Abn logo
Sep 21 2021 @ 00:20AM

‘జీవో 217ను రద్దు చేయాలి’

వినతి పత్రం ఇస్తున్న టీడీపీ నాయకులు, మత్స్యకార సంఘం సభ్యులు

కర్నూలు(అగ్రికల్చర్‌), సెప్టెంబరు 20: మత్స్యకారుల సహకార సంఘాల ఆధ్వర్యంలో ఉన్న చేపల చెరువుల వేలాన్ని వాటి పరిధి ఉంచి తప్పించడానికి తీసుకొచ్చిన జీవో.217ను రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర కుమార్‌ ముఖ్యమంత్రి జగన్‌ను హెచ్చరించారు. జిల్లాలోని మత్స్యకారుల సహకార సంఘాల ప్రతినిధులతో కలిసి టీడీపీ నేత నాగేంద్ర కుమార్‌ సోమవారం కలెక్టరేట్‌లో డీఆర్వో పుల్లయ్యను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ చేపల వేటనే వృత్తిగా చేసుకుని దశాబ్దాలుగా మత్స్యకారులు సహకార సంఘాల ద్వారా జీవనోపాధిని పొందుతున్నారని అన్నారు. ఈ వృత్తిలో సరైన ఉపాధి లేకపోయినా మత్స్యకారులు మరో వృత్తిని ఎంచుకునే అవకాశం లేక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని నాగేంద్ర కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇప్పటి దాకా మత్స్యకార సహకార సంఘాల ఆధ్వర్యంలో ఉన్న చెరువుల వేలాలను వారి పరిధి నుంచి తప్పించి బహిరంగ వేలానికి శ్రీకారం చుడుతూ జీవోను విడుదల చేయడం దారుణమన్నారు. చెరువుల్లో వచ్చే ఆదాయం మొత్తం ఇప్పటి దాకా మత్స్యకారులకే చెందుతోందని, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మత్స్యకార సహకార సంఘాలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను పథకాలు అమలయ్యాయని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా జగన్‌ మత్స్యకారుల జీవితాలతో చెలగాటమాడుతూ  217 జీవోను విడుదల చేశారని అన్నారు. ఈ జీవో ప్రకారం వేలంలో వచ్చే ఆదాయంలో 30 శాతం ప్రైమరీ ఫిషర్‌మెన్‌ కో ఆపరేటివ్‌ సొసైటీకి ఇస్తారని అన్నారు. ఇలాంటి నిబంధనలు ఉన్న ఈ జీవో వల్ల మత్స్యకారుల ఉపాధికి గండి పడుతుందని అన్నారు. ఇది అమలైతే దాదాపు 40 లక్షల మంది మత్స్యకారుల జీవితాలు చీకటిమయం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుయువత అద్యక్షుడు అబ్బాస్‌, సాంస్కృతిక విభాగం టీడీపీ అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి, బీసీ సెల్‌ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు జేమ్స్‌ పాల్గొన్నారు.