ఉద్యమంపై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2020-11-01T10:11:08+05:30 IST

చలో గుంటూరు - జైల్‌భరోకు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాకు చెందిన కీలక టీడీపీ నేతలను పోలీసులు శనివారం గృహనిర్బంధం చేశారు.

ఉద్యమంపై ఉక్కుపాదం

 ఎక్కడికక్కడ నేతల గృహ నిర్బంధం

 రాజధాని గ్రామాల్లో భారీగా మోహరించిన పోలీసులు


ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): చలో గుంటూరు - జైల్‌భరోకు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాకు చెందిన కీలక టీడీపీ నేతలను పోలీసులు శనివారం గృహనిర్బంధం చేశారు. ఉదయం 7 గంటలకే నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చి ఇంటి నుండి కదలనివ్వలేదు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, గుంటూరులో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు, జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్‌ నసీర్‌, పశ్చిమ ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్ర, మిర్చియార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు, ఇతర నేతలు చిట్టాబత్తిని చిట్టిబాబు, కనపర్తి శ్రీనివాసరావు, కసుకుర్తి హనుమంతరావుతో పాటు తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి రావిపాటి సాయి తదితరులను పోలీసులు ఇళ్లలోనే నిర్బంధించారు. దీనిని నిరసిస్తూ మన్నవ సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి లాల్‌వజీర్‌తో కలిసి తన నివాసంలో దీక్ష చేపట్టారు. దీనిని ఎమ్మెల్సీ రామకృష్ణ ప్రారంభించారు. ఈ చర్యలపై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. అణచివేతలతో ఉద్యమాన్ని ఆపలేరని పోలీసులను హెచ్చరించారు. 


రాజధాని గ్రామాల్లో..

జేఏసీ జైలు భరో పిలుపు మేరకు రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించారు. రాజధాని నుంచి గుంటూరు వెళ్లే మార్గాల్లో వాహనాలను పోలీసులు క్షుణంగా తనిఖీలు నిర్వహించారు. ఆటోలు, బస్సుల్లో వెళ్తున్న వారిని ఆపి ప్రశ్నించారు. ఉద్దండ్రాయునిపాలెంలో దళిత జేఏసీ సభ్యులు, మహిళలను పోలీసులు అడ్డుకుని వెనక్కు పంపారు. దళిత జేఏసీ నేత పులి చిన్నాను అడ్డుకొని పోలీసు వ్యాన్‌లో ఎత్తిపడేశారు. రాయపూడిలో దళిత మహిళా జేఏసీ సభ్యురాలు కంభపాటి శిరీషను హౌస్‌ అరెస్టు చేశారు. మందడంలో దళిత జేఏసీ నేత బేతపూడి సుధాకర్‌, తుళ్లూరులో కాటా అప్పారావును హౌస్‌ అరెస్టు చేశారు. టీడీపీ గుంటూరు పార్లమెంట్‌ మహిళా ప్రధాన కార్యదర్శి షేక్‌ రిజ్వానాను ఇంటినుంచి బయటకు రానివ్వలేదు. అరెస్టులతో ఉద్యమాన్ని అపలేరని టీడీపీ గుంటూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. తాడికొండ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ  శాంతియుతంగా నిరసలు వ్యక్తం చేసే స్వేచ్ఛ రాష్ట్రంలో లేదని పేర్కొన్నారు. 



   చలో గుంటూరు జైల్‌ భరో సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ అరవిందబాబును పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. అన్నం పెట్టే రైతుల చేతులకు బేడీలు వేయడం దారుణం అని అరవిందబాబు అన్నారు. రైతుల కన్నీరు పెట్టించిన ఈ ప్రభుత్వం పడిపోవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో భీమినేని వందనాదేవి, దాసరి ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు. 

 

 మంగళగిరి నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్‌చార్జ్‌ గంజి చిరంజీవిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేసి బయటకు వెళ్ళకుండా ఉండాలని ఆంక్షలు విధించారు.

Updated Date - 2020-11-01T10:11:08+05:30 IST