4,50,450 మందికి రైతు భరోసా సాయం

ABN , First Publish Date - 2020-10-28T10:38:54+05:30 IST

జిల్లాలో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా 2020-21 రెండో విడత సాయం వెబ్‌ల్యాండ్‌లో నమోదైన 4,50,450 మందికి రూ.180.18 కోట్లు విడుదల చేసినట్లు కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు.

4,50,450 మందికి రైతు భరోసా సాయం

 రూ.180.18 కోట్లు విడుదల

3,394 మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ 


గుంటూరు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా 2020-21 రెండో విడత సాయం వెబ్‌ల్యాండ్‌లో నమోదైన 4,50,450 మందికి రూ.180.18 కోట్లు విడుదల చేసినట్లు కలెక్టర్‌  శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం సీఎం జగన్‌ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్‌ రైతుభరోసా - పీఎం కిసాన్‌ రెండో విడత, 2020 సెప్టెంబరు వరకు జరిగిన పంట నష్టపరిహారం విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ వెబ్‌ ల్యాండ్‌లో నమోదు కాని 7,418 మంది రైతులకు రూ.2.967 కోట్లు, అటవీ భూములు సాగు చేసుకొంటున్న 1,591 మంది గిరిజన రైతులకు రూ.0.741 కోట్లు, కౌలుదారులు 13,333 మందికి రూ.15.333 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు.  జిల్లాలో సెప్టెంబరు నెలలో భారీ వర్షాలు కారణంగా పెదకూరపాడు నియోజకవర్గంలోని ఏడు గ్రామాలు, గురజాల నియోజకవర్గంలోని రెండు గ్రామాలు, సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక గ్రామం, తాడికొండ నియోజకవర్గంలో రెండు గ్రామాలలో 3,394 మంది రైతులకు సంబంధించి 1,673.205 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు.


దానికి సంబంధించి రూ.2.50 కోట్ల ఇన్‌ఫుట్‌ సబ్సిడీని కూడా బ్యాంకు ఖాతాల్లో వేశామన్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్‌ నుంచి  శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, జేసీ(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌, ఎమ్మెల్యేలు మహమ్మద్‌ ముస్తఫా, ఉండవల్లి శ్రీదేవి, డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, విడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావు, మేరుగ నాగార్జున, కిలారి రోశయ్య తదితరులు హాజరయ్యారు. 

Updated Date - 2020-10-28T10:38:54+05:30 IST