ఈ కేంద్రంలో ఇద్దరు వైద్యులు, ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌ పనిచేస్తారు. అన్ని జాతీయ రహదారులపై 50 కి.మీకు ఒకటి చొప్పున 65వ నెంబరు జాతీయ రహదారిపై నాలుగు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. అయితే జాతీయ రహదారిపై ట్రామాకేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని 2016లో సామాజిక కార్యకర్త జలగం సుధీర్‌ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి ట్రామాసెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. అదే సంవత్సరం జలగం సుధీర్‌ మంత్రి కేటీఆర్‌ను కలిసి జాతీయ రహదారిపై ట్రామాకేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ క్రమంలో ఇప్పటికే ఔటర్‌ రింగురోడ్డుపై 10 ట్రామాకేర్‌ సెంటర్లు ఏర్పాటు చేశామని, జాతీయ రహదారిపై ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అయినా నాలుగేళ్లుగా హామీ నెరవేరలేదు.

24 గంటలూ సేవలందించాలి : జలగం సుధీర్‌, 

ట్రామాకేర్‌ సెంటర్‌లో 24 గంటలూ సేవలందించాలి. అదేవిధంగా ఆర్థోపెడిక్‌, ఫిజీషియన్‌ వైద్యులను అందుబాటులో ఉంచాలి. గాయపడిన వారికి చికిత్స చేయడానికి ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలి 



చింతలేని కుటుంబం ఛిద్రం 

రోడ్డు ప్రమాదంలో వైద్య,ఆరోగ్య శాఖ ఉద్యోగి మృతి

ఆర్థిక ఇబ్బందుల్లో ఎంపీహెచ్‌ఏ శ్రీనివాస్‌ కుటుంబం

నల్లగొండ అర్బన్‌: తల్లిదండ్రులు, ఇద్దరు కుమారు లు, భార్యతో ఆ కుటుంబం ఉన్నంతలో హాయిగా గడిపేది. కరోనా మహమ్మారితో ప్రపంచమంతా భయాందోళనలో ఉన్నా; ప్రాణాలను లెక్కచేయకుండా ఆ ఇంటి పెద్ద విధులను నిర్వర్తించా డు. ఆ విధి నిర్వహణలో ఉండగానే రోడ్డు ప్రమాదం అతడిని బలితీసుకుం ది. సాఫీగా సాగుతున్న ఆ కుటుంబ జీవనం ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. ఒక్క రోడ్డు ప్రమాదంతో ఆ కుటుంబం ఇప్పుడు వీధిన పడింది. వైద్య, ఆరోగ్య శాఖలో నల్లగొండ మండలం రాములబండ ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలో ఎంపీహెచ్‌ఏ మంటిపల్లి శ్రీనివాస్‌ కరోనా సమయంలో సేవలందించిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌లో ఒకరు. శ్రీనివా్‌సకు భార్య ధనమ్మతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు 8వ తరగతి, మరొకరు 6వ తరగతి చదువుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 22వ తేదీన రాములబండ పీహెచ్‌సీ పరిధిలోని కంచనపల్లి గ్రామంలో కరోనా స్పెషల్‌ డ్రైవ్‌ విధులు నిర్వహించి, నల్లగొండలో ఉంటున్న ఇంటికి వస్తున్నాడు. ఆక్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృత్యువాత పడ్డాడు. 18ఏళ్లుగా వైద్య, ఆరోగ్యశాఖలో విధులు నిర్వహించి, కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచిన శ్రీనివాస్‌ మృతితో ఆయన తల్లిదండ్రులతోపాటు భార్య ధనమ్మ, ఇద్దరు పిల్లలు భవిష్యత్‌ భరోసా లేనివారయ్యారు. ఏఎన్‌ఎం కోర్సు పూర్తి చేసిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని శ్రీనివాస్‌ భార్య ధనమ్మ వేడుకుంటున్నారు.



కుటుంబం చిన్నాభిన్నం : గిద్దె ప్రమీల, కట్టకొమ్ముగూడెం, మం.చిలుకూరు

రోడ్డు ప్రమాదం ఆకుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. చిలుకూరు మండలం కట్టకొమ్ముగూడేనికి చెందిన గిద్దె సైదులు వ్యవసాయ కూలీ. రెండేళ్ల కిత్రం కోదాడకు వెళుతుండగా రహదారిని దాటే సమయంలో వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సైదులుకు భార్య ప్రమీల, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సైదులు ఉన్నంత కాలం కుటుంబానికి ఏ ఇబ్బందీ లేకుండా కంటికి రెప్పలా చూసుకున్నాడు. సైదులు మృతితో కుటుంబం ఇబ్బందుల్లో పడింది. కుమార్తెలు కూలీ చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి. ప్రస్తుత కుటుంబ భారం ప్రమీలపై పడింది. ఎలాంటి ఆధారం లేక, కన్నీళ్లు దిగమింగుకుంటూ కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తోంది. ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందుతుందేమోనని ఆశగా చూసిన ఆమెకు నిరాశ మిగిలింది. దీంతో ఏంచేయాలో దిక్కుతోయని పరిస్థితిలో కుటుంబానికి నెట్టుకొస్తున్న అంటుంది ప్రమీల.  తమలాంటి కుటుంబాలు వీధిపాలుకాకుండా ఉండాలంటే రహదారులపై ప్రమాదాల నివారణకు ప్రభుత్వం కఠిన చట్టాలు రూపొందించాలని పేర్కొంటోంది. ప్రమాదాల్లో మృతిచెందిన కుటుంబాలకు ఆర్థికసాయం, పిల్లల చదువులు, పెళ్లిళ్లకు సహకరించి, ఉపాధి చూపాలని ప్రమీల కోరారు. 


మద్యం తాగి వాహనాలు నడపవద్దు : సుభాష్‌, ఎంవీఐ, కోదాడ

మితిమీరిన వేగంతోనే (130కి.మీ అతివేగం) ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికితోడు రహదారి ఉపరితల డిజైన్‌ సరిగా లేకపోవడం, రోడ్డుపై ఉన్న 26 మూలమలుపులు, అండర్‌పా్‌సలు, ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలు, హెచ్చరిక బోర్డుల లేమి, ప్రమాద హెచ్చరికను సూచించే లైట్లు లేకపోవటం, జంక్షన్‌ల వద్ద ఇనుపకంచెలు ఏర్పాటు చేయకపోవటం ప్రమాదాలకు కారణం. మద్యం తాగి వాహనాలు నడపవద్దు 


ప్రమాదాలకు అతివేగమే కారణం : జస్టిస్‌ అభయ్‌ మనోహర్‌ సప్రే, సుప్రీంకోర్టు కమిటీ ఆన్‌రోడ్‌ సేఫ్టీ చైర్మన్‌

తెలంగాణలో 91 శాతం రోడ్డు ప్రమాద మరణాలు అతివేగం కారణంగా సంభవిస్తున్నాయి. హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ పూర్తి స్థాయిలో ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం వంటి చర్యలు చేపడితే చాలా వరకు రోడ్డు ప్రమాద మరణాలు తగ్గుతాయి. 



జనవరి నుంచి నవంబరు నెలాఖరు వరకు ప్రమాదాలు ఇలా

పీఎస్‌ పరిధి ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు

చౌటుప్పల్‌ 127 40 87

చిట్యాల 55 29 30

నార్కెట్‌పల్లి 15 9 12

కట్టంగూర్‌ 25 13 20

నకిరేకల్‌ 10 6 12

కేతేపల్లి 24 15 21

సూర్యాపేట 36 6 35

మునగాల 37 37 15

కోదాడ 13 10 17

మొత్తం 342 165 249

Updated Date - 2021-12-27T06:23:52+05:30 IST