నాడు పొమ్మని.. నేడు రమ్మని

ABN , First Publish Date - 2020-12-05T07:20:44+05:30 IST

తొండంగి మండలం కోన తీరప్రాంత గ్రామంలో దివీస్‌ పరిశ్రమ ఏర్పాటు విషయంలో వైసీపీ నాడు పొమ్మని.. నేడు రమ్మన్న చందాన వ్యవహరిస్తున్న తీరుతో కోనప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

నాడు పొమ్మని.. నేడు రమ్మని

  • దివీస్‌ విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి

తుని, డిసెంబరు 4: తొండంగి మండలం కోన తీరప్రాంత గ్రామంలో దివీస్‌ పరిశ్రమ ఏర్పాటు విషయంలో వైసీపీ నాడు పొమ్మని.. నేడు రమ్మన్న చందాన వ్యవహరిస్తున్న తీరుతో కోనప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తొం డంగి మండలం దానవాయిపేట పంచాయతీ పరిధిలోని కొత్తపాకల సమీపంలో దివీస్‌ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు చేయడంతో తీరప్రాంత గ్రామాల ప్రజలంతా ఏకమై తీవ్రంగా ప్రతిఘటించారు. కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలు వారికి అండగా నిలిచాయి. అదే సమయంలో అప్పటి ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి 2016 నవంబరు 21న దానవాయిపేటలో బహిరంగ సభలో మాట్లాడి తమ ప్రభుత్వం ఆధికారంలోకి వస్తే దివీస్‌ పరిశ్రమ లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ఆక్వా జోన్‌గా ఉన్న ప్రాంతంలో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల హేచరీలు దెబ్బతినడంతోపాటు, చాలామందికి ఉపా ధి లేకుండా పోతుందని, ఇటువంటి పరిశ్రమలు ప్రత్యేక జోన్‌లో మాత్రమే ఏర్పడాలి కానీ ఇటువంటి ప్రాంతాల్లో కాదని ఆయన పేర్కొన్నారు. దీంతో జేజేలు పలికిన కోన ప్రజలు తదనంతర ఎన్నికల్లో వైసీపీని ఆదరించారు. ఈ నేపథ్యంలో తిరిగి దివీస్‌ పరిశ్రమ ఏర్పాటు పనులు ప్రస్తుతం చురుగ్గా సాగడం, ఈనెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారన్న ప్రచారం బయటకు వచ్చింది. దీనికి బలం చేకూర్చుతూ జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు పరిశ్రమ ప్రాంతానికి వచ్చి పరిశీలించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పరిసర గ్రామాల ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. నాడు వద్దని.. నేడు అదే పరిశ్రమకు శంకుస్థాపన చేసేందుకు ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. స్థానిక అధికార పార్టీ నేతలు కూడా ఈ విషయంలో చేతులెత్తేయడంతో తిరిగి పోరాటానికి సిద్ధమయ్యారు. కొత్తపాకల గ్రామంలో దీక్ష శిబిరం ఏర్పాటు చేసి రిలే నిరాహార దీక్షలు మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న కమ్యూనిస్టు పార్టీల అగ్రనేతలు హాజరై వారికి వెన్నుదన్నుగా నిలిచారు. దివీస్‌ విషయంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ అగ్ర నాయకత్వం పాటిస్తున్న ద్వంద్వ ప్రమాణాలకు స్థానిక నేతలు తలలుపట్టుకుంటున్నారు. కోనప్రజలకు ఏమి చెప్పాలో తెలియక ఆయోమయంలో ఉన్నారు. ప్రస్తుతం మండలంలో 144 సెక్షన్‌ను పోలీసులు అమలు చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాల దృష్ట్య సీఎం రాకపోవచ్చని ప్రచారం కూడా జరుగుతోంది. రానున్న పరిణామాలు వేచిచూడాల్సి ఉంది.

Updated Date - 2020-12-05T07:20:44+05:30 IST