కొవాగ్జిన్‌కు జీఎంపీ సర్టిఫికెట్‌

ABN , First Publish Date - 2021-08-06T09:04:44+05:30 IST

తాము అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాకు హంగరీ నుంచి ‘ఉత్తమ తయారీ విధానాల(జీఎంపీ) అమలు’ ధ్రువీకరణ లభించినట్టు ఆ సంస్థ ట్వీట్‌ చేసింది.

కొవాగ్జిన్‌కు జీఎంపీ సర్టిఫికెట్‌

యూరోపియన్‌ ఔషధ నియంత్రణ సంస్థలనుంచి అందిన మొట్టమొదటి ధ్రువపత్రం

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తాము అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాకు హంగరీ నుంచి ‘ఉత్తమ తయారీ విధానాల(జీఎంపీ) అమలు’ ధ్రువీకరణ లభించినట్టు ఆ సంస్థ ట్వీట్‌ చేసింది. ‘‘మా ప్రయాణంలో మరో మైలురాయిని అధిగమించాం. కొవాగ్జిన్‌కు హంగరీ నుంచి జీఎంపీ సర్టిఫికెట్‌ లభించింది. భారత్‌ బయోటెక్‌కు యూరోపియన్‌ ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అందిన తొలి ‘యూడ్రాజీడీఎంపీ’ కంప్లయన్స్‌ సర్టిఫికెట్‌ ఇది’’ అని ఒక ట్వీట్‌లో పేర్కొంది. హంగరీ ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మసీ అండ్‌ న్యూట్రిషన్‌’ కొవాగ్జిన్‌కు ఈ ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చింది. యూడ్రాజీడీఎంపీ అంటే.. ఐరోపా దేశాల్లో ఉత్తమ తయారీ విధానాల అమలుకు, తయారీ అనుమతులకు సంబంధించిన అతి పెద్ద డేటాబేస్‌. ఆ డేటాబే్‌సలో కొవాగ్జిన్‌కు వచ్చిన ఈ సర్టిఫికెట్‌ కూడా లిస్ట్‌ అయింది. కొవాగ్జిన్‌ తయారీలోనూ.. తయారైన వ్యాక్సిన్‌ను పరీక్షించడంలోనూ.. ప్రామాణికమైన, కఠినమైన జీఎంపీ (ఉత్తమ తయారీ విధానాలు) పాటిస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ ఈ సందర్భంగా వెల్లడించింది. మార్కెట్‌లో ఉన్న అన్ని బ్యాచ్‌లను హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీ లో ఉన్న యూనిట్‌లోనే తయారు చేశామని, పూర్తి స్థాయిలో నాణ్యత ఆడిట్‌ జరిగినవేనని తెలిపింది. కర్ణాటకలోని మాలూర్‌, గుజరాత్‌లోని అంకలేశ్వర్‌లో జూన్‌ ప్రారంభం నుంచి కొవాగ్జిన్‌ టీకా ఉత్పత్తి మొదలైందని భారత్‌ బయోటెక్‌ తెలిపింది. ఈ యూనిట్లలో తయారైన వ్యాక్సిన్‌ సెప్టెంబరు నుంచి అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. ఆరోగ్యవంతులైన వ్యక్తులకు వేసే వ్యాక్సిన్ల విషయంలో భద్రత చాలా ముఖ్యమని.. దీన్లో కంపెనీ రాజీపడే ప్రసక్తి లేదని పేర్కొంది. ఇప్పటి వరకూ 7 కోట్ల డోసులను సరఫరా చేసినట్లు తెలిపింది.

Updated Date - 2021-08-06T09:04:44+05:30 IST