సొంతింటి కలపై.. కుట్రలు

ABN , First Publish Date - 2020-10-30T09:52:14+05:30 IST

గత ప్రభుత్వం కేటాయించిన ఎన్టీఆర్‌ గృహాలను పేదలకు దక్కకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు.

సొంతింటి కలపై.. కుట్రలు

జగ్గడిగుంటపాలెం చేపట్టిన పాదయాత్ర ఆలపాటి
ఇళ్లు వెంటనే అప్పగించాలని నినదించిన లబ్ధిదారులు
 
తెనాలి టౌన్‌, అక్టోబరు 29: గత ప్రభుత్వం కేటాయించిన ఎన్టీఆర్‌ గృహాలను పేదలకు దక్కకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు. గురువారం లబ్ధిదారులు, టీడీపీ శ్రేణులతో కలిసి జగ్గడిగుంటపాలెంలోని ఎన్టీఆర్‌ గృహ సముదాయం నుంచి  మున్సిపల్‌ కార్యాలయం వరకు ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం తొలి విడతగా తెనాలిలో 2 వేల మందికి గృహాలను మంజూరు చేసి 845 కుటుంబాల చేత గృహ ప్రవేశం చేయించగా వైసీపీ ప్రభుత్వం ఇంత వరకు వారికి వాటిని అప్పగించకపోవడం సిగ్గుచేటన్నారు. లబ్ధిదారులు గృహ ప్రవేశం చేసిన ప్లాట్లలో వారి అనుమతి లేకుండా క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాల కొనుగోలు నుంచి మెరకలు వేసే వరకు అవినీతి జరిగిందని ఆరోపించారు. పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయిస్తే ఇప్పటికి రాష్ట్రంలో 30 లక్షల మంది సొంతింటి కల నెరవేరేదని తెలిపారు. పేద వాడికి సొంతింటి కలను నిజం చేసేందుకు నిరవధిక దీక్షకైనా వెనుకాడబోమన్నారు. లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను రద్దు చేసుకుని స్థలాలకు దరఖాస్తు చేసుకోవాలని వలంటీర్లు  బెదిరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ గుంటూరు పార్లమెంట్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, మాజీ చైర్మన్‌ పెండేల వెంకట్రావు, అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ మంగమూరి హరిబాబు, పట్టణ, మండల అధ్యక్షులు ఖుద్దూస్‌, కేసన కోటేశ్వరరావు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గడవర్తి సుబ్బయ్య, నాయకులు కావేటి సామ్రాజ్యం, సుంకర హరికృష్ణ, ఈదర శ్రీనివాసరావు, శాఖమూరి చిన్న, రావి కృష్ణమోహన్‌, డాక్టర్‌ వేమూరి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-30T09:52:14+05:30 IST