భోగిమంటల్లో జీవోల ప్రతులు

ABN , First Publish Date - 2022-01-15T07:23:50+05:30 IST

ఓటీఎస్‌, పీఆర్సీ నిర్ణయాలకు సంబంధించిన జీవో ప్రతులు జిల్లాలోని పలుచోట్ల శుక్రవారం భోగిమంటల్లో తగులబడ్డాయి.

భోగిమంటల్లో జీవోల ప్రతులు
నారావారిపల్లెలో చంద్రబాబు ఇంటి ముందు భోగి మంటల్లో జీవో ప్రతులు వేసి నిరసన తెలుపుతున్న తెలుగు తమ్ముళ్లు

చిత్తూరు/తిరుపతి, జనవరి 14(ఆంధ్రజ్యోతి): ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఓటీఎస్‌, పీఆర్సీ నిర్ణయాలకు సంబంధించిన జీవో ప్రతులు జిల్లాలోని పలుచోట్ల శుక్రవారం భోగిమంటల్లో తగులబడ్డాయి. ‘పనికిరాని వస్తువులను భోగి మంటల్లో వేయడం సంప్రదాయం. చెత్తపై పన్ను విధిస్తూ తీసుకొచ్చిన జీవో కూడా చెత్తతో సమానం’ అంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని ఆధ్వర్యంలో 82, 196 జీవో కాపీలను భోగి మంటల్లో దహనం చేశారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. చంద్రగిరి మండలం నారావారిపల్లెలో చంద్రబాబు ఇంటి ముందు భోగి మంటల్లో జీవో ప్రతులను తెలుగు తమ్ముళ్లు దహనం చేశారు. శాంతిపురం టీడీపీ కార్యాలయం ఎదురుగా మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, కుప్పం మండలం కంగుందిలో నియోజకవర్గ ఇన్‌చార్జి పీఎస్‌ మునిరత్నం, సత్యవేడు టీడీపీ ఇన్‌చార్జి జేడీ రాజశేఖర్‌ తిరుపతిలోని ఆయన నివాస గృహంలో, జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్‌చార్జి చిట్టిబాబు పాలసముద్రంలోని తన నివాసం ఎదుట జీవో కాపీలను భోగి మంటల్లో వేశారు.

Updated Date - 2022-01-15T07:23:50+05:30 IST