రాఘవేంద్రుడి వైభవం

ABN , First Publish Date - 2022-08-10T04:53:33+05:30 IST

పవిత్ర తుంగభద్ర తీరంలో వెలసిన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి 351వ సప్తరాత్రోత్సవాలు బుధవారం నుంచి ఆరంభం కానున్నాయి.

రాఘవేంద్రుడి వైభవం

తుంగా తీరాన ఆధ్యాత్మిక పరిమళం
నేటి నుంచి మంత్రాలయంలో సప్తరాత్రోత్సవాలు
14న మహా రథోత్సవం  


మంత్రాలయం, ఆగస్టు 9 : పవిత్ర తుంగభద్ర తీరంలో వెలసిన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి 351వ సప్తరాత్రోత్సవాలు బుధవారం నుంచి ఆరంభం కానున్నాయి. బృందావన రూపంలో వెలసిన మహిమాన్వితుడు రాఘవేంద్రుడిని దర్శించుకోడానికి దేశవ్యాప్తంగా భక్తులు తరలి రానున్నారు. ఈనెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వైభవంగా సప్తరాత్రోత్సవాలు జరుగనున్నాయి.

రాఘవేంద్ర స్వామి జీవనరేఖలు

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే తిమ్మనభట్టు, గోపమ్మ దంపతులకు కీ.శ.1595 సంవత్సరంలో మన్మథనామ సంవత్సరం ఫాల్గున శుద్ధ సప్తమి గురువారం రాఘవేంద్రుడు జన్మించారు. ఈయన అసలు పేరు వెంకనాథుడు. తన పాండిత్యంతో పరిమళాచార్యుడు, మహాభాష్య పండితాచార్యులు, భట్టాచార్యులనే బిరుదులు సంపాదించారు. 1623 సంవత్సరం పాల్గుణ శుద్ధ విదియనాడు మధ్వపీఠ సాంప్రదాయాన్ని అనుసరించి సన్యాసం స్వీకరించారు. రాఘవేంద్రతీర్థగా నామకరణం పొందారు. క్రీ.శ.1671 శ్రావణ బహుళ విదియ గురువారం సూర్యోదయానికి ముందు మూల రాముడిని పూజించి జీవ సమాధి పొందారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రాలయంలో ఆగస్టునెలలో సప్తరాత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయతీగా మారింది.

భారతదేశంలో వెలసిన బృందావనాలు

మంత్రాలయం మఠం ప్రధాన కేంద్రంగా దేశంలో, విదేశాల్లో దాదాపు వెయ్యి పైగా బృందావనాలు వెలిశాయి. సింగపూర్‌, మలేషియా, ఆస్ర్టేలియా, అమెరికా దేశాల్లో సైతం బృందావనాలకు నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి.

భక్తులకు ఏర్పాట్లు: ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు  తాగునీరు, వసతి, భోజనం, పరిశుభ్రత, తుంగాస్నానం, ఆసుపత్రి, అంబులెన్సు, క్యూలైన్లు, వీఐపీలకు వసతి, దర్శనం, పరిమళ ప్రసాదం,  ప్రత్యేక కౌంటర్లు, వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం మొదలైన ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రధాన రహదారులను, వసతిగృహాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.

ఉత్సవాలకు భారీ పోలీసు బందోబస్తు: మంత్రాలయం సీఐ భాస్కర్‌, ఎస్‌ఐ వేణుగోపాలరాజు ఆధ్వర్యంలో 350 నుంచి 500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు.

ప్రారంభానికి సిద్ధం: శ్రీమఠం ముందు భాగంలో నిర్మించిన మాధవమార్గ్‌ కారిడార్‌, మహాముఖ ద్వారం రెండో అంతస్తు, నూతన ముఖద్వారం, హరికథామృత మ్యూజియం, పద్మనాభతీర్థ 20 సూట్‌రూంలు, తులసీ గార్డెన్‌ మొదలైనవి సప్తరాత్రోత్సవాల సందర్భంగా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

10నుంచి 351వ ఆరాధనోత్సవాలు

మంత్రాలయం రాఘవేంద్రస్వామి 351వ ఆరాధన మహోత్సవాలు(సప్తరాత్రోత్సవాలు) ఆగస్టు 10 వ తేది నుంచి ఏడురోజుల పాటు  జరగనున్నాయి. 10న పీఠాధిపతి చేతుల మీదుగా ద్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. 11న రజిత మంటపోత్సవంలో భాగంగా శాఖోత్సవం నిర్వహిస్తారు. 12న పూర్వారాధన, 13న మధ్యారాధన, 14న ఉత్తర ఆరాధనలు ఉంటాయి. ఇందులో భాగంగా 14న మహార థోత్సవం కన్నులపండుగగా జరగనుంది. 15న సుజ్ఞానేంద్ర తీర్థుల ఆరాధన, 16 సర్వ సమర్పణోత్సవంతో ఉత్సవాలకు ముగింపు పలుకుతారు. ప్రతిరోజూ ప్రహ్లాదరాయలకు, మూలరాములకు పీఠాధిపతి విశేషపూజలు నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్భంగా మఠం ప్రాంగణమంతా విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ప్రతిరోజూ రాత్రి ఉత్సవ మూర్తి ప్రహ్లాదరాయలకు గజవాహనోత్సవం, చెక్క, వెండి, బంగారు, నవరత్న రథోత్సవాలు మఠం ప్రాంగణంలో నిర్వహిస్తారు. శ్రీమఠం మహాముఖద్వారం నుంచి రాఘవేంద్ర సర్కిల్‌ వరకు మహారథోత్సవం నిర్వహిస్తారు. అంతక ముందు పీఠాధిపతి  దివ్య సందేశాన్ని భక్తులకు వినిపిస్తారు.

ఉత్సవాల్లో మొదటి రోజు

రాఘవేంద్రస్వామి 351వ ఆరాధన మహోత్సవాల్లో జరిగే మొదటి రోజు బుధవారం జరిగే పూజా కార్యక్రమాలు.

తెల్లవారుజాము 4 గంటల నుంచి 5గంటల వరకు బృందావనానికి సుప్రభాతం, నిర్మల విసర్జనం
అనంతరం 5 నుంచి 6 గంటల వరకు క్షీరాభిషేకం
ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు ప్రహ్లాదరాయలకు పాదపూజ, పంచామృతాభిషేకం
ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు విశేష పంచామృతాభిషేకం
11 నుంచి 12.30 గంటల వరకు పీఠాధిపతుల సంస్థాన పూజ
12.30 నుంచి 1.30 గంటల వరకు అలంకరణ సంతర్పణ, హస్తోదకం
మధ్యాహ్నం  1.30 గంటల నుంచి 2.30 గంటల వరకు మహా మంగళహారతి, తీర్థప్రసాదాలు
సాయంత్రం 5 గంటలకు జ్ఞాన యజ్ఞం
అనంతరం సాయంత్రం 6 గంటలకు ధ్వజారోహణ, అశ్వ, గోపూజ, లక్ష్మి పూజలు, కార్యాలయాలకు శాంతి పూజలు
రాత్రి 8.30 గంటలకు రథోత్సవాలు, ధాన్య పూజలు, ఊంజల సేవ
యోగీంద్ర కళా మండపంలో కర్నూలు చెందిన లాస్య  ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కూచిపూడి నృత్యం, బెంగళూరుకు చెందిన కళా గౌరి నృత్యాలయ వారిచే భరతనాట్యం భక్తులను అలరించనున్నాయి.

Updated Date - 2022-08-10T04:53:33+05:30 IST