సింహాచలంలో ఘనంగా గో పూజ

ABN , First Publish Date - 2021-01-16T04:33:08+05:30 IST

గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతారాధన చేసిన ఫలం లభిస్తుందని వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యుడు రాగాల నరసింగరావునాయుడు అన్నారు.

సింహాచలంలో ఘనంగా గో పూజ
గోవుకు పూజలు చేస్తున్న దృశ్యం

సింహాచలం, జనవరి 15: గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతారాధన చేసిన ఫలం లభిస్తుందని వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యుడు రాగాల నరసింగరావునాయుడు అన్నారు. కనుమ పండుగ సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకృష్ణాపురం నృసింహవనంలోని అప్పన్న గోశాలలో దేవస్థానం ఏఈవో వీబీవీ రమణమూర్తి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ, గోపూజలు నిర్వహించారు. అర్చకులు సంతోష్‌శర్మ,  రఘు గోపాలునికి షోడశాపచారాలను సమర్పించారు. అనంతరం గోమాత కాళ్లకు, తలకు, మోపురానికి, వెనుక భాగంలో పసుపురాసి కుంకుమ బొట్లు పెట్టారు. అర్చకులు గో అష్టోత్తర నామాలను చదువుతుండగా భక్తులు పూజలు నిర్వహించారు. దేవస్థానం ప్రత్యేకంగా తయారు చేయించిన మినపగారెలు, బూరెలను, అరటిపండ్లను నైవేద్యంగా పెట్టి గోవులకు తినిపించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు వారణాసి దినేష్‌రాజ్‌, సూరిశెట్టి సూరిబాబు, వాండ్రాసి పార్వతీదేవి, సిబ్బంది, పాల్గొన్నారు. 


అధికార పార్టీ రంగులను పోలిన అలంకరణ 

కాగా గోశాలలో ప్రదర్శనగా ఉంచిన ఎద్దుల బండి, స్వదేశీజాతి ఎద్దులు, గోవుల మెడ, వీపు, కాళ్లకు కట్టిన తాళ్లు అధికార పార్టీ జెండా రంగులను పోలి ఉండడంతో కొందరు భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు.  పవిత్రమైన పుణ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న పండుగలను కూడా రాజకీయం చేయడం తగదని వ్యాఖ్యానించారు. దీనిపై పూజల్లో పాల్గొన్న ఏఈవో వీబీవీ రమణమూర్తిని వివరణ కోరగా, గోపాలకులెవరో తెలియక వాటిని వేసి ఉంటారని, తన దృష్టికి రాలేదని, తక్షణం వాటిని తొలగించారు. 


అనంతుని ఆలయంలో గోపూజలు 

పద్మనాభం: పద్మనాభంలోని అనంతపద్మనాభస్వామి ఆలయంలో శుక్రవారం కనుమ సందర్భంగా పశువుల పండగను ఘనంగా నిర్వహించారు. ఈవో ఎన్‌.లక్ష్మీనారాయణశాస్త్రి ఆధ్వర్యంలో, అర్చకులు పి.సీతారామాంజనేయస్వామి పర్యవేక్షణలో గోపూజ నిర్వహించారు. అనంతరం పలువురు రైతులు తీసుకువచ్చిన పశువులను అలంకరించారు. గోవు ప్రాముఖ్యతపై విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ పోటీలలో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు టి.పద్దు, కె.ఎర్నాయుడు, టి.పైడిరాజు, ఏ.రమణ,  టి.నరసింహనాయుడు, ఎం.సన్నిబాబు పాల్గొన్నారు. 


భీమిలిలో  శ్రీవృషోత్సర్జన పూజ

భీమునిపట్నం: భీమిలి శ్రీలక్ష్మీనృసింహస్వామి తొలిపావంచా వద్ద శుక్రవారం రాత్రి పశువులకు శ్రీవృషోత్సర్జన పూజ నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల సింగరాచార్యులు ఆధ్వర్యంలో కోడిదూడకు, ఆవుపెయ్యికు కల్యాణం నిర్వహించారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు  గోవులను తరలించి పూజలు చేయించారు. 


 



   



Updated Date - 2021-01-16T04:33:08+05:30 IST