25 వేల పోస్టులకు గండి

ABN , First Publish Date - 2022-02-28T07:55:14+05:30 IST

25 వేల పోస్టులకు గండి

25 వేల పోస్టులకు గండి

ఉపాధ్యాయ భర్తీపై మడమ తిప్పేసిన సర్కారు 

మెగా డీఎస్సీ అంటూ గతంలో జగన్‌ హామీ 

అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే లేదు

ఖాళీలు భర్తీ చేయకుండా కొత్త నాటకం

3, 4, 5 తరగతులు ఉన్నత పాఠశాలల్లోకి.. 

ఎస్‌జీటీలకు పదోన్నతులు ఇచ్చి సర్దే ప్రయత్నం 

తక్కువ మంది సిబ్బందితోనే పిల్లలకు పాఠాలు

ఖాళీ అయ్యే పోస్టులకూ నియామకాలుండవు

మిగులు సిబ్బంది ఉన్నారంటూ సర్కారు లెక్కలు


‘భారీగా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీలున్నాయి. మెగా డీఎస్సీతో వాటిని భర్తీ చేస్తాం’.. ఎన్నికల ముందు పాదయాత్రలో నాటి విపక్షనేత వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ ఇది. సీన్‌ కట్‌ చేస్తే.. ఆయన సీఎం అయి మూడేళ్లు కావస్తోంది. ఇప్పటి వరకూ ఒక్క టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయలేదు. ప్రస్తుతమున్న దాదాపు 25 వేల ఖాళీలను భర్తీ చేసే యోచన కూడా ఉన్నట్టు లేదు! ప్రాథమిక పాఠశాలల విలీనం పేరుతో ఉన్న ఉపాధ్యాయులతోనే సర్కారు సరిపెట్టే ప్రయత్నం చేస్తోంది. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో దాదాపు 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పాఠశాలలకు వెళ్లి చూస్తే ఖాళీలున్న విషయం స్పష్టమవుతుంది. వేల సంఖ్యలో ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలలను, ప్రాథమిక పాఠశాలల విలీనం పేరుతో ప్రభుత్వం సృష్టించిన గందరగోళాన్ని పరిశీలించినా అర్థమవుతుంది. మూడేళ్లుగా టీచర్‌ పోస్టులను భర్తీ చేయని ప్రభుత్వం... ఇప్పుడు కొత్త నాటకానికి తెరతీసింది. ఉన్న ఉపాధ్యాయులే మిగులుగా ఉన్నారని లెక్కలేస్తోంది. నూతన జాతీయ విద్యా విధానం పేరుతో 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అందుకు కావాల్సిన ఉపాధ్యాయుల ఉద్యోగాలను మాత్రం భర్తీ చేయడం లేదు. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్‌ టీచర్లు(ఎ్‌సజీటీ)కు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇచ్చి విలీనంలో భాగంగా ఉన్నత పాఠశాలలకు పంపనుంది. అంటే.. ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా.. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో సరిపెట్టనుంది. విద్యా శాఖ ఈ మేరకు  ప్రాథమిక కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. 


విలీనంతో గందరగోళం 

ఉన్నత పాఠ శాలకు 250 మీటర్ల దూరంలో ఉన్న  ప్రాథమిక పాఠశాలలను విలీనం చేసే ప్రక్రియతో విద్యా వ్యవస్థ గందరగోళమైంది.   ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 3, 4, 5 తరగతులు, వాటికి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కూడా ఉన్నత పాఠశాలకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. మిగిలిన 1, 2 తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు దిక్కయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రాథమిక పాఠశాలల్లో చాలా వరకు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోతాయి. ఆ ఉపాధ్యాయుడు వస్తేనే పిల్లలకు పాఠాలు. ఒకవేళ ఆయన సెలవు పెడితే గందరగోళమే. మండల విద్యాధికారికి చెబితే ఆ రోజుకు మరో ఉపాధ్యాయుడు ఎవరినైనా పంపిస్తారు. మరోవైపు ఉన్నత పాఠశాలల్లోనూ కొత్తగా వచ్చేవి మూడు తరగతులైతే.. కొత్తగా వచ్చే ఉపాధ్యాయులు మాత్రం సగటున ఒక్కరే అని లెక్కతేలుతోంది. దీంతో ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఎలా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. 


తక్కువ మందితో పాఠాలెలా? 

ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు... అంటే ఐదు తరగతులున్నాయి. ఆంగ్లం, హిందీ, తెలుగు భాషలకు ఒక్కో ఉపాధ్యాయుడు ఉన్నా సరిపోతుంది. అంటే మూడు భాషలకు ముగ్గురు ఉపాధ్యాయులు. ఇక సబ్జెక్టుల వారీగా చూస్తే... మ్యాథ్స్‌, సోషల్‌, ఫిజిక్స్‌, జీవశాస్త్రం సబ్జెక్టులుంటాయి. అంటే మరో నలుగురు ఉండాలి. మొత్తం ఏడుగురు ఉపాధ్యాయులు ఉండాలి. ఒక మీడియానికి, ఒక్కో సెక్షన్‌కు సంబంధించి మాత్రమే. అదనపు సెక్షన్లకు కనీసం మరో ముగ్గురు ఉపాధ్యాయులు ఉండాలి. అంటే మొత్తం 10 మంది ఉపాధ్యాయులు అవసరం. అలాంటిది ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను విలీనం చేస్తే మరింతమంది అవసరం అవుతారు. అయితే.. ఒక్కో ఉన్నత పాఠశాలలో 9 మంది ఉపాధ్యాయులు, ఒక హెడ్‌మాస్టర్‌, ఒక పీఈటీ ఉండేలా చూడాలని విద్యా శాఖ నిర్ణయించింది. హెడ్‌మాస్టర్‌, పీఈటీలు పాఠాలు చెప్పరు. పాఠాలు చెప్పేది 9 మంది టీచర్లే. అయితే  8 తరగతులకు కలిసి 9 మంది ఉపాధ్యాయులే సరిపోతారని సర్కారు లెక్కలు కడుతోంది. తద్వారా ఉన్నవాళ్లను సర్దేసి విద్యా ప్రమాణాలను ఎక్కడకు తీసుకెళ్తుందనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. పలు బాధ్యతలు చేపట్టాల్సిన హెడ్‌మాస్టరు, వ్యాయామం తరగతులు తీసుకునే పీఈటీలకు వాళ్ల పని వాళ్లకుంటుంది. ఐదు తరగతులకే బొటాబొటీగా సరిపోయే 9 మంది ఉపాధ్యాయులు, 8 తరగతులకు ఎలా సరిపోతారన్నది అంతుపట్టని ప్రశ్న. అయినా విద్యా శాఖ మాత్రం ఉన్నవాళ్లతోనే సరిపెట్టేయడమే తప్ప కొత్తగా ఉపాధ్యాయుల భర్తీ మాత్రం చేయకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. 


భవిష్యత్తులోనూ భర్తీ లేదు

ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ ఉపాధ్యాయుల భర్తీ లేకుండా ఒక పద్ధతిని విద్యా శాఖ రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక పాఠశాలల స్థాయిలో ఉన్న సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుల్లో చాలామంది మిగులుగా ఉన్నట్లు చెబుతోంది. ప్రస్తుతం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న వీరు.. 3, 4, 5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో కలిసిపోతే మిగులు సిబ్బందిగా ఉంటారని లెక్కలేస్తోంది. మిగులు సిబ్బంది 10 వేల మందికి పైగా ఉంటారని లెక్కలు తీస్తోంది. వారందరికీ స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇచ్చి విలీనం తర్వాత ఉన్నత పాఠశాలల్లో పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇంత పెద్దఎత్తున ఎస్‌జీటీలకు పదోన్నతులు ఇస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. ప్రతిపక్ష నేతగా జగన్‌ చెప్పిన ఉపాధ్యాయ ఖాళీల భర్తీ మాటేమిటి? గత మూడేళ్ల నుంచి రిటైరయిన వారి స్థానాల్లో ఖాళీల పరిస్థితి ఏంటి? ప్రపంచ బ్యాంకు రుణం కోసం ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయకూడదన్న పరోక్ష షరతుకు అంగీకరించిన వైనాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్తులో ఎవరైనా స్కూల్‌ అసిస్టెంట్‌ పదవీ విరమణ చేసినా ఆ ఖాళీలను భర్తీ చేయరు. ఎస్‌జీటీలకు పదోన్నతుల పేరిట ఖాళీలను అంతటితో ముగించేస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది. 

Updated Date - 2022-02-28T07:55:14+05:30 IST