జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా బహుముఖ వ్యూహం

ABN , First Publish Date - 2021-06-23T09:24:38+05:30 IST

జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా బహుముఖ వ్యూహం

జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా బహుముఖ వ్యూహం

రుణ భారాన్ని తగ్గించుకునే యత్నం.. గ్యాస్‌ విద్యుత్‌ ప్లాంట్లలో ఉత్పత్తి


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రుణ భారాన్ని తగ్గించుకోవడానికి, విస్తరణకు జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బహుముఖ వ్యూహాన్ని అనుసరించాలని భావిస్తోంది. భూమి, ఆస్తుల విక్రయం, డాలర్‌ బాండ్ల జారీ ద్వారా రుణ భారాన్ని తగ్గించుకోనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, తమిళనాడులోని కృష్ణగిరి, ఇతర ప్రాంతాలలోని భూములను కంపెనీ విక్రయించనుంది. కృష్ణగిరి స్పెషల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ రీజియన్‌లో దేశీయ బహుళ జాతి కంపెనీకి 300 ఎకరాలను విక్రయించనుంది. తమిళనాడు ప్రభుత్వ ఏజెన్సీకి మరో 425 ఎకరాల విక్రయించేందుకు చర్చలు సాగి స్తోంది. గ్యాస్‌ లభ్యత పెరిగినందున నగదు ప్రవాహాన్ని పెంచుకోవడానికి గ్యాస్‌ ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్‌లో ఉత్పత్తిని చేపట్టనుంది.


జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాను రెండు కంపెనీలుగా విడగొట్టే ప్రక్రియ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తి కానుంది. వ్యాపారాలను ఎయిర్‌పోర్ట్‌, నాన్‌ ఎయిర్‌పోర్ట్‌ వ్యాపారాలుగా వేరు చేయనుంది. రెండు వేర్వేలు కంపెనీలు స్టాక్‌ మార్కెట్లో నమోదవుతాయని కంపెనీ వెల్లడించింది. వ్యాపారాన్ని విడగొట్టే ప్రక్రియ పూర్తయిన అనంతరం ఇంధన రంగంలో కొత్త విభాగాల్లోకి అడుగు పెట్టాలని జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా భావిస్తోంది.


 భారత్‌, ఆగ్నేయాసియా ప్రాంతాల్లోని కొత్త విమానాశ్రయాల అభివృద్ధిపై దృష్టి సారించనుంది. విమానాశ్రయ సేవల వ్యాపారాలను మరింతగా అభివృద్ధి చేయనుంది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ 31 శాతం తగ్గి 33 లక్షల మందికి పరిమితమైంది. 

Updated Date - 2021-06-23T09:24:38+05:30 IST