ఉపాధ్యాయురాలి ప్రాణాలు తీసిన దూరాభారం

ABN , First Publish Date - 2022-01-10T08:26:04+05:30 IST

సొంత ఊరిలో సర్కారు కొలువు. రోజూ బడికి వెళుతూ పిల్లలకు పాఠాలు చెబుతున్న ఆ ఉపాధ్యాయురాలి పాలిట 317 జీవో గుదిబండలా మారింది.

ఉపాధ్యాయురాలి ప్రాణాలు తీసిన దూరాభారం

సుదూర ప్రాంతానికి బదిలీ కావడంతో ఒత్తిడి..

భీమ్‌గల్‌లో ఉపాధ్యాయురాలి బలవన్మరణం

హనుమకొండలో గుండెపోటుతో టీచర్‌ మృతి

ఇవి కేసీఆర్‌ హత్యలే: బండి సంజయ్‌

317 జీవో మరణశాసనం: రేవంత్‌రెడ్డి


భీమ్‌గల్‌ రూరల్‌/మరిపెడ రూరల్‌ (చిన్నగూడూరు), జనవరి 9 : సొంత ఊరిలో సర్కారు కొలువు. రోజూ బడికి వెళుతూ పిల్లలకు పాఠాలు చెబుతున్న ఆ ఉపాధ్యాయురాలి పాలిట 317 జీవో గుదిబండలా మారింది. అప్పటి వరకు ఉన్న ఊరిలో పనిచేసిన ఆమెకు సుమారు 80 కి.మీ దూరంలో ఉన్న బడికి బదిలీ అయింది. కొత్తగా కేటాయించిన పాఠశాలకు వెళ్లాలంటే మూడు బస్సులు ఎక్కి దిగాలి. ప్రయాణ సమయం రెండు గంటలు. భర్త గల్ఫ్‌లో ఉండటంతో ఇద్దరు పిల్లల ఆలనాపాలన చూసుకుంటున్న ఆమెకు సుదూర ప్రయాణం చేసి ఉద్యోగం చేయడం భారంగా అనిపించింది. బదిలీ అయిన నాటి నుంచే ఆ టీచర్‌ తీవ్ర మానసిక క్షోభకు గురయింది. అది తట్టుకోలేక ఉరేసుకుని తనువు చాలించింది. నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం బాబాపూర్‌ గ్రామానికి చెందిన ప్రభుత్వ టీచర్‌ బేతాల సరస్వతి(35) విషాదాంతం ఇది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సరస్వతి బాబాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో సైన్స్‌ టీచర్‌గా పని చేస్తున్నారు. జీవో 317 ప్రకారం ఆమెకు కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలానికి బదిలీ అయ్యింది. అక్కడ రిపోర్ట్‌ చేసిన ఆమె రెండు రోజులు తాడ్వాయి పాఠశాలలో పనిచేశారు. బడికి సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నారు. తనకు సుదూర ప్రాంతానికి బదిలీ కావడంతో నిత్యం తీవ్ర మానసిక వేదనకు గురవుతున్న సరస్వతి.. ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె భర్త 15 ఏళ్ల క్రితం ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లారు. సరస్వతికి కవల పిల్లలు ఉన్నారు. 


గుండెపోటుతో టీచర్‌ మృతి

హనుమకొండలో ఉంటున్న ఓ టీచర్‌కు సుమారు 120 కి.మీ దూరంలోని పాఠశాలకు బదిలీ అయింది. బడికి వెళ్లాలంటే ఆమె సుమారు 3 గంటలు ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో మనస్తాపానికి గురైన ఆ టీచర్‌ గుండెపోటుతో మృతి చెందారు. హనుమకొండలోని ఎన్జీవోస్‌ కాలనీకి చెందిన పుల్యాల శ్రీమతి (మాధవి-40) మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలంలోని పూసల తండాలో పని చేశారు. ఆమెకు ఇటీవల ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూర్‌ యూపీఎస్‌ పాఠశాలకు బదిలీ కావడంతో.. ఈ నెల 7న అక్కడ విధుల్లో చేరారు. అయితే ఆదివారం రాత్రి హనుమకొండలో శ్రీమతి గుండెపోటుతో చనిపోయారు. మారుమూల ప్రాంతానికి బదిలీ కావడంతో శ్రీమతి తీవ్ర ఒత్తిడితో గుండెపోటుకు గురై మృతి చెందారని సామాజిక మాధ్యమాల్లో వార్త వైరల్‌ అవుతోంది.


ఉద్యోగులు మనోధైర్యం కోల్పోవద్దు

జీవో 317తో ఇద్దరు టీచర్లు బలయ్యాయని, ఇవి కేసీఆర్‌ చేసిన హత్యలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు మనోధైర్యం కోల్పోవద్దని ఒక ప్రకటనలో కోరారు. ఉద్యోగుల పాలిట 317 జీవో మరణశాసనంగా మారిందని, ఈ జీవో మరో ఇద్దరి ప్రాణాలు బలిగొందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ జీవోకు వత్తాసు పలుకుతున్న ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం వారి చావులకు బాధ్యత వహించాలని హెచ్చరించారు.

Updated Date - 2022-01-10T08:26:04+05:30 IST