వదలనంటోన్న వైరస్‌

ABN , First Publish Date - 2020-08-14T05:30:00+05:30 IST

జిల్లాలో కొత్తగా మరో 527 మంది కరోనా వైరస్‌ భారిన పడ్డారు. శుక్రవారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జే యాస్మిన్‌ గత 24 గంటల్లో నమోదైన పాజిటివ్‌ కేసులపై బులెటిన్‌ విడుదల చేశారు. గురువారం జీజీహెచ్‌

వదలనంటోన్న వైరస్‌

జిల్లాలో 527 మందికి కరోనా 

గుంటూరు, నరసరావుపేటలో తగ్గని తీవ్రత

గుంటూరులో 132, నరసరావుపేటలో 90 కేసులు 

ఎన్నారై ఆస్పత్రిపై నుంచి దూకి కరోనా బాధితుడి ఆత్మహత్య 

 

గుంటూరు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా మరో 527 మంది కరోనా వైరస్‌ భారిన పడ్డారు. శుక్రవారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జే యాస్మిన్‌ గత 24 గంటల్లో నమోదైన పాజిటివ్‌ కేసులపై బులెటిన్‌ విడుదల చేశారు. గురువారం జీజీహెచ్‌లోని ల్యాబ్‌కు సెలవు కావడంతో కేసుల ఒరవడి కాస్తంత తగ్గింది. గుంటూరు నగరంతో పాటు నరసరావుపేటలోనూ వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. గుంటూరు నగరంలో 132 కేసులు రాగా వాటిలో ఆర్టీసీ కాలనీలో 15, బొంగరాలబీడులో 21, ఎన్‌జీవో కాలనీలో 37 మందికి పాజిటివ్‌గా అధికారులు నిర్ధారించారు.


ఇక జిల్లాలోని 44 మండలాల్లో కొత్త కేసులు వచ్చాయి. కొల్లూరులో ఐదు కేసులు నమోదు కాగా వారిలో ఇద్దరు చిన్నారులకు పాజిటివ్‌ వచ్చినట్లు తహసీల్దారు జాన్‌పీటర్‌ తెలిపారు. బొద్దులూరుపాడు, ఆవులవారిపాలెం, గాజుల్లంక, క్రాప, సుగ్గునలంకలో ఒక్కొక్క కేసు నమోదైందన్నారు. పొన్నూరు పట్టణంలో వివిధ వార్డుల్లో ఆరు, మండలంలోని పలు గ్రామాల్లో 10 కేసులు నిర్ధారణ అయినట్లు తహసీల్దారు పద్మనాభుడు తెలిపారు.     నరసరావుపేటలో కొత్తగా 90 కేసులు నమోదయ్యాయి. మండలంలోని గ్రామాలలో 14, పట్టణంలో 76 కేసులు నమోదయ్యాయి. కారంపూడి పీహెచ్‌సీ పరిధిలో గురువారం నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన 30 మందిని ఆర్టీసీ బస్సులో చిలకలూరిపేట క్వారంటైన్‌కు తరలించినట్లు వైద్యాధికారి బాలకిషోర్‌నాయక్‌ తెలిపారు. 


రొంపిచర్ల మండలం మునమాక గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(50) నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలలో ఈ నెల 13 నుంచి అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడు. అతడు శుక్రవారం మృతి చెందాడు. దీంతో మృతుడికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలిందని వైద్యాధికారి స్వాతి తెలిపారు.  


మనస్థాపంతో వృద్ధుడి ఆత్మహత్య

మంగళగిరి క్రైమ్‌: కరోనా వచ్చిందనే మనస్థాపంతో గుంటూరు మారుతీనగర్‌కు చెందిన ఓ వృద్ధుడు(66) ఆత్మహత్య చేసుకున్నాడు. వృద్ధుడికి కరోనా సోకడంతో ఈ నెల 12న మంగళగిరి మండలం చినకాకాని ఎన్నారై కొవిడ్‌ క్వారంటైన్‌ సెంటర్‌లో చికిత్స నిమిత్తం చేరాడు. గురువారం రాత్రి అందరితో పాటు భోజనం చేశాడు. అనంతరం అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రిలోని మూడో ఫ్లోర్‌కు చేరుకుని అక్కడి నుంచి కిందికి దూకాడు.


గమనించిన ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది సమాచారంతో వృద్ధుడ్ని వైద్యులు ఐసీయూకు తరలించి పరీక్షిస్తుండగా కొద్దిసేపటికే మృతి చెందాడు. వృద్ధుడు అస్తమా, బీపీ, షుగర్‌ వ్యాధులతో బాధపడుతున్నాడని, దీనికి తోడు కరోనా సోకడంతో మనస్థాపంతో లేక మరేవైనా కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో  రూరల్‌  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2020-08-14T05:30:00+05:30 IST