స్టార్టప్‌ రంగంలో.. అట్టడుగు ఘనత జగన్‌దే!

ABN , First Publish Date - 2022-07-06T08:31:20+05:30 IST

స్టార్టప్‌ కంపెనీల వృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలో అట్టడుగున నిలిపిన ఘనత సీఎం జగన్‌రెడ్డికే దక్కుతుందని టీడీపీ ఎద్దేవా చేసింది. కేంద్రం తాజాగా విడుదల చేసిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌ను.. బిహార్‌ సరసన అట్టడుగున నిలిపారని మండిపడింది

స్టార్టప్‌ రంగంలో.. అట్టడుగు ఘనత జగన్‌దే!

రాష్ట్రాన్ని బిహార్‌ సరసన చేర్చారు.. చంద్రబాబు కృషి మట్టిపాలు

ఈవోడీబీలో ఫస్ట్‌ ర్యాంకొచ్చినా ఉపయోగం లేదు: టీడీపీ నేత పట్టాభి 


అమరావతి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): స్టార్టప్‌ కంపెనీల వృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలో అట్టడుగున నిలిపిన ఘనత సీఎం జగన్‌రెడ్డికే దక్కుతుందని టీడీపీ ఎద్దేవా చేసింది. కేంద్రం తాజాగా విడుదల చేసిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌ను.. బిహార్‌ సరసన అట్టడుగున నిలిపారని మండిపడింది. జగన్‌ తన  పనితీరుతో రాష్ట్రం పరువు తీశారని విమర్శించింది. ఈ తరహా కంపెనీలు రాష్ట్రంలో ఎదిగేందుకు చంద్రబాబు ఎంతో కృషి చేశారని.. దానిని జగన్‌ మట్టిపాలు చేశారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం మంగళవారమిక్కడ దుయ్యబట్టారు. ‘స్టార్టప్‌ కంపెనీల వృద్ధిలో అట్టడుగున మనతోపాటు బిహార్‌, మిజోరం, లద్ధాఖ్‌ మాత్రమే ఉన్నాయి. తమది అద్భుత పాలన అని.. లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి పరిగెత్తుకువస్తున్నాయని డబ్బా కొట్టుకుంటున్న ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? ఇవే ర్యాంకులను కేంద్రం టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018-19లో విడుదల చేసినప్పుడు మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. అప్పుడు మొత్తం 36 ప్రమాణాలను కేంద్రం ప్రామాణికంగా తీసుకుంటే అన్నింటిలోనూ మన రాష్ట్రం ఫలితాలను చూపించింది. తన కంటే ముందే స్టార్టప్‌ కంపెనీల కోసం ఒక విధానాన్ని తెచ్చి ముందంజలో నిలిచిందని అప్పట్లో కేంద్రం రాష్ట్రాన్ని ప్రశంసించింది.


టీడీపీ హయాంలో 259 స్టార్టప్‌ కంపెనీలు ఏర్పడి పనిచేశాయి. ఈ కంపెనీల కోసం కేంద్రం దేశవ్యాప్తంగా మూడు వర్క్‌షాపులు నిర్వహిస్తే అందులో ఒకటి విశాఖలో పెట్టింది. విశాఖలో నెలకొల్పిన ఇంక్యుబేషన్‌ సెంటర్‌లో 50 స్టార్టప్‌ కంపెనీలు పనిచేశాయి. ఈ రంగంలో మన కృషి చూసి పశ్చిమ బెంగాల్‌, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాలకు మన రాష్ట్రాన్ని మెంటార్‌గా (పథ నిర్దేశకుడు)గా కేంద్రం పెట్టింది’ అని వివరించారు. విశాఖను ఫిన్‌టెక్‌ టెక్నాలజీకి కేంద్రంగా మలచడానికి అక్కడ ఫిన్‌టెక్‌ వ్యాలీకి టీడీపీ ప్రభుత్వం రూపకల్పన చేసిందని, అప్పట్లో 75 కంపెనీలు అక్కడకు రావడానికి ఆసక్తి చూపించాయని చెప్పారు. ఆ కృషి మొత్తాన్ని జగన్‌రెడ్డి ప్రభుత్వం తన అజ్ఞానంతో నాశనం చేసిందని, ఈ ర్యాంకుల్లో రాష్ట్రం అట్టడుగు స్థానానికి దిగజారడం దీనికి నిదర్శనమని చెప్పారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ (ఈవోడీబీ) ర్యాంకుల్లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడం తమ ఘనతగా వైసీపీ ప్రభుత్వ పెద్దలు జబ్బలు చరచుకుంటున్నారని, టీడీపీ సర్కారు చేసిన కృషికి కొనసాగింపుగానే ఆ ర్యాంకు కొనసాగింది తప్ప జగన్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లలో నాలుగు సార్లు ఆ ర్యాంకులు ఇచ్చారని.. మొదటిసారి రెండో ర్యాంకు.. తర్వాత మూడుసార్లు దేశంలో మొదటి ర్యాంకును సాధించిందని గుర్తుచేశారు. ఇప్పుడు మొదటి ర్యాంకు వచ్చినా రాష్ట్రానికి ఉపయోగం లేకుండా పోయిందని, అదే ర్యాంకు వచ్చిన మిగిలిన రాష్ట్రాలకు పెట్టుబడులు వెల్లువలా వస్తే మనకు మాత్రం ఒట్టి చేతులు మిగిలాయని ఆయన చెప్పారు. ‘కర్ణాటకకు విదేశీ పెట్టుబడులు రూ.రెండున్నర లక్షల కోట్లు, గుజరాత్‌కు రూ.2.20 లక్షల కోట్లు వస్తే మన రాష్ట్రానికి 3,750 కోట్లే వచ్చాయి. జగన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో వచ్చిన పెట్టుబడులు ఇవి. టీడీపీ హయాంలో ఐదేళ్లకు కలిపి రూ.65 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. జగన్‌ తన తల ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించుకోవాలి’ అని పట్టాభి అన్నారు.

Updated Date - 2022-07-06T08:31:20+05:30 IST