రైతులకు సంకెళ్లు.. సిగ్గుచేటు

ABN , First Publish Date - 2020-10-31T07:44:36+05:30 IST

అమరావతి ఉద్యమానికి పోటీగా పెయిడ్‌ ఉద్యమానికి ప్రభుత్వమే తెర తీసి వారిని ప్రశ్నించిన రైతులపై అక్రమ కేసులు పెట్టి సంకెళ్లతో జైలుకు

రైతులకు సంకెళ్లు.. సిగ్గుచేటు

 టీడీపీ, సీపీఐ అమరావతి జేఏసీ నిరసనలు 

 ప్రభుత్వ చర్యను నిరసిస్తూ నేడు గుంటూరు జైలుభరో


గుంటూరు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి):  అమరావతి ఉద్యమానికి పోటీగా పెయిడ్‌ ఉద్యమానికి ప్రభుత్వమే తెర తీసి వారిని ప్రశ్నించిన రైతులపై అక్రమ కేసులు పెట్టి సంకెళ్లతో జైలుకు తరలించడం సిగ్గుచేటని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు తెలిపారు. రాజధాని రైతులకు సంకెళ్లు వేయడంపై శుక్రవారం గుంటూరులో తన క్యాంపు కార్యాలయంలో సంకెళ్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందన్నారు. ప్రభుత్వ అరాచకాలకు ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెప్తారన్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి కేసు విత్‌ డ్రా చేసుకుంటే డీఎస్పీ దుర్గాప్రసాద్‌ అంగీకరించక కక్షపూరితంగా రైతులను జైలుకు పంపారన్నారు.


ఈ కార్యక్రమంలో మిర్చియార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు, నాయకులు చిట్టాబత్తిని చిట్టిబాబు, గోళ్ల ప్రభాకర్‌, కనగాల చిట్టిబాబు, గుడిమెట్ల దయాతర్నం, విజయ్‌ కిరణ్‌, సౌపాటి రత్నం, బొళ్లారపు రాజా, గెల్లా సైమన్‌, పిల్లా మణి, నల్లపనేని అమర్‌నాథ్‌, తాడిమళ్ల తిరుపతిరావు, ఉప్పు శ్రీను తదితరులు పాల్గొన్నారు. 


టీడీపీ, సీపీఐ, అమరావతి పరీరక్షణ సమితి నిరసన 

కేడీల రాజ్యంలో రైతులకు బేడీలు అంటూ టీడీపీ, సీపీఐ, అమరావతి పరీరక్షణ సమితి ఆధ్వర్యంలో నాయకులు చేతులకు బేడీలు వేసుకుని శుక్రవారం గుంటూరు లాడ్జి సెంటర్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారన్నారని, ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్నారంటూ అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పోలీసు రాజ్యం నడుపుతూ అమరావతి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారంటూ సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ శనివారం జైలుభరో కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ, టీడీసీ, సీపీఐ నాయకులు డాక్టర్‌ శైలజ, మల్లికార్జునరావు, స్వామి, తెనాలి శ్రావణ్‌కుమార్‌, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, మహ్మద్‌ నసీర్‌, కోవెలమూడి రవీంద్ర, మన్నవ సుబ్బారావు, మానుకొండ శివప్రసాద్‌, ముప్పాళ్ల నాగేశ్వరరావు, కోటా మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-31T07:44:36+05:30 IST