జీవో 117.. విద్యకు విఘాతం

ABN , First Publish Date - 2022-06-25T04:38:22+05:30 IST

జీవో 117పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ విద్య ప్రమాదంలో పడుతుందని ఉపాధ్యాయవర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాఠశాలలు, ఉపాధ్యాయ పోస్టులు తగ్గిపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదముందని చెబుతున్నాయి. ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

జీవో 117.. విద్యకు విఘాతం
పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు



ఉపాధ్యాయ పోస్టుల తగ్గింపే లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలల్లో ఇక ఆటలకు చెల్లు
92 మందికి తగ్గితే హెచ్‌ఎం, పీఈటీ లేనట్లే
(ఇచ్ఛాపురం రూరల్‌)

 జీవో 117పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ విద్య ప్రమాదంలో పడుతుందని ఉపాధ్యాయవర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాఠశాలలు, ఉపాధ్యాయ పోస్టులు తగ్గిపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదముందని చెబుతున్నాయి. ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు, పీఈటీ పోస్టులకు మంగళం పాడింది. ఈ ఉత్తర్వులను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 2,354 ప్రాథమిక, 411 ప్రాథమికోన్నత, 491 ఉన్నత పాఠశాలల్లో 2,74,509 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికే తొలి విడతగా 304 ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. ఆయితే జీవో 117 ప్రకారం జరిగే రేషనలైజేషన్‌లో అనేక సమస్యలు వస్తాయని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

ఆ రెండు పోస్టులకు మంగళం
మూడు నుంచి పది తరగతులు ఉండే ఉన్నత పాఠశాలల్లో 137 మంది.. ఆరు నుంచి పది తరగతులు ఉండే పాఠశాలల్లో 92 మందిలోపు విద్యార్థులు ఉంటే ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ పోస్టులుండవు. అలాగే 17 సెక్షన్ల విద్యార్థులకు ఒకే ఒక్క హిందీ ఉపాధ్యాయుడు పాఠాలు బోధించాల్సి ఉంటుంది. ఇటీవల మండల, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్దీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 19 సెక్షన్లకు మూడు గణితం, సాంఘిక శాస్త్రం పోస్టులిచ్చింది. దీంతో వారానికి ప్రతి ఉపాధ్యాయుడు 48 పీరియడ్లు బోధించాల్సి ఉంటుంది. అలాగే 6 నుంచి 10వ తరగతి వరకు 18 సెక్షన్లకు 21 మంది ఉపాధ్యాయులను కేటాయించారు. ఉపాధ్యాయులు ఒకరు లేదా ఇద్దరు సెలవు పెడితే తరగతుల నిర్వహణ కష్టంగా మారుతుంది. మూడు, ఎనిమిది తరగతులకు అసలు ఉపాధ్యాయ పోస్టులనే కేటాయించలేదు. అలాగే 3 నుంచి 8వ తరగతి వరకు తెలుగు మీడియం ఉండదు. ఉంటే ఇంగ్లీషు మీడియం ఉందు. అలాగే ఒకటి, రెండు తరగతులు ఉండే ఫౌండేషన్‌ మరియు 1 నుంచి 5 తరగతులు ఉండే ఫౌండేషన్‌ పాఠశాలల్లో 30 మంది విద్యార్థులకు ఒక సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ను నియమిస్తారు. విద్యార్థుల సంఖ్య 31 దాటితే రెండో ఎస్‌జీటీ నియమిస్తారు. కనీస విద్యార్థులు లేని ప్రాథమిక పాఠశాలలన్నీ ఏకోపాధ్యాయ బడులుగా మారుతాయి. ప్రాథమిక పాఠశాలల్లో 121 మంది కన్నా ఎక్కువమంది పిల్లలుంటే ప్రధానోపాధ్యాయుడి పోస్ట్‌ను కేటాయిస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రాఽథమిక ఉపాధ్యాయులే బోధన చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేకుండా ఉన్న పోస్టులే సర్దుబాటు చేయడానికి జీవో 117 అవకాశం ఇస్తుంది. ఫలితంగా గ్రామీణ విద్యకు విఘాతం కలుగుతుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హెచ్‌ఎం లేకుంటే ఎలా?
రేషనలైజేషన్‌ ద్వారా ఉన్నత పాఠశాలల్లో 92 మంది విద్యార్థుల కన్నా తగ్గితే హెచ్‌ఎం, పీఈటీ పోస్టు రద్దు చేస్తారు. దీనివల్ల ప్రభుత్వ విద్యకు నష్టం వాటిల్లుతుంది. 117 జీవో ద్వారా సర్దుబాటు పేరుతో భారీగా ఉపాధ్యాయు పోస్టులకు కోత విధించడంతో పిల్లలు అన్యాయమైపోతారు.
- ఆర్‌వీ అనంతాచార్యులు, ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు



600 మందికి ఒక హిందీ టీచరా?
జీవో 117 వల్ల 600 మంది విద్యార్థులకు ఒకే హిందీ ఉపాధ్యాయుడు బోధించాల్సి వస్తుంది. హిందీ బోధనకు 17వ సెక్షన్‌ వరకు ఒక ఉపాధ్యాయుడు, 18వ సెక్షన్‌కు మరో ఉపాధ్యాయుడు ఉండాలి. అయితే ఈ జీవో వల్ల ఆ అవకాశం ఉండదు. దీంతో ఉపాధ్యాయులపై పని భారం పెరుగుతుంది.
- నరేంద్రనాథ్‌ పట్నాయక్‌, హిందీ ఉపాధ్యాయుడు




Updated Date - 2022-06-25T04:38:22+05:30 IST