అక్రమ కేసులను ఎత్తివేయాలి

ABN , First Publish Date - 2020-10-30T09:49:28+05:30 IST

రాజధాని దళిత రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని రాజధాని గ్రామాల రైతులు, దళితులు, మహిళలు డిమాండ్‌ చేశారు.

అక్రమ కేసులను ఎత్తివేయాలి

ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు 

317వ రోజుకు చేరుకున్న అమరావతి ఆందోళనలు

సంకెళ్లపై మండల కేంద్రాల్లో ప్రదర్శనలు.. అధికారులకు వినతులు


తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి క్రైమ్‌, తాడికొండ, వినుకొండ, అక్టోబరు 29: రాజధాని దళిత రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని రాజధాని గ్రామాల రైతులు, దళితులు, మహిళలు డిమాండ్‌ చేశారు. గురువారం తుళ్లూరులోని ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళనలు నిర్వహించి రైతుల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలుత తుళ్లూరులోని దీక్షా శిబిరం వద్దకు రాజధాని పరిఽధిలోని పలు గ్రామాల నుంచి రైతులు, మహిళలు చేరుకున్నారు. అక్కడి నుంచి స్థానిక తహసీల్దారు, ఎంపీడీవో కార్యాలయం, పోలీసు స్టేషన్ల వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆయా కార్యాలయాల ఎదుట ధర్నా చేసి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా దళిత జేఏసీ సభ్యుడు గడ్డం మార్టిన్‌ మాట్లాడుతూ కృష్ణాయపాలెంలో దళిత, బీసీ రైతులపై అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు.  అమరావతి కొనసాగాలని చేస్తోన్న ఉద్యమం గురువారంతో 317కు చేరుకుంది. జై అమరావతి సేవ్‌ అంధ్రప్రదేశ్‌ అంటూ ఆయా శిబిరాల్లో నినాదాలు చేశారు.  పెదపరిమి, రాయపూడి, వెలగపూడి, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, అనంతవరం,  నెక్కల్లు, మందడం ఐనవోలు శిబిరాల్లో ఆందోళనలు కొనసాగాయి. 


తాడేపల్లి మండలం పెనుమాకలో నిరసన దీక్షలు 317వరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఐకాస ప్రతినిధులు మాట్లాడుతూ మూడు రాజధానులకు వ్యతిరేకంగా, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. దీక్షలో ఐకాస నేతలు, స్థానిక రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


 మంగళగిరి మండలం ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, నీరుకొండ, బేతపూడి గ్రామాలలో రాజధాని ఆందోళనలు కొనసాగాయి. ఈ సందర్భంగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు.  


మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం మోతడక, పొన్నెకల్లు గ్రామాల రైతులు, మహిళలు గురువారం నిరసనలు కొనసాగించారు. మోతడకలో రైతులు, మహిళలు సంకెళ్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతికి భూములు ఇచ్చిన పాపానికి రైతులు శిక్ష అనుభవిస్తున్నారన్నారు. 


సంకెళ్లపై జిల్లావ్యాప్తంగా నిరసనలు

అమరావతి రైతులపై అక్రమంగా కేసులు పెట్టి సంకెళ్లతో జైలుకు తరలించడంపై గురువారం జిల్లావ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.  అమరావతి పరిరక్షణ జేఏసీ, టీడీపీ ఆధ్వర్యంలో ప్రదర్శనలు, అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. గుంటూరులో నాన్‌ పొలిటికల్‌ జేఏసీ, టీడీపీ నాయకులు తూర్పు, పశ్చిమ తహసీల్దారు కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు. సత్తెనపల్లిలో తహసీల్దారు కార్యాలయం వద్ద అమరావతి జేఏసీ నేతలు ఆందోళన చేశారు. చిలకలూరిపేటలో జేఏసీ ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం వద్ద నిరసన తెలిపి వినతిపత్రం అందించారు.


మంగళగిరిలో అమరావతి దళిత జేఏసీ, అమరావతి రైతు జేఏసీ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. వినుకొండలో అమరావతి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద దీక్ష నిర్వహించారు. అదేవిధంగా నకరికల్లు, పెదకూరపాడు, అచ్చంపేట తదితర మండల కేంద్రాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. తెనాలిలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ అమరావతికి భూములు ఇచ్చిన దళిత రైతుల చేతులకు వైసీపీ ప్రభుత్వం సంకెళ్లు వేయించి అవమానించడం సిగ్గుమాలిన విషయమన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం న్యాయానికి సంకెళ్లు వేసి రాజ్యాధికారం సాధిస్తుందని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. 

Updated Date - 2020-10-30T09:49:28+05:30 IST