కౌలాలంపూర్: చిమ్మచీకటి.. మసగ్గా వెలిగే నియాన్‌లైట్ల వెలుగులు తప్ప కనిపించని పరిసరాలు.. ఎర్రని కాంతితో మెరుస్తూ టప్టప్మనే శబ్దంతో అటూఇటూ తిరిగే షటిల్ కాక్.. ఇదేదో గమ్మత్తుగా ఉంది కదూ! ఇది కూడా క్రీడే. దీనిని ‘షటిల్ ఇన్ ది డార్క్’ అంటారు. ఆశ్చర్యంగా ఉంది కదూ.
సాధారణంగా ఏ క్రీడలైనా పగటి వేళ జరుగుతాయి. సాయంత్రమో, రాత్రివేళో మొదలయ్యే మ్యాచ్‌లు కూడా పట్టపగలు జరిగినట్టే అనిపిస్తాయి. ఫ్లడ్ లైట్ల కాంతులతో స్టేడియం నిండిపోతుంది. కానీ, ఇప్పుడు దీనికి భిన్నంగా చీకట్లో ఆడే బ్యాడ్మింటన్ ఒకటి వచ్చేసింది. ‘షటిల్ ఇన్ ది డార్క్’ అనే ఈ ఆటకు ఇప్పుడు విపరీతమైన ఆదరణ లభిస్తోంది.
కౌలాలంపూర్ ప్రతిష్ఠాత్మక పెట్రోనాస్ ట్విన్ టవర్స్‌లో 2021 చివరిలో ఓ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ ‘షటిల్ ఇన్ ది డార్క్’ బ్యాడ్మింటన్‌ను ప్రారంభించింది. ప్రజలను బ్యాడ్మింటన్‌వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ సరికొత్త షటిల్ ఆట కరోనా ఆంక్షల నేపథ్యంలో కొన్ని రోజుల్లోనే మూతపడింది. మళ్లీ ఇప్పుడు ఇది తెరుచుకుంది.
తమ ప్రధాన లక్ష్యం ప్రజలను మళ్లీ ఈ క్రీడవైపు ఆకర్షించడమేనని ఐనిక్ స్పోర్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఇనోజెమ్త్సెవా అన్నారు. ఔత్సాహికులకు మాత్రమే కాదని, ఇప్పటి వరకు బ్యాడ్మింటన్ ఆడని వారిని కూడా ఈ క్రీడవైపు ఆకర్షిస్తున్నట్టు చెప్పారు. నిజానికి ఇలాంటి ఫ్యూచరిస్టిక్ కోర్టులో అథ్లెట్లు ఆడడం సవాలేనని ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ కోచ్ లీ యాన్ షెంగ్ అన్నారు. ఎందుకంటే తొలుత వారు ఆ చీకట్లకు అలవాటు పడాల్సి ఉంటుందన్నారు. అయినా సరే ఆడడం సాధ్యమేనని, దానిపై కొద్దిపాటి దృష్టిపెడితే సులభంగా ఆడొచ్చని ప్రొఫెషనల్ ప్లేయర్ హో యెన్ మీ చెప్పారు. మామూలు బ్యాడ్మింటన్‌తో పోలిస్తే ఇది కొంత భిన్నమే అయినా అలవాటు పడితే సాధారణంగానే ఉంటుందన్నారు.
అయితే, ఈ కోర్టులో ఆడేందుకు డబ్బులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. కోర్టులను, వారి నియాన్ ఎక్విప్మెంట్ను ఉపయోగించుకున్నందుకు ‘షటిల్ ఇన్ ది డార్క్’ యాజమాన్యానికి గంటకు 180 రింగిట్.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 3,244 చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ పబ్లిక్ కోర్టుకు అయితే మాత్రం 20 రింగిట్ (దాదాపు రూ.360) చెల్లించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి