సరదా కోసం వెళ్లి సాగర్‌లో గల్లంతు!

ABN , First Publish Date - 2021-08-02T06:33:38+05:30 IST

స్నేహితుల రోజును పురస్కరించుకొని సరదాగా గడుపుదామని వెళ్లిన ముగ్గురు యువకులు శ్రీరాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌లో గల్లంతైన ఘటన ఆదివారం సాయంత్రం నందిపేట మండలం గంగగడ్డ నడికుడ గ్రామం సమీపంలో చోటుచేసుకుంది.

సరదా కోసం వెళ్లి సాగర్‌లో గల్లంతు!

ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌లో ముగ్గురు యువకుల గల్లంతు
కొనసాగుతున్న గాలింపు చర్యలు

నిజామాబాద్‌, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/నందిపేట: స్నేహితుల రోజును పురస్కరించుకొని సరదాగా గడుపుదామని వెళ్లిన ముగ్గురు యువకులు శ్రీరాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌లో గల్లంతైన ఘటన ఆదివారం సాయంత్రం నందిపేట మండలం గంగగడ్డ నడికుడ గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. నందిపేట ఎస్సై ఎస్‌ఐ శోభన్‌ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని అర్సపల్లికి చెందిన అసది ఉదయ్‌(20), బూర్గుల రాహుల్‌(21), గట్టు శివగణేష్‌(22), సాయికృష్ణ, రాజేందర్‌, రోహిత్‌ అనే ఆరుగురు మిత్రులు స్నేహితుల రోజు సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం మూడు బైక్‌ల పైన ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ను చూసేందుకు వెళ్లారు. అక్కడ భోజనం చేసిన తర్వాత చేతులు కడు క్కునేందుకు మొదట శివగణేష్‌ నీటిలో కొద్ది దూరం వెళ్లి అక్కడ చేయి కడుక్కుంటుండగా అతడు వెళ్లిన ప్రాంతంలో నీటిలో బావి ఉండ డంతో అందులో పడిపోయి మునిగి పోయాడు. అతన్ని కాపాడేందుకు రాహుల్‌, ఉదయ్‌ వెళ్లగా వారు కూడా మునిగిపోయారు. వారిని రక్షించేందుకు సాయికృష్ణ, రాజేందర్‌ ప్రయత్నిస్తుండగా వారు కూడా మునిగిపోతుండడంతో ఒడ్డుపై ఉన్న మరో యువకుడు రోహిత్‌ కేకలు వేయడంతో పక్కనే పశువులను మేపుతున్న పెద్ద రాజేశ్వర్‌ అనే వ్యక్తి వచ్చి పైపు సహాయంతో సాయికృష్ణ, రాజేందర్‌లను కాపాడాడు. కానీ, ఉదయ్‌, రాహుల్‌, శివగణేష్‌ అప్పటికే మునిగిపోవడంతో వారిని కాపాడలేక పోయారు. తమ ఆరుగురిలో ఎవరికీ ఈత రాదని ప్రత్యక్ష్య సాక్షి రోహిత్‌ తెలిపాడు. స్థానికుల సమాచారంతో ఎస్సై శోభన్‌బాబు వెంటనే ఘటనా స్థలానికి వచ్చారు. చేపలు పట్టేవారిని తీసుకువచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే రాత్రి కావడం, అక్కడికి పొలాల మధ్య నుంచి వెళ్లాల్సి రావడం వల్ల నీటిలో గాలింపు ఇబ్బందిగా మారింది. బ్యాక్‌ వాటర్‌లో గల్లంతయిన వారి కోసం గాలింపు చేపడుతున్నామని ఎస్సై శోభన్‌ బాబు తెలిపారు. ఎస్సారెస్పీలో చేపలు పట్టేవారిని తీసుకువచ్చి నీటిలో గాలిస్తున్నామని, రాత్రి కావడం వల్ల ఇబ్బందులు తలెత్తుతు న్నాయని తెలిపారు. యువకులు నీట మునిగిన ప్రాంతంలో పాత బావి ఉంటుందని, అది తెలియక పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై తెలిపారు. ఎండాకాలంలో ఈ ప్రాంతంలో నీరు ఉండదని, దీంతో ఆ ప్రాంతంలో రైతులు బావులు తవ్వారని ఎస్సై పేర్కొన్నారు. బ్యాక్‌ వాటర్‌లో ఇలాంటి బావులు చాలా ఉన్నాయని, ప్రాజెక్టు నిండి ఉండడం వల్ల నీళ్లు ఎక్కువగా ఉండి బావు లు కనపడక పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందన్నారు. కాగా.. విషయం తెలుసుకున్న యువకుల కుటుంబసభ్యులు పెద్దసంఖ్యలో ఘటనాస్థలికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Updated Date - 2021-08-02T06:33:38+05:30 IST